Share News

Sonam Meghalaya Murder: మేఘాలయ హనీమూన్ మర్డర్.. నెల రోజులుగా జైల్లో ఉంటున్న నిందితురాలి పరిస్థితి ఏంటంటే..

ABN , Publish Date - Jul 21 , 2025 | 02:09 PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హనీమూన్ మర్డర్ కేసులో నిందితురాలిగా ఉన్న సోనమ్ జైలు జీవితానికి అలవాటు పడినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, ఆమె తన వ్యక్తిగత జీవితం, చేసిన నేరం గురించి ఇంత వరకూ ఎవరితో మాట్లాడలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Sonam Meghalaya Murder: మేఘాలయ హనీమూన్ మర్డర్.. నెల రోజులుగా జైల్లో ఉంటున్న నిందితురాలి పరిస్థితి ఏంటంటే..
Sonam Raghuvanshi

ఇంటర్నెట్ డెస్క్: మేఘాలయ హనీమూన్ మర్డర్.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటన ఇది. హనీమూన్‌లో భర్త రాజా రఘువంశీని కిరాతకంగా పొట్టనపెట్టుకున్న సోనమ్ రఘువంశీ జైలుపాలై నెల రోజులయ్యింది. ప్రస్తుతం ఆమె షిల్లాంగ్ జైల్లో శిక్ష అనుభవిస్తోంది.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, సోనమ్ ప్రస్తుతం జైలు జీవితానికి అలవాటు పడిపోయిందట. అమాయకుడిని బలి తీసుకున్నా ఆమెలో ఇప్పటివరకూ ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకూ ఆమెను కుటుంబ సభ్యులెవరూ సందర్శించలేదు. ఇక నెల రోజులుగా అక్కడ ఉంటున్న సోనమ్ సాటి మహిళా ఖైదీలతో కలివిడిగా ఉండటం ప్రారంభించింది.


జైలు నిబంధనలను పక్కాగా ఫాలో అవుతూ రోజూ ఉదయం పూట ఒకే సమయానికి నిద్ర లేస్తుందట. అయితే, తన వ్యక్తిగత జీవితం లేదా చేసిన నేరం గురించి సాటి ఖైదీలతో, జైలు అధికారులతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. జైలు వార్డెన్ ఆఫీసు పక్కన ఉన్న ఓ జైలు గదిలో సోనమ్ మరో ఇద్దరు అండర్ ట్రయల్ ఖైదీలతో కలిసి ఉంటోంది. జైలు రూల్స్ ప్రకారం, ఆమెకు తన కుటుంబసభ్యులను కలుసుకునేందుకు అవకాశం ఉంది. కానీ ఇప్పటివరకూ సోనమ్ కుటుంబసభ్యులు ఎవరూ రాలేదు.

షిల్లాంగ్ జైల్లో మొత్తం 496 ఖైదీలు ఉన్నారు. వీరిలో 20 మంది మహిళలు ఉన్నారు. ఇక హత్యానేరం కింద అరెస్టయి ఆ జైలుకు వచ్చిన రెండో మహిళా ఖైదీ సోనమ్ అని అక్కడి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆమెను నిరంతర సీసీటీవీ కెమెరా నిఘాలో పెట్టారు.


కేసు పూర్వాపరాలు ఇవీ..

రాజా, సోనమ్‌ల వివాహం మే 11న జరిగిన విషయం తెలిసిందే. అప్పటికే ఆమెకు మరో వ్యక్తితో సంబంధం ఉంది. ఇక పెళ్లి తరువాత తొమ్మిది రోజులకు వారు హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. మూడ్రోజులపాటు అక్కడ ఉన్నాక ఆ జంట కనిపించకుండా పోయింది. ఈ క్రమంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా జూన్ 7న సోనమ్ అకస్మాత్తుగా యూపీలోని ఘాజీపూర్‌లో ప్రత్యక్షమైంది. అసలేం జరిగిందనే విషయంలో పోలీసులకు కట్టుకథలు వినిపించింది. అప్పటికే ఆమెపై అనుమానం ఉండటంతో రంగంలోకి దిగిన పోలీసులు చివరకు భర్తను సోనమే హత్య చేసినట్టు గుర్తించారు. ప్రియుడితోపాటు మరికొందరితో కలిసి పక్కా ప్లాన్‌తో భర్తను అంతమొందించినట్టు గుర్తించి అరెస్టు చేశారు. ఇక సోనమ్‌తో అన్ని బంధాలను తెంచేసుకున్నామని ఆమె సోదరుడు మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

కాల్ ఫార్వార్డింగ్ స్కామ్.. ఈ ఉచ్చులో పడితే మీ జేబులు ఖాళీ

ప్రియుడి మోజులో వివాహిత దారుణం.. మంచానపడ్డ భర్తను కిరాతకంగా హత్య

Read Latest and Crime News

Updated Date - Jul 21 , 2025 | 03:51 PM