Share News

Caste Census: కులం.. బలం.. ఇంధనమై కాంగ్రెస్‌ పయనం

ABN , Publish Date - Aug 01 , 2025 | 05:50 AM

కాంగ్రెస్‌ పార్టీ భవిత గురించి ఇప్పటికే చాలా విశ్లేషణలు వచ్చాయి. ఆశల కంటే వాటిల్లో నిరాశలే ఎక్కువ! 1989 నుంచి 2014 వరకూ

Caste Census: కులం.. బలం.. ఇంధనమై కాంగ్రెస్‌ పయనం

కాంగ్రెస్‌ పార్టీ భవిత గురించి ఇప్పటికే చాలా విశ్లేషణలు వచ్చాయి. ఆశల కంటే వాటిల్లో నిరాశలే ఎక్కువ! 1989 నుంచి 2014 వరకూ దేశ రాజకీయాలను నిశితంగా పరిశీలించిన వారిలో ఎక్కువమంది ఒక పార్టీ స్వంత ఆధిక్యతతో కేంద్రంలో సమీప భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే అవకాశం లేదని భావించారు. దేశంలో సంకీర్ణ రాజకీయాల యుగం మొదలైందనీ, నిజమైన సమాఖ్య స్థాపనకూ, రాష్ట్రాలతో సంప్రదింపులతో కూడిన విధానాలకు అది దోహదం చేస్తుందనీ ఊహించారు. 2014 వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. పదేళ్లపాటు బీజేపీకి సంపూర్ణ ఆధిక్యత లభించింది. కిందటి ఎన్నికల్లో ఆ ఆధిక్యతకు మళ్లీ గండిపడింది. అయినా ఎన్డీయే కూటమిగా బీజేపీ అధికారాన్ని దక్కించుకుంది. ప్రస్తుతానికి కూటమిలో లుకలుకలు లేవు. బీజేపీదే సర్వాధికారం అన్నట్లుగా పాలన సాగుతోంది. హిందీ భాషపై రేగిన వివాదంలో కానీ, జమిలి ఎన్నికల విషయంలో కానీ ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు బీజేపీని పూర్తిగా సమర్థిస్తూ మాట్లాడుతున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలుపుకోసం కాంగ్రెస్‌ చాలా గట్టిగా ప్రయత్నించింది. ముఖ్యంగా కులగణనను చేపట్టి విద్య, ఉద్యోగాలు, పదవుల్లో కులాల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచుతామని వాగ్దానం (జిత్నీ ఆబాదీ ఉత్నా హక్‌) చేసింది. ప్రధాని మోదీ కోరినట్లుగా 400 లోక్‌సభ స్థానాల్లో బీజేపీని గెలిపిస్తే రాజ్యాంగాన్ని సవరించి మొత్తం రిజర్వేషన్లనే రద్దుచేస్తారని ఉధృతంగా ప్రచారమూ చేసింది. అయినా కాంగ్రెస్‌ 100 మార్క్‌ను దాటలేదు. కులగణన, రిజర్వేషన్ల పెంపు అస్త్రాన్ని కాంగ్రెస్‌ గరిష్ఠ స్థాయిలో ఉపయోగించింది. నిజానికి భారత్‌ జోడో యాత్ర సందర్భంగా రాహుల్‌ గాంధీ కులగణనకు కొంత ఊపును తీసుకొచ్చారు. వెనుకబడిన కులాలను (బీసీలు) రాజకీయంగా ఆకర్షించటానికి కాంగ్రెస్‌ పార్టీకి ఒక బ్రహ్మాస్త్రం లభించిన భావన సైతం అప్పుడు నెలకొంది. ఎంతో కీలకమైన లోక్‌సభ ఎన్నికల్లోనూ, అంతకు కొద్దిగా ముందూ వెనుకా జరిగిన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ అస్త్రం ఆశించిన ఫలితాలను సాధించి పెట్టలేదు. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ గెలుపులో కులగణన అంశం ప్రభావం దాదాపుగా లేదనే చెప్పొచ్చు.


సామాజిక, ఆర్థిక మార్పులు వేగంగా వస్తున్న నేపథ్యంలో కులగణన–రిజర్వేషన్ల నినాదంపై ఆధారపడి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్‌ విజయం సాధించగలదా? అన్నదే ఆ పార్టీ ముందున్న కీలక సవాల్‌గా మారింది. కులాల లెక్కలు తీయటం కష్టం కాదు. ప్రతి కులంలోనూ ఒక కుటుంబం సామాజిక ఆర్థిక పరిస్థితిని మదింపువేసి, ఉన్నది ఉన్నట్లు తెలుసుకోవటమే కష్టం. బీసీల్లోనే కాదు.. ఎస్సీ, ఎస్టీల్లో కూడా ఆర్థిక అంతరాలను పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్ల విధానాల్లో మార్పులు తీసుకు రావటం సవాళ్లతో కూడుకున్న పని. వివిధ కులాల్లో సంపన్న శ్రేణులను గుర్తించాలని అనేక సందర్భాల్లో కోర్టులు చెబుతున్న విషయాన్ని విస్మరించలేని పరిస్థితులే ఉన్నాయి. కులాల్లోని పేద, మధ్య, ధనిక వర్గాలను పరిగణనలోకి తీసుకుని కొత్త విధానాలు రూపొందించకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో కూడా నాలుగైదు కులాల ఆధిపత్యమే కొనసాగే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే ఆ తరహా ఆధిపత్య ఛాయలు స్పష్టంగా కనపడుతున్నాయి. కులగణన సర్వే తీరు గురించి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంతగొప్పగా చెప్పుకొన్నా దానికి పరిమితులు చాలానే ఉన్నాయి. బిహార్‌ అయినా, తెలంగాణ అయినా దీనికి మినహాయింపు కాదు. కులం, మతం గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవారు ఆర్థిక పరిస్థితి వచ్చేటప్పటికి అర్ధసత్యాలే చెబుతారు. ఆస్తులు వెల్లడించటం స్వచ్ఛందం కాబట్టి రికార్డుల్లోకి ఎక్కినవి.. ముఖ్యంగా పట్టణ, నగర ప్రాంతాల్లో తక్కువగానే ఉంటాయి. ఇళ్లస్థలాలు, వాహనాలు, షేర్లు, మూచువల్‌ ఫండ్స్‌, బంగారం లాంటివి ఆ కోవలోకే వస్తాయి. ఆస్తులు, సంపదలపై అసలు సమాచారం లేకుండా కులగణన వల్ల ఆశించిన ప్రయోజనం కలగదు. సర్వేల పరిమితులు రాజకీయ నాయకత్వాలకు స్పష్టంగా తెలుసు. రాజకీయాలు మాట్లాడనీయవు అంతే! ఈ పరిమితులు ఎన్ని ఉన్నప్పటికీ తెలంగాణలో చేపట్టిన కులగణననూ, దాని ఆధారంగా పెంచిన రిజర్వేషన్లను ఒక నమూనాగా దేశం ముందుపెట్టి, వచ్చే సాధారణ ఎన్నికల్లో కొట్లాడాలని కాంగ్రెస్‌ పార్టీ గట్టి నిర్ణయం తీసుకుంది.


తెలంగాణ సర్వే ఆదర్శ నమూనాగా నిలవాలంటే అందులో నమోదైన కీలక విషయాలు వెల్లడి కావాలి. ఇప్పటిదాకా ప్రభుత్వం వెల్లడించిన విషయాలు సాధారణమైనవి. పెద్దగా వివాదాస్పదం కానివి. కానీ వాటిల్లో కూడా ఒక విషయం వివాదాస్పదం అయింది. ముస్లింల్లోని 10.8 శాతం మందిని బీసీల జాబితాలో చూపించటమే దీనికి కారణం. బీసీ ఈ–కేటగిరిలో ఉన్న ముస్లిం కులాలను సర్వే సందర్భంగా ఆ కేటగిరీలోనే నమోదుచేసి లెక్కించారు. హిందూ బీసీల్లోని 46.25 శాతానికి దాన్ని కలిపి లెక్కించి మొత్తంగా బీసీల సంఖ్యను 56.30 శాతంగా తేల్చారు. బిహార్‌లోనూ అలాగే చేశారు. మండల్‌ కమిషన్‌ కూడా ముస్లింల్లోని వెనుకబడిన సమూహాలను బీసీలుగానే పరిగణించింది. ముస్లింల జనాభా 16.16 శాతం ఉంటే అందులో 8.40 శాతం మందిని బీసీలుగా లెక్క వేసింది. హిందూ బీసీలను 43.70 శాతంగా అంచనా కట్టింది. రెండు వర్గాల్లో కలిపి మొత్తంగా బీసీలు 52 శాతం ఉంటారని పేర్కొంటూ 27 శాతం రిజర్వేషన్లను సిఫార్సు చేసింది. మండల్‌ కమిషన్‌ సిఫార్సులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో సైతం ముస్లింలను బీసీల్లో కలపటాన్ని తప్పుపట్టలేదు. దేశంలో ఎక్కడా లేనట్లుగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వమే కొత్తగా ముస్లింలను బీసీలుగా లెక్కించిందనే విమర్శ వాస్తవాల ముందు నిలబడదు. ముస్లింలకు సంబంధించి మరో వింత వాదన కూడా విపరీత ప్రచారాన్ని పొందుతోంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కల్పించిన (ఈడబ్ల్యూఎస్‌) రిజర్వేషన్లలో ముస్లింలు లబ్ధిపొందుతున్నారు కాబట్టి.. మళ్లీ రాష్ట్ర బీసీ జాబితాలో వాళ్లను ఎందుకు చేర్చారన్న వాదన అలాంటిదే. ఈడబ్ల్యూఎస్‌ ద్వారా లబ్ధి పొందేవారు ఇప్పటికే అమల్లో ఉన్న రిజర్వేషన్ల పరిధిలో లేని వారై ఉండాలన్న నిబంధన స్పష్టంగా ఉంది. అందువల్ల రెండు కేటగిరీల్లో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నారన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు.


సమగ్ర కులగణనలో లభ్యమైన వ్యక్తిగత సమాచారం ఇవ్వాలని ఎవరూ అడగటం లేదు. వ్యక్తుల సమాచార గోప్యతకు భంగం కలిగించే విషయాలను వెల్లడించాలనీ ఆశించటం లేదు. మరోవైపు సర్వే ఫలితాలను విశ్లేషించటానికి నియమించిన జస్టిస్‌ సుదర్శనరెడ్డి నేతృత్వంలోని నిపుణల కమిటీ సిఫార్సులు కూడా వచ్చేశాయి. వివిధ కులాల వెనుకబాటుతనాన్ని 42 అంశాల ఆధారంగా నిర్ధారించి నిర్దిష్ట నివారణా చర్యలనూ కమిషన్‌ సూచించి ఉండొచ్చు. ప్రభుత్వ విధానాలను అవి ప్రభావితమూ చేయొచ్చు. కానీ కులగణనలో తేలిన అసలు సమాచార వెల్లడికీ నిపుణుల కమిటీ సిఫార్సులకూ సంబంధం లేదు. సమాచారాన్ని వెల్లడించక పోవటం వల్ల ప్రభుత్వం ఏదో దాస్తోందన్న అభిప్రాయమే తప్ప లాభం ఏమీ ఉండదు. మండల్‌ కమిషన్‌ బీసీలకు 27 శాతం రిజర్వేషన్లను సిఫార్సు చేయటానికి ప్రాతిపదికగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో వారెంత శాతం ఉన్నారో స్పష్టంగా పేర్కొంది. మొత్తం ఉద్యోగుల్లో 12.55% మంది బీసీలు మాత్రమే ఉన్నారని తేల్చింది. హోదాల వారీగా లెక్కలనూ ఇచ్చింది. అప్పటికే సుప్రీంకోర్టు నిర్దేశించిన 50% (రిజర్వేషన్ల) పరిమితిని దృష్టిలో ఉంచుకుని 27 శాతం రిజర్వేషన్లను సిఫార్సు చేసింది. బీసీలకు ఉద్యోగ, విద్య, రాజకీయ రిజర్వేషన్లను 42% పెంచటానికి ఉద్దేశించిన రెండు బిల్లులను తెలంగాణ శాసనసభ ఆమోదించింది. వాటిని రాజ్యాంగం 9వ షెడ్యూలులో చేర్చడానికి రాష్ట్రపతికీ పంపారు. కానీ ఇప్పటికీ ఉద్యోగుల్లో బీసీలు ఎంతమంది ఉన్నారో తెలిపే సమాచారం లేదు. ఇంజనీరింగు, వైద్య కాలేజీల్లో వాళ్లకు ప్రాతినిధ్యం ఎంతో వెల్లడి కావటం లేదు. నిజానికి వీటిని వెల్లడించినప్పటికీ కులగణనకు సంపూర్ణ సార్థకత రాదు. ప్రతికులానికి చెందిన వారు ఉద్యోగ, విద్య, రాజకీయ పదవుల్లో ఎంతమంది ఉన్నారో వెల్లడించగలగాలి. 134 బీసీ కులాల జనాభా కూడా విడివిడిగా ఎంతమంది ఉన్నారో తెలపగలగాలి.


రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఎన్నికల వాగ్దానం ప్రకారమే బీసీ రిజర్వేషన్లను 42 శాతంగా నిర్ధారించారు. కానీ ఆ వర్గాల జనాభా 56% ఉన్నారని లెక్కలు చెబుతున్నప్పుడు రిజర్వేషన్లు 42 శాతానికే ఎందుకు ఆగాయన్న ప్రశ్నా తలెత్తుతుంది. బీసీ కమిషన్‌ కూడా 42% సరిపోతుందనీ చెబితే అందుకు శాస్త్రీయ ప్రాతిపదికా వెల్లడి కావాలి. ‘జిత్నీ ఆబాదీ ఉత్నా హక్‌’ విధానమైనప్పుడు 42 శాతానికి తర్కమేమిటో తెలపాల్సి వస్తుంది. తెలంగాణ నమూనాతో దేశ ప్రజలను ఆకర్షించాలంటే దానిపై చర్చను వచ్చే ఎన్నికల వరకూ కాంగ్రెస్‌ రాజకీయంగా సజీవంగా ఉంచగలగాలి. బహుశా అందుకనే 42 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టాలను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో ప్రవేశపెట్టే విధంగా బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావటానికి ఢిల్లీ కేంద్రంగా కార్యాచరణకు పదును పెడుతోంది. జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా, రాష్ట్రపతితో భేటీ అందులో భాగాలే. ఇక కులగణన, రిజర్వేషన్ల పెంపు ఆధారంగా కాంగ్రెస్‌కు ప్రజాభిమానం పెరిగే ఏ అవకాశాన్నీ బీజేపీ తేలికగా తీసుకోవటం లేదు. కులాలవారీ జనాభాగణనకు ఆదేశాలు జారీచేయటమే దానికి నిదర్శనం. కిందటి లోక్‌సభ ఎన్నికల ప్రణాళికలో కులగణన గురించి బీజేపీ ఒక్క మాటను కూడా ప్రస్తావించలేదు. కనీసం కాంగ్రెస్‌పై, ఆ విషయమై విమర్శ కూడా లేకుండా అందులో జాగ్రత్తలు తీసుకుంది.


అసెంబ్లీలు ఎన్ని చట్టాలు చేసినా సుప్రీంకోర్టు కుల ఆధారిత రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తివేస్తే తప్ప అడుగులు ముందుకు పడవు. మండల్‌ సిఫార్సుల సందర్భంగా ఇచ్చిన తీర్పును తోసిపుచ్చే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. కానీ అంతవరకే చేయగలదు. న్యాయసమీక్ష పేరిట సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేస్తే పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుంది. ఈడబ్ల్యూఎస్‌ తీర్పు సందర్భంగా 50% రిజర్వేషన్ల పరిమితిని సుప్రీంకోర్టు తొలగించిందని రాజకీయంగా వాదించొచ్చు. కుల ఆధారిత రిజర్వేషన్లకు 50% పరిమితి యథాతథంగా కొనసాగుతుందని ఈడబ్ల్యూఎస్‌ తీర్పులో స్పష్టంగా ఉంది. బీసీ రిజర్వేషన్ల అంశం ఉత్తరప్రదేశ్‌, బిహార్‌లో మాత్రమే రాజకీయాలను గణనీయంగా మార్చగలిగింది. మిగతా చోట్ల అంత ప్రభావం చూపలేదు. 2010 నాటికి ఆ రెండు రాష్ట్రాల్లోనూ పరిస్థితి మారిపోయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు ఆ రిజర్వేషన్ల ఆధారంగా రాజకీయాలు నడపటం కత్తిమీద సామే! ఇందులో తేడావస్తే ఒక అస్త్రం నిర్వీర్యమైపోతుంది. కాంగ్రెస్‌లో సైద్ధాంతిక శూన్యత ఏర్పడుతుంది! నెహ్రూ మార్గం నుంచి వైదొలగి రాంమనోహర్‌ లోహియా దారిలో నడుస్తున్న కాంగ్రెస్‌కు అప్పుడు మరో అన్వేషణ తప్పదు!

-రాహుల్ కుమార్

(ఆంధ్రజ్యోతి ఎడిటర్‌)

Updated Date - Aug 01 , 2025 | 05:50 AM