Share News

Unclaimed Deposits India: అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లు రూ 67000 కోట్లు

ABN , Publish Date - Jul 29 , 2025 | 06:25 AM

దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకుల వద్ద అన్‌క్లెయిమ్డ్‌ (ఎవరూ తమవిగా క్లెయిమ్‌ చేయని) డిపాజిట్ల మొత్తం కొండలా పేరుకుపోతోంది. ఈ ఏడాది జూన్‌ చివరి నాటికి ఈ మొత్తం రూ.67,003 కోట్లకు...

Unclaimed Deposits India: అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లు రూ 67000 కోట్లు

జూన్‌ చివరి నాటికి బ్యాంకుల్లో ఉన్న మొత్తం ఇది

న్యూఢిల్లీ: దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకుల వద్ద అన్‌క్లెయిమ్డ్‌ (ఎవరూ తమవిగా క్లెయిమ్‌ చేయని) డిపాజిట్ల మొత్తం కొండలా పేరుకుపోతోంది. ఈ ఏడాది జూన్‌ చివరి నాటికి ఈ మొత్తం రూ.67,003 కోట్లకు చేరుకుంది. భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) గణాంకాల ప్రకారం ఇందులో ప్రభుత్వ రంగ బ్యాంకుల వద్ద ఉన్న సొమ్ము రూ.58,330.26 కోట్లు కాగా ప్రైవేట్‌ బ్యాంకుల వద్ద ఉన్న సొమ్ము రూ.8,673.72 కోట్లు. ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌదరి లోక్‌సభకు సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయం తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (రూ.19,329.92 కోట్లు), ప్రైవేటు బ్యాంకుల్లో ఐసీఐసీఐ బ్యాంక్‌ (రూ.2,063.45 కోట్లు) వద్ద గరిష్ఠంగా ఈ నిధులున్నాయి. అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లకు సంబంధించిన సమాచార లభ్యతను సరళం చేసేందుకు ఆర్‌బీఐ ఉద్గమ్‌ (అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లు-గేట్‌వే టు యాక్సెస్‌ ఇన్ఫర్మేషన్‌) పేరిట కేంద్రీయ వెబ్‌ పోర్టల్‌ ఒకటి ప్రారంభించింది. ఈ పోర్టల్‌ ద్వారా రిజిస్టర్డ్‌ వినియోగదారులు అన్ని బ్యాంకుల్లోని అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్ల సమాచారాన్ని పొందవచ్చు. జూలై ఒకటో తేదీ నాటికి 8.59,683 మంది యూజర్లు ఈ పోర్టల్‌పై రిజిస్టర్‌ అయ్యారు. డిపాజిటర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ అవేర్‌నెస్‌ ఫండ్‌ స్కీమ్‌, 2014 కింద నిధి నిర్వహణతో పాటు ఆ డిపాజిట్లలోని సొమ్ము వినియోగానికి సంబంధించిన అంశాలు పరిశీలించేందుకు ఒక కమిటీ ఉంటుందని మంత్రి వెల్లడించారు. డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణకు, ఆర్‌బీఐ నిర్దేశకత్వం మేరకు ఈ ప్రయోజనాల పరిరక్షణకు సంబంధించిన ఇతర అంశాలకు ఈ నిధిని వినియోగించవచ్చు.


‘బీమా’ సామర్థ్యాల పెంపు కోసమే ఎఫ్‌డీఐ పరిమితి పెంపు

బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితి వంద శాతానికి పెంపు ఆ రంగం పూర్తి సామర్థ్యాలు వినియోగంలోకి వచ్చేందుకు దోహదపడుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభకు తెలిపారు. రాబోయే ఐదేళ్ల కాలంలో ప్రపంచ వృద్ధిని మించి ఈ రంగం 7.1ు వంతున వృద్ధి సాధిస్తుందని అంచనా. ఆర్థిక మంత్రి ఫిబ్రవరిలో ప్రతిపాదించిన 2025-26 కేంద్ర బడెట్లో బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని ప్రస్తుత 74 శాతం నుంచి 100 శాతానికి పెంచనున్నట్టు ప్రతిపాదించారు. ఎఫ్‌డీఐ పరిమితి 74ు ఉండడం వల్ల విదేశీ బీమా కంపెనీ మిగతా 26ు వాటా కోసం దేశీయ భాగస్వామిని అన్వేషించుకోవలసివచ్చేది. కాని తాజా నిర్ణయం వల్ల దేశంలో బీమా కంపెనీ ఏర్పాటు చేయడం సరళం కావడంతో పాటు ఆ రంగంలోకి విదేశీ పెట్టుబడులు స్థిరంగా రావడానికి వీలు ఏర్పడుతుందని నిర్మల తెలిపారు. అలాగే టెక్నాలజీ బదిలీ కూడా తేలికవుతుందని, బీమా వ్యాప్తి, పోటీ సామర్థ్యం పెరుగుతాయని ఆమె పేర్కొన్నారు.

ఏ బ్యాంకు వద్ద ఎంత?

బ్యాంకు సొమ్ము (రూ.కోట్లలో)

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 19,329.92

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ 6,910.67

కెనరా బ్యాంక్‌ 6,278.14

ఐసీఐసీఐ బ్యాంక్‌ 2,063.45

హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ 1,609.56

యాక్సిస్‌ బ్యాంక్‌ 1,360.16

ఇవి కూడా చదవండి

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

కస్టమర్ల ఖాతాల నుంచి కోట్ల రూపాయల దోపిడీ.. పరారీలో ఎస్‌బీఐ క్లర్క్

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 29 , 2025 | 06:25 AM