Britain Woman-Turkey Mystery: తుర్కియేలో మహిళ మృతి.. ఆమె గుండె మిస్సింగ్ అని తెలిసి భర్తకు షాక్
ABN , Publish Date - May 27 , 2025 | 10:22 AM
తుర్కియేలో ఇటీవల బ్రిటన్ మహిళ మృతి ఉదంతం మిస్టరీగా మారింది. ఆమె మృతదేహంలో గుండె లేనట్టు వైద్యులు చెప్పడంతో భర్త షాకైపోయాడు. తుర్కియేలోనే తమకు తెలీకుండా ఏదో జరిగిందని అనుమానం వ్యక్తం చేశాడు.

ఇంటర్నెట్ డెస్క్: ఆ బ్రిటన్ దంపతులు విహారయాత్ర కోసం తుర్కియేకు వెళ్లారు. విమానం దిగిన మరోసటి రోజే మహిళ కన్నుమూసింది. మృతదేహాన్ని బ్రిటన్‌కు తరలించాక పోస్టుమార్టం నిర్వహించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతదేహంలో గుండె లేదని వైద్యులు చెప్పడంతో మహిళ భర్త షాకైపోయాడు. ప్రస్తుతం ఈ ఘటన అటు తుర్కియేతో పాటు బ్రిటన్‌లో కూడా సంచలనంగా మారింది.
బెత్, లూక్ మార్టిన్ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఆ యువ జంట ఏప్రిల్ 27న తుర్కియేకు వచ్చింది. అయితే, మార్గమధ్యంలోనే బెత్ అనారోగ్యం పాలయ్యింది. ఇస్తాంబుల్‌లో ల్యాండవగానే ఆమెను మార్మరా యూనివర్సిటీ పెండిక్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ ఆసుపత్రిలో చేర్పించారు. ఆ మరుసటి రోజే ఆమె కన్నుమూసింది.
పలు అవయవాలు పనిచేయకపోవడంతో బెత్‌కు కార్డియాక్ అరెస్టు వచ్చి మరణించిందని తుర్కియే ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. అప్పటిదాకా పూర్తి స్వస్థతతో ఉన్న మహిళ ఆరోగ్యం ఒక్క రోజులో అంతలా ఎలా దిగజారిందనే విషయంపై మాత్రం వైద్యులు స్పష్టత ఇవ్వలేదు. ఈ క్రమంలో మహిళ మృతదేహాన్ని బ్రిటన్‌కు తరలించారు. అక్కడ పోస్టుమార్టం నివేదికలో మహిళకు గుండె లేదన్న విషయం బయటపడి భర్త లూక్ షాకైపోయాడు. తుర్కియే ఆసుపత్రి వర్గాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. పేషెంట్ గుండె ఎలా మిస్సయ్యిందో ఆసుపత్రి వర్గాలకు తెలీకుండా ఎలా ఉంటుందని అనుమానం వ్యక్తం చేశాడు. తానే భార్యను హత్య చేసి ఉంటానని మొదట వారు అనుమానించారని కూడా తెలిపాడు. పూర్తి వివరాలు చెప్పకుండా ఆసుపత్రి వర్గాలు దాటవేస్తున్నాయని ఆరోపించారు.
ఈ ఉదంతంపై మీడియా దృష్టి కూడా పడటంతో తుర్కియే ఆరోగ్య శాఖ స్పందించింది. ఆసుపత్రిలో బెత్‌కు ఎలాంటి సర్జరీలు చేయలేదని స్పష్టం చేసింది. తుర్కియేలో ఉండగానే ఆమె గుండెను తొలగించారన్న ఆరోపణలను కూడా తోసిపుచ్చింది. కానీ మహిళలో గుండె లేకపోవడాన్ని మాత్రం వివరించలేకపోయింది.
తుర్కియే ఆసుపత్రి వారు బెత్‌కు పెన్సిలీన్ ఇచ్చి ఉండటంతోనే ఇలా జరిగిందని ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఆమెకు యాంటీబయాటిక్ ఎలర్జీ ఉందని చెప్పారు. మరోవైపు, తుర్కియే అధికారుల సమాధానాలు కూడా అస్పష్టంగా ఉండటంతో ఇది పెద్ద కాంట్రవర్సీగా మారింది. బెత్ మరణానికి గల కారణాలు పూర్తిస్థాయిలో తెలుసుకునేందుకు బ్రిటన్ డాక్టర్లకు కనీసం ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో, బెత్ కుటుంబం నిస్సహాయ స్థితిలో కూరుకుపోయింది.
ఇవి కూడా చదవండి:
తాను ఐపీఎస్ అధికారినని మభ్యపెట్టి యువతిని పెళ్లాడి.. ఆ తరువాత
చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినందుకు తిట్లు.. బాలుడి ఆత్మహత్య