Haryana: ఇంటిముందే వృద్ధుడు గొయ్యి తవ్వుతుంటే ఇరుగుపొరుగుకు డౌట్.. చివరకు బయటపడ్డ ఘోరం
ABN , Publish Date - Jun 21 , 2025 | 12:02 PM
ఇంటి ముందు వృద్ధుడు గొయ్యి తవ్వుతుంటే ఇరుగుపొరుగుకు డౌటొచ్చింది. రెండు నెలల తరువాత అదే గొయ్యిలో అతడి కోడలి మృతదేహం లభించడంతో అంతా షాకైపోయారు.

ఇంటర్నెట్ డెస్క్: ఓ మహిళ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఆమె అత్తవారింటి ముందున్న గొయ్యిలో బయటపడటం హర్యానాలో కలకలం రేపుతోంది. ఫరీదాబాద్‌లో శుక్రవారం ఈ దారుణం వెలుగు చూసింది. మృతురాలి అత్తింటివారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, యూపీకి చెందిన తనూ అనే యువతికి (24) రెండేళ్ల క్రితం ఫరీదాబాద్‌లోని రోషన్ నగర్‌కు చెందిన అరుణ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. భర్త, అత్తమామలతో కలిసి ఆమె ఫరీదాబాద్‌లోనే ఉంటోంది. అయితే, పెళ్లి అయిన నాటి నుంచే తనూని అత్తింటి వారు శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేయడం ప్రారంభించారు. అదనపు డబ్బు, నగలు తీసుకురావాలని తనూని వేధించే వారని ఆమె సోదరి ప్రీతి పేర్కొంది.
వారి డిమాండ్స్‌ను తీర్చేందుకు తమకు కుదిరిన మేరకు ప్రయత్నించామని వెల్లడించింది. కానీ వేధింపులు మాత్రం అంతకంతకూ ఎక్కువయ్యాయని వాపోయింది. ‘అత్తింటి ఆరళ్లు భరించలేక పెళ్లయిన రెండు నెలలకే తనూ మాతో ఉండేందుకు వచ్చేసింది. దాదాపు ఏడాది పాటు మాతోనే ఉంది. ఆ తరువాత ఆమెను అత్తవారింటికి పంపిస్తే వేధింపులు మళ్లీ మొదలయ్యాయి. తనూ మాతో మాట్లాడేందుకు కూడా వారు అనుమతించేవారు కాదు. ఫోన్ కూడా చేయనిచ్చే వారు కాదు’ అని ప్రీతి పేర్కొంది.
ఏప్రిల్ 9న తనూకు ఫోన్ చేసేందుకు ప్రీతి ప్రయత్నించినా కాల్ కలవలేదు. దీంతో, కీడు శంకించిన తనూ కుటుంబం వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, వారు కేసుపై స్పందించేందుకు తాత్సారం చేశారని ఆరోపించింది. తనూ ఇంట్లోంచి వెళ్లిపోయిందంటూ ఆమె మామ ఏప్రిల్ 23న కోడలి కుటుంబానికి ఫోన్ చేసి సమాచారం అందించాడు.
ఇక తనూ మృతదేహం లభించిన గొయ్యిని ఆమె మామ స్వయంగా తవ్వాడని స్థానికులు తెలిపారు. గొయ్యి ఎందుకు తవ్వుతున్నావని తాము ప్రశ్నిస్తే నీరు పోయేందుకని అతడు సమాధానం చెప్పాడని అన్నారు. అదే సమయంలో తనూ కూడా కనిపించకుండా పోయిందని తెలిపారు. ఆ తరువాత గొయ్యిని కూడా పూడ్చేశారని తెలిపారు. అప్పట్లోనే తమకు అనుమానాలు కలిగినా ఇంత దారుణం జరుగుతుందని మాత్రం అస్సలు ఊహించలేదని వాపోయారు.
ఈ విషయమై వారం క్రితమే తమకు సమాచారం అందిందని డీసీపీ ఉషా కుండూ మీడియాకు తెలిపారు. ఫిర్యాదు దాఖలవడంతో దర్యాప్తు ప్రారంభించినట్టు తెలిపారు. ‘వారం క్రితం ఫిర్యాదు అందగానే పోలీసులు తక్షణం చర్యలు ప్రారంభించారు. మృతదేహాన్ని గొయ్యిలోంచి బయటకు తీశాము. ఈ కేసులో నలుగురిని అదుపులోకి తీసుకున్నాము. విచారణ కొనసాగుతోంది’ అని అన్నారు. ఫారెన్సిక్ ఎగ్జామినేషన్ కోసం మృతదేహాన్ని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మరణం ఎప్పుడు సంభవించిందో, కారణాలు ఏంటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
శోభనం కోసం ఒత్తిడి చేసిన భర్తను అంతమొందించిన భార్య
నేనే ఆమెను చంపేశా.. నేరాన్ని అంగీకరించిన హర్యానా మోడల్ బాయ్‌ఫ్రెండ్