Share News

Haryana Model Case: నేనే ఆమెను చంపేశా.. నేరాన్ని అంగీకరించిన హర్యానా మోడల్ బాయ్‌ఫ్రెండ్

ABN , Publish Date - Jun 17 , 2025 | 12:04 PM

హర్యానాలో మోడల్ హత్య కేసు మిస్టరీ వీడింది. తానే ఈ హత్య చేసినట్టు ఆమె బాయ్‌ఫ్రెండ్ పోలీసుల ముందు అంగీకరించాడు.

Haryana Model Case: నేనే ఆమెను చంపేశా.. నేరాన్ని అంగీకరించిన హర్యానా మోడల్ బాయ్‌ఫ్రెండ్
Haryana model murder

ఇంటర్నెట్ డెస్క్: హర్యానా మోడల్ షీతల్ హత్య కేసు మిస్టరీ వీడింది. షీతల్‌ను తానే హత్య చేశానని ఆమె బాయ్‌ఫ్రెండ్ సునీల్ చౌదరి నేరాన్ని అంగీకరించాడు. షీతల్‌కు అప్పటికే పెళ్లి అయ్యింది. ఐదు నెలల బిడ్డ కూడా ఉంది. సునీల్ కూడా వివాహితుడు, ఇద్దరు పిల్లల తండ్రి. ఈ నేపథ్యంలో సంచలనంగా మారిన హత్యోదంతాన్ని పోలీసులు ఛేదించారు.

కేసు పూర్తి వివరాల్లోకి వెళితే, జూన్ 14న షీతల్ ఓ ఆల్బమ్ ఫొటో షూట్ కోసం పానిపట్‌లోని ఓ గ్రామానికి వెళ్లారు. రాత్రి 10.30 సమయంలో సునీల్ ముందస్తు సమాచారం ఏదీ లేకుండా అక్కడకు వెళ్లాడు. అతడి కారులో కూర్చుని ఇద్దరూ కొంత సేపు మాట్లాడుకున్నారు. మద్యం సేవించారు. అనంతరం వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో షీతల్ తన సోదరి నేహకు ఫోన్ చేసిన సునీల్ తనపై చేయి చేసుకున్న విషయాన్ని చెప్పింది. ఈలోపు కాల్ కట్ అయిపోయింది. నేహ మళ్లీ ప్రయత్నించినా షీతల్‌ ఫోన్ స్విచాఫ్ అని వచ్చింది.


జూన్ 15న పోలీసులకు సునీల్ కారు పానిపట్‌లోని ఓ కాలవలో లభించింది. ఈలోపు ఆసుపత్రికి చేరుకున్న సునీల్ తన కారు కాలవలో పడిపోయిందని తెలిపాడు. షీతల్ కారుతో పాటు నీట మునిగిపోయిందన్నాడు. తాను మాత్రం తప్పించుకోగలిగానని చెప్పాడు. ఆ మరుసటి రోజు షీతల్ మృతదేహం లభించింది. ఆమె గొంతుపై గాయం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆమె ఒంటిపై ఉన్న టాటూల ఆధారంగా మృతదేహాన్ని గుర్తించారు. ఈ క్రమంలో విచారణ ప్రారంభించిన పోలీసులు సునీల్‌ను ప్రశ్నించగా అతడు తను చేసిన నేరాన్ని అంగీకరించాడు. ఇక పోలీసులు షీతల్ మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, షీతల్, సునీల్ మధ్య ఆరేళ్లుగా పరిచయం ఉంది. సునీల్ హోటల్‌లో షీతల్ కొంతకాలం పనిచేసింది. అయితే, తనను పెళ్లి చేసుకోవాలంటూ సునీల్ షీతల్‌ను కోరాడు. అతడికి అప్పటికే పెళ్లయ్యి ఇద్దరు పిల్లలు కూడా ఉండటంతో ఆమె అతడి ప్రతిపాదనను తిరస్కరించింది. ఇక హర్యానా మ్యూజిక్ రంగంలో కొనసాగుతున్న షీతల్‌‌కు కూడా పెళ్లి అయ్యింది. ఆమెకు ఐదు నెలల వయసున్న బిడ్డ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ హత్యోదంతం స్థానికంగా పెను కలకలానికి దారితీసింది.

ఇవి కూడా చదవండి:

శోభనం కోసం ఒత్తిడి చేసిన భర్తను అంతమొందించిన భార్య

త్వరగా ఇంటికొచ్చిన భర్తకు షాక్.. భార్య మరొకరితో క్లోజ్‌గా ఉండటం చూసి..

Read Latest and Crime News

Updated Date - Jun 17 , 2025 | 12:16 PM