Share News

నిజం చెప్తే నిష్ఠూరం..!

ABN , Publish Date - Apr 27 , 2025 | 01:58 AM

నేనప్పటికి గుంటూరు, చీరాలలో law and order డీఎస్పీగా పని చేశాను గాబట్టి ఇతర శాఖల్లోనూ చేస్తే సీనియర్‌ అధికారి అయ్యాక అనుభవాలన్నీ ఉపయోగపడతాయని నాకు intelligence బ్రాంచీలో పని చేయాలన్న...

నిజం చెప్తే నిష్ఠూరం..!

నేనప్పటికి గుంటూరు, చీరాలలో law and order డీఎస్పీగా పని చేశాను గాబట్టి ఇతర శాఖల్లోనూ చేస్తే సీనియర్‌ అధికారి అయ్యాక అనుభవాలన్నీ ఉపయోగపడతాయని నాకు intelligence బ్రాంచీలో పని చేయాలన్న ఆసక్తి కలిగింది. అప్పటికే intelligence హెడ్డాఫీసులోని అధికారులు పరిచయం అయ్యారు గనక నా ఆసక్తి గమనించి అప్పటి హెడ్‌– కె. విజయరామారావు నన్ను వైజాగ్‌ ఇంటెలిజెన్స్‌ డీఎస్పీగా బదిలీ చేశారు.

అప్పుడే తెలుగుదేశం పార్టీ పుట్టింది. ఎన్‌.టి. రామారావు ముమ్మరంగా జనంలో తిరుగుతున్నారు. ప్రజా రథానికి జనం జేజేలు పలుకుతున్నారు. తెలుగుదేశం జెండా చూసి మురిసిపోతున్నారు. ఎన్టీఆర్‌ మాటలకి, ఆయన ఆత్మగౌరవ నినాదానికి చెయ్యెత్తి జై కొడుతున్నారు. ఇన్ని మాటలు చెప్పటానికి ‘నిఘా’ ఏమీ పెట్టనవసరమే లేదు.

ఎన్టీఆర్‌ మీద అభిమానం ప్రజల్లో రోజు రోజుకూ పెరిగిపోతోంది. ముఖ్యంగా వెనకబడిన వర్గాల్లో వూపు చెప్పనలవి గానిది. నిజానికి కాంగ్రెస్‌ పార్టీ అంతవరకూ ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు మేలుచేసే పార్టీగా ముద్రపడింది. మిగతా backward classesలోనూ అవే పరిస్థితులున్నా కాంగ్రెస్‌ పట్టించుకోవడం లేదనే అపప్రథ ఉండేది. ఆ నేపథ్యంలో ఇందిరాగాంధీ కూడా విశాఖ వచ్చి రెండు మూడు మీటింగుల్లో మాట్లాడారు. కానీ ఒక చోట ఒక గ్రూపు, ఇంకో చోట ఇంకో గ్రూపు సభలను అనుకున్నంత గొప్పగా జరగనివ్వలేదు.


తెలుగుదేశం పార్టీకి ఎన్నికల్లో విజయావకాశాలు దండిగా వున్నాయని మా ఇంటెలిజెన్స్‌ హెడ్డాఫీసుకు తెలియచేయడం మొదలుపెట్టాను. అవతలి వాళ్లకు రోషాలు, కోపాలు! సి.ఆర్‌. నాయుడు ‘కమ్మ కళ్ల’తో చూస్తున్నాడు అని నా మీద పితూరీలు మొదలుపెట్టారు. నేను చూసింది కమ్మ కళ్లతో కాదు, జనం కళ్లతో. వాళ్లకది అర్థం కాలేదు. అర్థం చేసుకోవడానికి కనీస ప్రయత్నం కూడా చెయ్యలేదు.

నేను ఎన్టీఆర్‌కి గానీ, తెలుగుదేశానికి గానీ మేలు చేయాలని అనుకుంటే – ‘తెలుగుదేశానికేమీ పసలేదు, వాపే కానీ బలుపు లేదు’ అని చెప్పేసేవాణ్ణి. అప్పుడు అధికార పార్టీ ఆరాంగా నిద్ర పోయేది. కానీ నేను హెచ్చరిక లాంటిది చేసి ‘మేలుకోండి’ అని ఒక అధికారిగా, నిజాయితీగా చెప్పేసరికి దానికి రకరకాల రంగులు పూసి పెట్టారు. మా అమ్మ ఎప్పుడూ చెప్తుండేది, ‘ఎప్పుడూ నిజమే చెప్పు. కొందరికి నిష్ఠూరమైనా సరే’ అని. ఆ ప్రకారమే నిజం చెప్పాను.

అప్పుడు హోం మంత్రిగా వున్న రోశయ్య నాకు చీరాల, గుంటూరు నుంచే తెలుసు. ఆయన విశాఖ వచ్చినప్పుడల్లా నన్ను ప్రత్యేకంగా వెంట బెట్టుకుని తిరిగేవారు. నేనంటే కాస్త ఇష్టం కూడా అనుకుంటాను. ఒకరోజు నాతో రోశయ్య, ‘‘ఏం నాయుడూ! సినిమా ఆయన ఎన్టీఆర్‌ తిరుగుతున్నాడు గదా, జనం వస్తున్నారు. మేమూ మీటింగులు పెడితే జనమైతే వస్తారు గదా. ఏమంటావ్‌?’’ అనడిగారు.


‘‘సార్‌ లీడర్లంతా మీ వైపు, ఓటర్లంతా ఆ వైపూ!’’ అన్నాను నవ్వుతూనే. ‘‘హేయ్‌, వూరుకో, నువ్వేదో అభిమానం కొద్దీ అంటున్నావ్‌, అదేం కాదు’’ అని ఆయనా సరదాగానే కసురుకున్నారు. ‘‘చూద్దాం లెండి సార్‌,’’ అన్నా నేనూ తగ్గకుండా.

నా మీద కొందరు పితూరీలు చెప్పారు కాబట్టి సత్యం నిగ్గు తేల్చుకోవడానికి విశాఖ జిల్లా అంతా రహస్యంగా తిరిగా. అలా పాయకరావుపేట వెళ్లినప్పుడు బడ్డీ కొట్టు దగ్గర ఒక సిగరెట్టు తీసుకుని అక్కడున్న తాడుతో ముట్టించుకుని, బడ్డీ కొట్టు కుర్రాడితో మాట కలిపా... ‘ఎవరండీ’ అనడిగితే, ప్రెస్‌ రిపోర్టర్‌ని అని చెప్పా. ఆ మాటా ఈ మాటా మాట్లాడుతూ, ‘‘ఏంటీ, ఈ పాయకరావుపేటకి గంటెల సుమన అనే candidateని తెలుగు దేశం వాళ్లు నిలబెట్టబోతున్నారట. ఆమెని మీరెప్పుడన్నా చూశారా? ఆవిడ ఎక్కడావిడ? గ్రామం ఏది?’’ అనడిగా.

‘‘ఏమోనండి సార్‌, నాకు తెలీదు, అయినా మేం ఓటేసేది ఎన్టీ రామారావుకి కదా. గంటెల సుమన ఎవరైతే మాకేంటి?’’ అనేశాడు. ఎన్నికలు జరిగాయి. తెలుగుదేశం గెలిచింది.

తెలుగుదేశం పార్టీ గెలిచాక ఎన్టీఆర్‌ ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకునే కాలం మొదలైంది. ఆయన చేసిన వాగ్దానాల్లో – అవినీతి పాలన అంతమొందిస్తాననేది ఒకటి.

కొద్ది నెలలకే ఇంటెలిజెన్స్‌ విభాగం నుంచి ఫోను! ఏకంగా ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ అప్పారావు నుంచే! ‘‘ఇంటెలిజెన్స్‌కి రా. నీలా ఇంటెలిజెన్స్‌లో అనుభవం వున్న ఆఫీసర్లు జిల్లాల్లో కాదు వుండాల్సింది! హెడ్డాఫీసు హైదరాబాద్‌కి రా’’ అంటూ– అంతే, హైదరాబాద్‌కు ట్రాన్స్‌ఫర్‌ అయ్యింది.


నేను హైదరాబాద్‌ చేరిన తొలి నాళ్లలోనే మచిలీపట్నం అసెంబ్లీ ఉప ఎన్నిక వచ్చింది. అక్కడున్న ఎమ్మెల్యే హఠాత్తుగా చనిపోబట్టి! అప్పుడు వసంత నాగేశ్వరరావు హోం మినిస్టర్‌. కృష్ణా జిల్లా వాసి. ఆయనకు ఉప ఎన్నికల్లో గెలుస్తామో లేదో అని డౌట్‌. ఎన్టీ రామారావుకి ఇదే చెప్పారు. అప్పుడు ఎన్టీఆర్‌ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ అప్పారావుని పిలిచి అడిగారు, ‘‘ఏం జరుగుతుంద’’ని. విజయవాడలో ఉన్న ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ కూడా డౌట్‌గా చెప్తున్నాడు. అప్పారావు నన్ను పిలిచి ‘సరిగ్గా’ కనుక్కోమన్నారు. వెంటనే బయలుదేరి విజయవాడ వెళ్లాను. అక్కడ లోకల్‌గా వున్న ఇంటెలిజెన్స్‌ డీఎస్పీతో మాట్లాడి ఆయనకున్న సమాచారాన్నంతా నోట్‌ చేసుకున్నాను. తర్వాత అక్కడ నుంచి ఒక ఎస్సైని వెంటబెట్టుకుని బందరు వెళ్లాను. నాతో ఉన్న ఎస్సైకి చెప్పి– రోజంతా మాతో వుండడానికి రిక్షా అతన్ని మాట్లాడుకుని– ఎస్సై, నేను రిక్షా ఎక్కి అతన్ని మాటల్లోకి దింపాము. రిక్షా కార్మికుల సమస్యలన్నీ చెప్పాడు. టిఫిన్‌ తింటూ తింటూనే హోటల్‌ కార్మికుల్ని కూడా కదిపి చూశాము. వాళ్ల సాధక బాధకాలన్నీ నాకు బోధపడ్డాయి. టిఫిన్‌ అయ్యాక as usualగా కిళ్లీకొట్టు, సిగరెట్టు! కిళ్లీ కొట్టతనితో మాటామంతీ కానిచ్చి, రిక్షాలో వూరంతా తిరగడం మొదలుపెట్టాము. ఇంకా మచిలీపట్నం పక్కనున్న పెడన వెళ్లాము. అక్కడ ఎక్కువగా నేత కార్మికులు– ప్రభుత్వం నుంచి వారేమి కోరుకుంటున్నారో కనుక్కున్నా. బీచ్‌ వున్న వూరు కాబట్టి మత్స్యకారుల సమస్యల్నీ, కోరికల్నీ నోట్‌ చేసుకున్నా.


మరుసట్రోజు నేను సేకరించిన సమాచారాన్ని అన్ని కోణాల నుంచి విశ్లేషించి మా చీఫ్‌ అప్పారావుకు బ్రీఫ్‌ చేశాను. ఏమీ అవాంతరాలు లేకపోతే తెలుగుదేశం 10 నుంచి 15 వేల మెజార్టీతో గెలిచే అవకాశం వుందని చెప్పాను. ఆగమేఘాల మీద నేను చూపించిన స్థానిక సమస్యలకు పరిష్కారాలు చేపట్టడం మంచిదని చెప్పాను. అప్పారావు ఎన్టీఆర్‌ను కలిసి 10, 15 వేల మెజార్టీ అనకుండా ఎందుకైనా మంచిదని, 5 వేల మెజార్టీతో బయటపడతామని చెప్పేశాడు. ఎన్నికలు జరిగాయి. 13 వేల పైచిలుకు మెజార్టీతో తెలుగుదేశం గెలిచింది.

రిటైర్డ్‌ ఐపిఎస్‌ అధికారి చేరెడ్డి రామచంద్రనాయుడు (సి.ఆర్‌.నాయుడు) ఆత్మకథ ‘కొండ మెట్లు’ పుస్తకం నుంచి కొన్ని భాగాలు ఇవి.

ఇవి కూడా చదవండి

Rahul Gandhi: భారత్ సమ్మిట్‌లో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

Shruti Haasan: పాపం శృతి హాసన్.. సీఎస్‌కే ఓటమిని తట్టుకోలేకపోయింది..

Updated Date - Apr 27 , 2025 | 01:58 AM