Rajasthan: రాజస్థాన్‌లో దారుణం.. దళిత యువకుడిపై లైంగిక దాడి
ABN , Publish Date - Apr 20 , 2025 | 07:30 PM
రాజస్థాన్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. దళిత యువకుడిపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్రంలో పెను కలకలానికి దారి తీసింది.

ఇంటర్నెట్ డెస్క్: అతడు 19 ఏళ్ల దళిత యువకుడు. తన మానాన తాను ఓ పెళ్లి ఊరేగింపును చూస్తూ నిలుచున్నాడు. కానీ ఇద్దరు మానవ మృగాల దృష్టి తనపై పడిందన్న సంగతి అప్పటికి అతడికి తెలియదు. ఫుల్లుగా తాగిన ఆ ఇద్దరూ అతడిని పక్కకు తీసుకెళ్లి చివరకు దారుణానికి పాల్పడ్డారు. రాజస్థాన్‌లో ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన పెను కలకలానికి దారి తీసింది.
సికర్ జిల్లా ఫతేపూర్ ప్రాంతంలో ఏప్రిల్ 8న ఈ దారుణం జరిగింది. అతడు బస్‌స్టాండ్ వద్ద నిలబడి ఓ పెళ్లి ఊరేగింపును చూస్తుండగా మద్యం మత్తులో ఉన్న ఇద్దరు అతడిని టార్గెట్ చేసుకున్నారు. ‘‘వాళ్లు మద్యం మత్తులో ఉన్నారు. నన్ను బాటిల్‌తో కొట్టారు. ఆ తరువాత నాపై మూత్ర విసర్జన చేశారు. కులవిద్వేష పూరిత వ్యాఖ్యలకు దిగారు. ప్రైవేటు భాగాలపై కూడా కొట్టారు’’ అని బాధితుడు తెలిపారు. తన దుస్తులను బలవంతంగా తొలగించి అసహజ శృంగారానికి దిగారని ఆరోపించారు. ఈ చర్యలను వీడియోలో రికార్డు చేయడమే కాకుండా ఎవరికైనా చెబితే వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని కూడా బెదిరించారని అన్నారు.
ఘటన తరువాత యువకుడు తీవ్ర షాక్‌కు లోనవడంతో మరో వారం రోజుల వరకూ అతడు పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయాడు. అకారణంగా తనను టార్గెట్ చేసుకున్నారని, తాను వారిని ఏమీ అనలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఏప్రిల్ 8న ఈ దారుణం జరగ్గా ఏప్రిల్ 16న బాధితుడి కటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కాగా, ఘటనపై రాజస్థాన్ ప్రతిపక్ష కాంగ్రెస్ నేత టీకా రామ్ జల్లీ మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితికి ఈ ఘటన అద్దం పడుతోందని అన్నారు. ‘‘రాజస్థాన్‌లో వాస్తవ పరిస్థితి ఇది. దళిత యువకుడిని కిడ్నాప్ చేసి, దాడికి పాల్పడి, మూత్ర విసర్జన చేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇదేమీ సినిమాలో దృశ్యం కాదు. ఇది రాష్ట్రానికి తలవంపులు తెచ్చే ఘటన’’ అని అన్నారు.
ఈ దారుణంపై మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా స్పందించారు. ఘటన జరిగిన వారం రోజుల తరువాత గానీ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయాడంటే ఎంతటి ఘాత తగిలిందో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు.
ఘటనపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశామని పోలీసులు తెలిపారు. బాధితుడికి వైద్య పరీక్షలు కూడా చేయించి, అతడి వాంగ్మూలం రికార్డు చేసినట్టు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని అన్నారు.
ఇవి కూడా చదవండి:
భార్య వేధింపులు తాళలేక ఆత్మహత్య.. న్యాయం జరగకపోతే అస్థికలు డ్రైనేజీలో కలపాలని విజ్ఞప్తి
భార్యను చంపిన వృద్ధుడు.. ఆమె తలను సంచీలో తీసుకెళ్లి..
ఐసీయూలో ఎయిర్‌హోస్టస్‌పై అత్యాచారం.. ఎట్టకేలకు పోలీసుల అదుపులో నిందితుడు