Broken Friendship: చెడిన స్నేహం..
ABN , Publish Date - Aug 02 , 2025 | 04:16 AM
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు భారతప్రధాని నరేంద్రమోదీని మించిన స్నేహితుడు, ఆత్మీయుడు ఈ భూప్రపంచంమీద ఇంకెవ్వరూ లేరనీ..

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు భారతప్రధాని నరేంద్రమోదీని మించిన స్నేహితుడు, ఆత్మీయుడు ఈ భూప్రపంచంమీద ఇంకెవ్వరూ లేరనీ, ఉండబోరనీ బీజేపీ నాయకులే కాదు, దేశప్రజల్లో అత్యధికులు కూడా ఎంతోకాలంగా నమ్ముతున్నారు. భౌగోళిక సరిహద్దులు, వాణిజ్యబంధాలు, ఆయుధలావాదేవీలను దాటిన మోదీ–ట్రంప్ ఆలింగనాల స్థాయి స్నేహం వల్ల దేశానికి ఎంతో ప్రయోజనం చేకూరిందనీ, భారత్ ఖండాంతరఖ్యాతికి ఈ సాన్నిహిత్యం పునాదిగా ఉపకరించిందన్న విశ్లేషణలనూ జనం విశ్వసించారు. హౌడీ మోడీ, అబ్‌కీ బార్ ట్రంప్ సర్కార్ అంటూ చరిత్రలో కనీవినీ ఎరుగనిరీతిలో వీరిద్దరూ పరస్పరం ఎన్నికల్లో సహకరించుకున్నారు. మిత్రుడి మనసు అంతగా ఎరిగిన మోదీ ఇప్పుడు ఆయనతో ఎందుకు సమర్థవంతంగా వ్యవహరించలేకపోతున్నారో అర్థంకావడం లేదు.
భారతదేశాన్ని దారికి తేవడానికీ, అన్ని అడ్డుగోడలూ కూలిన ఇక్కడి మార్కెట్లోకి అమెరికన్ ఉత్పత్తులను కుమ్మరించడానికీ ట్రంప్ పట్టుదలగా ప్రయత్నిస్తున్నారన్నది వాస్తవం. అన్ని దేశాలతోనూ సుంకాల యుద్ధం చేస్తున్న ట్రంప్ ఒత్తిడి వ్యూహాలనూ అర్థంచేసుకోవచ్చు. భారతదేశంతో వాణిజ్య వ్యవహారంలో కాఠిన్యం ఉండవచ్చును గానీ, మోదీ విషయంలో మాత్రం కాస్తంత ప్రేమ, కాసిన్ని మినహాయింపులూ ఉంటాయనుకోవడం భ్రమ అని ఇప్పుడు తేలిపోయింది. వీళ్ళిద్దరికీ ఎక్కడో చెడిందన్న అనుమానాలూ మొదలైనాయి. లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ కోల్పోయిన మోదీని, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘనంగా గెలిచివచ్చిన గర్వంతోనే ట్రంప్ నిర్లక్ష్యం చేస్తున్నారని కొందరి అనుమానం.
ట్రంప్‌తో మోదీ అతివేగంగా కాల్పుల విరమణ ఒప్పందం, అంటే, వాణిజ్య ఒప్పందం చేసుకుంటే కొంతమేరకు శాంతింపచేయవచ్చునని విశ్లేషకుల సలహా. భారీ సుంకాలతో భారత్‌ను బాధించేప్రయత్నం చేస్తున్న ట్రంప్ ఆ మేరకు సంతృప్తిపడితే దాడి తగ్గవచ్చును. కానీ, ‘డెడ్ ఎకానమీ’ వంటి వ్యాఖ్యలు భారత్ పైన కాక, మోదీ ఏలుబడిమీద దాడి అని ఆయనకు తెలియకపోదు. భారతఆర్థికవ్యవస్థ రేపోమాపో మూడోస్థానానికి చేరుకోబోతున్నదని ఉధృత ప్రచారం జరుగుతున్నప్పుడు ఈ వ్యాఖ్య ప్రభావం చిన్నదేమీ కాదు. మోదీ యుద్ధాలు చేస్తున్న పొరుగుదేశంతోనే ట్రంప్ చమురు వెలికితీత ఒప్పందాలవంటివి చేసుకోవడం ద్వారా ప్రపంచానికి ఏ సందేశం వెడుతుందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. అమెరికా అధ్యక్షుడితో అత్యంత సాన్నిహిత్యం ఉన్న ఒక అంతర్జాతీయస్థాయి నాయకుడుగా నరేంద్రమోదీకి ఉన్న ఖ్యాతిని ట్రంప్ తన వరుసచర్యలతో, వ్యాఖ్యలతో బలహీనపరుస్తున్నారు. భారత్–పాక్ యుద్ధం తానే ఆపానని ముప్పైసార్లు ప్రకటించి, మోదీని నిత్యం ఆత్మరక్షణలోకి నెట్టేశారు ఆయన. యుద్ధం ఆపమని తనకు ఎవరూ చెప్పలేదని నిండుసభలో మోదీ ప్రకటించిన వెనువెంటనే ట్రంప్ మళ్ళీ అదే ప్రకటన చేసి ఇంటాబయటా ఇరకాటంలో పడేశారు. ఇక, పాక్ సైనికాధికారి మునీర్‌కు ఘనస్వాగతం, కడుపునిండా భోజనం, మోదీతో సమం చేస్తున్న ఆ ప్రశంసల జల్లుల ప్రభావం కాదనలేనిది. ట్రంప్ ఇక ఏమాత్రం మోదీపక్షాన లేరని, ఆయన పూర్తిగా పాక్‌తో అంటకాగుతున్నారని తేలిపోవడం వల్ల వచ్చే నష్టమేమీ లేదు. ఏకైక అగ్రరాజ్యానికి ఏ దేశం దగ్గరదో వేగంగా స్పష్టత రావడం మంచిదే. కానీ, ట్రంప్‌ను పూర్తిగా నమ్మి, తనతోపాటు దేశాన్ని కూడా అటుగా మోహరించిన మోదీ ఇప్పుడు నాలుగురోడ్ల కూడలిలో వదిలేశారన్న విమర్శలు తప్పవు. పరాధీనతనుంచి స్వతంత్రతకు మళ్ళడం, కనీసం అలా కనిపించడం అంత సులభమేమీ కాదు.
స్వార్థం, స్వలాభం తప్ప, రాజనీతిజ్ఞతలేని ట్రంప్ నమ్మదగ్గవ్యక్తి కాదన్నది సుస్పష్టం. అమెరికా అధ్యక్షుడిని గట్టిగా ఓ మాట అనలేని, వ్యాఖ్యలకు దీటుగా జవాబు ఇవ్వలేని, నిలదీయలేని స్థాయిలో మనం ఉన్నాం. యుద్ధం ఆపింది ఆయనేనని పొరుగుదేశం మాదిరిగా ఒప్పుకోలేక, ఆయన చెబుతున్నది పచ్చిఅబద్ధమని అనలేక, అంతవేగంగా ఎందుకు వెనక్కుతగ్గామో చెప్పలేక మన పాలకులు విపరీతంగా నలిగిపోవడం కనిపిస్తూనే ఉంది. ట్రంప్ అధికారంలోకి రాగానే వేలకోట్ల విలువైన ఆయుధాల కొనుగోలుకూ, భారీ చమురు దిగుమతులకు సంతకాలు చేసినా అమెరికా సంతృప్తిచెందడం లేదు. ఇప్పుడు మనకంటే ఓ తొమ్మిదిశాతం తక్కువ సుంకంతో తన పాక్‌ప్రేమను ట్రంప్ స్పష్టంచేశారు. నాయకుల అతిశయాలూ అహంకారాలూ దేశాల మధ్య సంబంధాలను, ద్వైపాక్షిక ప్రయోజనాలను ప్రమాదంలోకి నెట్టివేయడం సరికాదు.