Bill Gates Daughter Startup: నా కూతురు డబ్బులు అడుగుతుందనుకుని కాస్త భయపడ్డా.. బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Apr 28 , 2025 | 12:18 PM
తన కూతురు ఫీబీ సొంత సంస్థ ప్రారంభించినప్పుడు కాస్త టెన్షన్ పడ్డానని బిల్ గేట్స్ తెలిపారు. తనను ఆమె పెట్టుబడి అడుగుతుందని అనుకున్నట్టు చెప్పారు. అలా జరగనందుకు ఊపిరి పీల్చుకున్నానని అన్నారు.

ఇంటర్నెట్ డెస్క్: బిల్ గేట్స్.. అపరకుబేరుడు. ప్రస్తుతం మనం చూస్తున్న టెక్ ప్రపంచం సృష్టికర్తల్లో ఒకరు. వ్యాపారవేత్తగా ఉన్నత శిఖరాలకు చేరుకున్న బిల్ గేట్స్.. ఎన్నో అంకుర సంస్థలకు అండగా నిలుస్తున్నారు. కొత్త తరం వ్యాపారవేత్తలు ప్రోత్సహిస్తున్నారు. అయితే, బిల్‌గేట్స్ తన కన్నకూతురి స్టార్టప్ సంస్థకు నిధులు సమకూర్చలేదంటే మాత్రం ఆశ్చర్యం కలగకమానదు. అసలేం జరిగిందో చెబుతూ ఆయన తాజాగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కూతురి స్టార్టప్ సంస్థలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకపోవడంతో తాను ఎంతో రిలాక్సయ్యానని కూడా ఆయన కామెంట్ చేశారు.
తన కూతురు ఫీబీ ఓ స్టార్టప్ సంస్థను ప్రారంభించిందని తెలిసి తాను ఒకింత తత్తరపాటుకు లోనైనట్టు బిల్ గేట్స్ తెలిపారు. ఆమె తన రూమ్‌మేట్‌తో కలిసి ఈ-కామర్స్ రంగంలో ఏఐ సంస్థను ప్రారంభించినట్టు వివరించారు.
‘‘నన్ను ఫీబీ తన సంస్థలో పెట్టుబడి కోసం డబ్బులు అడుగుతుందని అనుకుని కాస్తంత కంగారు పడ్డా. ఆమె అడిగి ఉంటే నేను పెట్టుబడి పెట్టి ఉండేవాడినే. కానీ ఆ తరువాత పరిస్థితులు మరోరకంగా మారి ఉండేవి. పెట్టుబడి పెట్టిన తరువాత ఫీబీ సంస్థపై గట్టి పర్యవేక్షణ చేసుండేవాడిని. ఆమెకు అంత స్వేచ్ఛనిచ్చి ఉండేవాడిని కాదు. ఆమె నా కూతురు కాబట్టి అతి సున్నితంగా వ్యవహరించి ఉండేవాడినేమో. ఆ తరువాత నేను చేస్తోంది కరెక్టేనా అని చింతించి ఉండేవాణ్ణి.. అదృష్టవశాత్తూ ఇదంతా జరగలేదు’’ అని గేట్స్ చెప్పుకొచ్చారు.
స్టార్టప్ సంస్థ కోసం సొంతంగా నిధులు సమకూర్చుకోవాలని తన తల్లి మెలిండా గేట్సే ప్రోత్సహించిందని ఫీబీ తెలిపింది. పడుతూ లేస్తూ జీవిత పాఠాలు నేర్చుకునేందుకు తనకు ఇదో అవకాశమని తల్లి భావించిందని వివరించారు.
ఫీబీ తన స్టార్టప్ సంస్థ ద్వారా ఫియా అనే ఏఐ ఆధారిత బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్‌ను డిజైన్ చేశారు. దీంతో యూజర్లు దాదాపు 40 వేల రిటైలర్లలో ఉన్న ఫ్యాషన్ డీల్స్‌ను ఒక్క క్లిక్‌తో తెలుసుకోవచ్చు. నచ్చిన ప్రాడక్ట్ కనిపించినప్పుడు యూజర్లు ఫియా చూపించే షుడ్ ఐ బై దిస్ అనే బటన్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీంతో, ఆ ఉత్పత్తికి సంబంధించిన ధర ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా? ప్రత్యామ్నాయాలు ఏమిటీ అనే అంశాలను యూజర్ల ముందుంచుతుంది. అఫిలియేట్ లింక్స్ ద్వారా ఫియా ఆదాయం సమకూర్చుకునేందుకు ఫీబీ ప్రయత్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
వజ్రాలు కొంటున్నారా.. ఈ విషయాల్లో జాగ్రత్త
గోల్డ్ కాయిన్స్ కొనాలా లేదా బంగారు నగలు కొనాలా అని డౌటా? అయితే..
తక్కువ పెట్టుబడితో భారీ లాభాలిచ్చే బిజినెస్.. ఒక్కసారి ట్రై చేసి చూడండి..
Read More Business News and Latest Telugu News