Cultural Preservation: మూఢ విశ్వాసాలు సంస్కృతిలో భాగమా
ABN , Publish Date - Aug 02 , 2025 | 04:30 AM
ఆచార వ్యవహారాలు ప్రజల జీవన విధానాల్లో భాగంగా, సామరస్యంగా పాటించుకోవాలి. ప్రజలు సాధారణ ధోరణిలో జరుపుకొనే ఈ పర్వాలను

ఆచార వ్యవహారాలు ప్రజల జీవన విధానాల్లో భాగంగా, సామరస్యంగా పాటించుకోవాలి. ప్రజలు సాధారణ ధోరణిలో జరుపుకొనే ఈ పర్వాలను ప్రభుత్వం పట్టించుకోవాలని డిమాండ్ చేయడం వల్ల ఇవి రాజకీయాలకు కేంద్రాలుగా మారుతున్నాయి. ఒక జాతి సాంస్కృతిక ఆచారాలు, పండుగల నిర్వహణ ప్రభుత్వ బాధ్యత కాదు. దాని కోసం ఖజానా నిధులు, అధికార యంత్రాంగ వినియోగం అనవసరం. వాటిని ఆయా జాతుల ప్రజలే సొంత వనరులతో జరుపుకుంటారు. తరతరాలుగా ఇలాగే అవి కొనసాగుతున్నాయి. బతుకమ్మ తెలంగాణ మహిళల ఇష్టమైన పండుగ. పూలతో బతుకమ్మలను పేర్చి వాటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడడం ఓ సాంస్కృతిక సమారోహం. ఆ పాటల్లో స్త్రీల జీవితాలకు చెందిన గొప్ప సాహిత్యం ఉంది. ఆ పండుగ ఎలా పుట్టింది అనడానికి ఎన్ని కథనాలున్నా అవన్నీ అప్రస్తుతం. కొత్త బట్టలు, ఆట పాటలు, పుట్టింటికి ప్రయాణం, బంధు మిత్రుల ప్రేమపూర్వక ఆలింగనాలు, సుఖదుఃఖాల ప్రస్తావనలు ఇవన్నీ ఆడజన్మకు ఏడాదికోసారి దొరికే అపురూప కానుకలు. ఇవి చాలు బతుకమ్మను కొలవడానికి. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ ఓ అంశమైంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పండుగ ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురవుతోందని ఓ వాదన మొదలైంది. తెలంగాణ వచ్చాక ఏర్పడ్డ ప్రభుత్వం జనాన్ని ఆకట్టుకునేందుకు బతుకమ్మను ప్రభుత్వం తరఫున నిర్వహించడం మొదలుపెట్టింది. స్టేడియంలలో వేలాది మంది మహిళలతో బతుకమ్మ ఆటలను ఏర్పాటు చేసింది. బుక్ రికార్డుల కోసం ఊర్లో చేసుకొనే పండుగను నగరంలోకి తెచ్చింది. ఆఫీసుల్లో ఉద్యోగినులతో వాటి నిర్వహణ చేపట్టింది. నోరారా పాడే బతుకమ్మ పాటలను డీజే సౌండ్‌గా మార్చింది. చప్పట్లు కొడుతూ సాగే తంతును దాండియా స్థాయికి తీసుకెళ్ళింది. రాష్ట్ర నిధులను వెచ్చించి ప్రభుత్వం చేస్తున్న ఈ తీరు బతుకమ్మ పండుగ ప్రాశస్త్యాన్ని కనుమరుగు చేస్తోంది. ఈ కాలుష్యం ద్వారా బతుకమ్మ చివరకు ఓ హంగామాగా మారిపోయింది.
బోనాలు జంట నగరాల్లో సాగే సామూహిక పర్వం. వాటి నిర్వహణ పిల్లలు జడుసుకొనేలా ఉంటోంది. వాయిద్య చప్పుళ్లతో నగరం మారుమోగిపోతుంది. ఈ ముగింపుగా ‘రంగం’ అనే భవిష్యవాణి పలికే కార్యక్రమం ఉంటుంది. నగరానికి చెందిన ఒక జోగిని కుటుంబంలోని స్త్రీలు వారసత్వ రీతిలో ఈ భవిష్యవాణిని వినిపిస్తున్నారు. మహంకాళి దేవత ఆవహించి ఆమెతో ఈ వాణిని పలికిస్తుందని భక్తుల నమ్మకం. ఈసారి ఆమె నోటి వెంట ‘తనకు రక్తం చూపించకపోతే ఊరుకోను’ అని మాట వచ్చింది. కొంతకాలంగా ఆ ఆలయంలో కోడి, మేక లాంటి జంతు బలులను నిషేధించారట. దానికి కోపగిస్తూ ‘నాలుగు కాళ్ల లేదా చిన్న జీవి అయినా సరే.. కొద్దిగానైనా రక్తం చూపించాలని’ ఆ మాతంగి పలికారు. దేవత ఆవహింపు అనే దానిని విజ్ఞానశాస్త్రం ఒప్పుకోదు. అయినా భక్తుల నమ్మకమే ఇక్కడ ప్రధానం. ‘రంగం’ ఆ పర్వదిన ప్రహసనం మాత్రమే. ప్రజల భక్తి విశ్వాసాలకు సంబంధించిన విషయం. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఓ మంత్రి మాట్లాడుతూ, నిషేధించిన జంతుబలుల గురించి ప్రభుత్వం పరిశీలిస్తుందని, భవిష్యవాణిలో చెప్పినట్లుగా అన్ని జాగ్రత్తలు చేపడతామని అన్నారు. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వ ప్రమేయం, హామీలు అవసరమా? ప్రజల విశ్వాసాలు సంస్కృతిలో భాగమే. అశాస్త్రీయ, మూఢ నమ్మకాలను వారి ఇష్టానికే వదిలేయాలి కాని వాటికి సంస్కృతిలో చోటు కల్పించకూడదు. సంస్కృతి జాతి ఉన్నతీకరణకు తోడ్పడాలి కానీ మూఢనమ్మకాలను పెంచి పోషించకూడదు.
– బద్రి నర్సన్