Share News

Class 5 Boy: వేరే మతం వ్యక్తి ప్రిన్సిపల్‌గా ఉన్నాడని కుట్ర.. పిల్లాడిని రంగంలోకి దించి..

ABN , Publish Date - Aug 03 , 2025 | 09:11 PM

Class 5 Boy: అతడు ప్రిన్సిపల్‌గా ఉండటం అదే గ్రామానికి చెందిన సాగర్ పాటిల్, నాగనగౌడ పాటిల్ సహించలేకపోయారు. ఎలాగైనా అతడ్ని ప్రిన్సిపల్ పదవి నుంచి తీసేయించాలని అనుకున్నారు. ఇందుకోసం ఓ దారుణమైన ప్లాన్ వేశారు.

Class 5 Boy: వేరే మతం వ్యక్తి ప్రిన్సిపల్‌గా ఉన్నాడని కుట్ర.. పిల్లాడిని రంగంలోకి దించి..
Class 5 Boy

కర్ణాటక రాష్ట్రంలో ఓ దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. వేరే మతానికి చెందిన వ్యక్తి స్కూలు ప్రిన్సిపల్‌గా ఉన్నాడని అతడిపై కుట్ర చేశారు కొంతమంది వ్యక్తులు. అతడ్ని ప్రిన్సిపల్ ఉద్యోగంలోంచి తీసేయించడానికి ఓ నీఛమైన ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ కోసం 5వ తరగతి చదివే పిల్లాడిని వాడుకున్నారు. అయితే, చివరకు వారి ప్లాన్ బెడిసి కొట్టి, అందరూ జైలు పాలయ్యారు. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బెళగావి జిల్లాలోని హుళికట్టి ప్రైమరీ స్కూల్లో ఓ మతానికి చెందిన వ్యక్తి గత 13 ఏళ్లుగా ప్రిన్సిపల్‌గా పని చేస్తున్నాడు.


అతడు ప్రిన్సిపల్‌గా ఉండటం అదే గ్రామానికి చెందిన సాగర్ పాటిల్, నాగనగౌడ పాటిల్ సహించలేకపోయారు. ఎలాగైనా అతడ్ని ప్రిన్సిపల్ పదవి నుంచి తీసేయించాలని అనుకున్నారు. ఇందుకోసం ఓ దారుణమైన ప్లాన్ వేశారు. క్రిష్ణ మదర్ అనే వ్యక్తిని బెదిరించి తమ ప్లాన్‌లో భాగం చేసుకున్నారు. వారి ప్లాన్ ప్రకారం.. స్కూలు వాటర్ ట్యాంకులో విషం కలపాలి. ఆ విషపు నీళ్లు తాగి విద్యార్ధులు అస్వస్థతకు గురవుతారు. అప్పుడు ప్రిన్సిపల్ మీద అనుమానం మొదలై అతడ్ని ఉద్యోగంలోంచి తీసేస్తారు.


వారు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి ఉంటే కథ వేరేలా ఉండేది. క్రిష్ణ విషపు బాటిల్‌ను 5వ తరగతి చదివే ఓ బాలుడికి ఇచ్చాడు. వాటర్ ట్యాంకులో పోయమన్నాడు. బాలుడు అతడు చెప్పినట్లే చేశాడు. పన్నెండవ తరగతి చదివే విద్యార్ధులు కొందరు ఆ నీళ్లు తాగి అస్వస్థతకు గురయ్యారు. స్కూల్లో అలజడి మొదలైంది. స్కూలు అధికారులు విద్యార్ధులను ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం వారి పరిస్థితి మెరుగు పడింది. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.


వాటర్ ట్యాంకులో విషం కలిపిన పిల్లాడిని పట్టుకున్నారు. అతడ్ని విచారించగా క్రిష్ణ పేరు చెప్పాడు. పోలీసులు క్రిష్ణను అదుపులోకి తీసుకుని విచారించారు. అతడు ఆ దుర్మార్గుల పేర్లు బయటపెట్టాడు. ప్రస్తుతం ఈ ముగ్గురు జైలులో చిప్పకూడు తింటూ ఉన్నారు. ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య సైతం స్పందించారు. మతం పేరుతో జరిగిన కుట్రను తీవ్రంగా ఖండించారు.


ఇవి కూడా చదవండి

నడిరోడ్డుపై తగలబడ్డ 10 కోట్ల స్పోర్ట్స్ కారు

కొత్త రూల్.. పావురాలకు తిండిపెడితే జైలుకే..

Updated Date - Aug 03 , 2025 | 09:14 PM