Zurich Kotak: జురిక్ కోటక్ నుంచి వాణిజ్య బీమా
ABN , Publish Date - Jul 12 , 2025 | 03:06 AM
జురిక్ కోటక్ జనరల్ ఇన్సూరెన్స్.. వాణిజ్య కమర్షియల్ ఇన్సూరెన్స్ విభాగంలోకి ప్రవేశించింది.

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): జురిక్ కోటక్ జనరల్ ఇన్సూరెన్స్.. వాణిజ్య (కమర్షియల్) ఇన్సూరెన్స్ విభాగంలోకి ప్రవేశించింది. ఎస్‌ఎంఈల నుంచి బడా కార్పొరేట్ కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా ప్రత్యేక బీమా పాలసీలను తీసుకువచ్చినట్లు సంస్థ ఎండీ, సీఈఓ అలోక్ అగర్వాల్ వెల్లడించారు. అంతేకాకుండా ఆస్తులు, లయబిలిటీ, మెరైన్, ఇంజనీరింగ్ రంగాలతో పాటు ఇతరత్రా విభాగాలకు కూడా ప్రత్యేకంగా పాలసీలను రూపొందించినట్లు ఆయన చెప్పారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం ప్రీమియం ఆదాయం రూ.2,036 కోట్లుగా ఉండగా అందులో కమర్షియల్ ఇన్సూరెన్స్ విభాగం వాటా 3 శాతంగా ఉందన్నారు. దేశీయంగా ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటుండటంతో ఈ ఏడాది ఈ విభాగంలో 15 నుంచి 20 శాతం వృద్ధిని సాధించవచ్చని భావిస్తున్నట్లు అగర్వాల్ చెప్పారు. ప్రస్తుతం కంపెనీ దేశవ్యాప్తంగా 31 కార్యాలయాలను నిర్వహిస్తోంది. ఈ ఏడాది కొత్తగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంతో పాటు మరికొన్ని నగరాలకు విస్తరించనుంది.
క్విక్ డెలివరీ సంస్థ బిగ్‌బాస్కెట్.. ఆంధ్రప్రదేశ్‌లో తన కార్యకలాపాలు విస్తరించింది. ఇందులో భాగం గా కాకినాడలో తన 10 నిమిషాల డెలివరీ సేవలను ప్రారంభించినట్లు బిగ్‌బాస్కెట్ ప్రకటించింది. పర్సనల్ కేర్ ఉత్పత్తులు, ఎలకా్ట్రనిక్స్ సహా దాదాపు 10వేలకు పైగా ఉత్పత్తులను పది నిమిషాల్లోనే వినియోగదారుల చెంతకు చేర్చనుంది.
అమెజాన్ ఇండియా.. ప్రైమ్ డే 2025ను ప్రారంభించింది. ఈ నెల 12 నుంచి 14 వరకు ఈ ప్రైమ్ డే సేల్ అందుబాటులో ఉండనుంది. సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్స్, ఎలకా్ట్రనిక్స్, ఫ్యాషన్, గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ కార్డ్స్ ద్వారా చేసే చెల్లింపులపై 10ు ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది.