Canada Elections: ట్రంప్ అందించిన విజయం
ABN , Publish Date - May 01 , 2025 | 03:12 AM
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరిపై వ్యతిరేకత కెనడాలో లిబరల్ పార్టీకి అనుకూలంగా మారి, మెక్‌కార్నీ నాయకత్వంలో మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ఖలిస్తానీ అనుకూల ఎన్డీపీ పతనంతో భారత్–కెనడా సంబంధాలు మెరుగయ్యే అవకాశం కనిపిస్తోంది.

లిబరల్ పార్టీని గద్దెదించి, ఈమారు కచ్చితంగా కన్సర్వేటివ్‌లను అధికారంలోకి తెచ్చుకోవాలని కెనడా ప్రజలు నిజానికి ఎప్పుడో నిర్ణయించుకున్నారు. పదేళ్ళపాలన, కొన్ని అసమర్థ నిర్ణయాల వల్ల లిబరల్ పార్టీమీద బలమైన వ్యతిరేకత ఏర్పడివున్న తరుణంలో, అమెరికా అధ్యక్షుడిగా శ్వేతసౌధంలోకి అడుగుపెట్టిన డోనాల్డ్ ట్రంప్ కెనడియన్ల మనసు మార్చేశారు. అధికారపక్షంమీద వారిలోవున్న అంతటి ఆగ్రహాన్నీ వెనక్కునెట్టేసి, మళ్ళీ నువ్వేకావాలి అనేట్టుగా వారిని తయారుచేశారు. ఘోరంగా ఓడిపోతుందనుకున్న లిబరల్‌పార్టీ గతంలో కంటే ఓ ఎనిమిది స్థానాలు ఎక్కువే సంపాదించిదంటే అది ట్రంప్ పెట్టిన బిక్షే. కెనడా ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడు జోక్యం చేసుకున్నాడంటూ సామాజిక మాధ్యమాల్లో సరదా వ్యాఖ్యలు, మీమ్స్ చక్కెర్లు కొడుతున్నది అందుకే. కెనడా ప్రధాని కార్నీ విజయోత్సాహంలో మునిగితేలుతున్నారు. కెనడాకోసం, కెనడియన్ల ఐక్యతకోసం నిలబడతానని, ముక్కలు చెక్కలు చేసి, మూటగట్టుకుపోవాలని చూస్తున్న అమెరికా అధ్యక్షుడికి వ్యతిరేకంగా పోరాడతానని తన ప్రసంగంలో ప్రజలకు గట్టిహామీలు ఇచ్చాడాయన. ఎన్నికల ప్రచారమంతా అమెరికా అధ్యక్షుడు చుట్టూనే తిరిగినట్టుగా, ఈ విజయోత్సవ ప్రసంగంలోనూ అత్యధికభాగం ట్రంప్‌మీద విమర్శలే ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడికి మన భూములు కావాలి, మన వనరులు, నీరు, మన దేశమే కావాలి, బలమైన కెనడా నిర్మాణం ద్వారా ఆయన ఆటలు ఇక సాగనిచ్చేది లేదు అని కెనడా ప్రధాని ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు తమ జోలికి రాకుండావుంటే, తనకు ఈ విజయం దక్కేది కాదని కెనడా ప్రధానికి తెలుసు. లిబరల్‌పార్టీ పట్టుబట్టి గబ్బుపట్టిన జస్టిన్ ట్రూడోను గద్దెదింపి, అప్పటికి ఏ పాలనానుభవమూ లేని ఈయనను కుర్చీలో కూచోబెట్టినప్పటికే వాతావరణం వేడెక్కిపోయి ఉంది. అమెరికా 51వ రాష్ట్రంగా కెనడాను మార్చేస్తానని ట్రంప్ చేసిన ట్వీట్లు, అలా రూపాంతరం చెందితే కెనడాకు ఆర్థికంగా భౌగోళికంగా ఎంతో ప్రయోజనమంటూ చేసిన వ్యాఖ్యలు, అనంతరకాలంలో హెచ్చరికలు, బెదిరింపులు కెనడియన్లను భయోత్పాతంలోకి నెట్టేశాయి. సుంకాలయుద్ధంలో తమను ముందువరుసలో ఉంచి, అధికసుంకాలతో వేధించి దారికితెచ్చుకోవాలన్న ట్రంప్ ప్రయత్నం కెనడియన్లు తీవ్రంగా గర్హించారు.
కెనడాను అమెరికా స్వాహాచేస్తుందన్న భయంలో ఉన్న కెనడియన్లకు, ట్రంప్‌తో సాన్నిహిత్యం ఉన్న కన్సర్వేటివ్‌లు అధికారంలోకి వస్తే ఇక కెనడా కనుమరుగేనన్న అధికారపక్షం ప్రచారం చక్కగా చెవికెక్కింది. ట్రంప్‌మీద యుద్ధాన్ని ప్రకటించిన మెక్‌కార్నీ హీరోలాగా కనిపించారు. దీనితో, జనవరినాటికే 20పాయింట్లు వెనుకబడిపోయి ఉన్న లిబరల్‌పార్టీ వరుసగా నాలుగోసారి అధికారంలోకి రాగలిగింది. ఈ మారు కుర్చీ ఖాయమనుకున్న కన్సర్వేటివ్ పార్టీ ఆమడదూరంలో చతికిలబడిపోయింది. ట్రంప్ వాచాలత కారణంగా దాని అదృష్టరేఖ నాలుగునెలల్లోనే తారుమారైపోయింది. ఈ ఎన్నికల్లో మరో విశేషమైన పరిణామం ఖలిస్తానీ అనుకూల న్యూ డెమోక్రాటిక్‌పార్టీ (ఎన్డీపీ) పతనం, దాని నాయకుడు జగ్‌మీత్‌సింగ్ ఓటమిపాలై, బాధ్యతలనుంచి తప్పుకోవడం. భారత్‌కు ఎంతో ఉపశమనం కలిగించే మార్పు ఇది. సిక్కువోటర్లు ఈ మారు లిబరల్‌పార్టీ వైపు మళ్ళిపోవడంతో ఎన్డీపీ బాగా దెబ్బతినిపోయింది. భారత్–కెనడా సత్సంబంధాలకు విఘాతం కలిగించిన ట్రూడో, జగ్‌మీత్‌లు ఇద్దరూ ఇప్పుడు తెరమరుగైనారు. బ్రిటిష్ కొలంబియాలో ఖలిస్తానీ వేర్పాటువాది హర్‌దీప్‌సింగ్ నిజ్జర్ హత్య అనంతరం ట్రూడో ఆరోపణలు, విమర్శలతో ఇరుదేశాల మధ్య విభేదాలు పతాకస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. రెండుదేశాల మధ్యా నెలకొన్న అనిశ్చితి కారణంగా విద్యార్థులు, ఉద్యోగార్థులు కష్టాలుపడ్డారు. భారత్‌తో సత్సంబంధాలు కోరుకుంటున్నట్టుగా మెక్‌కార్నీ ఇప్పటికే ప్రకటించి ఉన్న నేపథ్యంలో, దీర్ఘకాలంగా దెబ్బతినివున్న సంబంధాలు ఇక మెరుగుపడతాయని ఆశించవచ్చు. కెనడా ప్రధాని విజయంపట్ల ప్రధాని మోదీ హర్షాన్ని వ్యక్తం చేయడంలోనూ ఈ ఆశాభావం కనిపిస్తోంది. గాడితప్పిన విద్య–వాణిజ్యబంధాలు, ఇమిగ్రేషన్ విధానాలను రెండుదేశాలు చక్కదిద్దుకుంటాయని ఆశిద్దాం.