Share News

Tata Tech: అమెరికాలో స్థానికులకు ఉద్యోగాలు.. టాటా టెక్ కీలక నిర్ణయం

ABN , Publish Date - Oct 24 , 2025 | 11:45 PM

హెచ్-1బీ వీసా ఆంక్షల నేపథ్యంలో అమెరికాలో ఉద్యోగుల నియామకాలకు సంబంధించి టాటా టెక్నాలజీస్ సంస్థ కీలక మార్పులకు సిద్ధమైంది. అమెరికాలోని స్థానికులను ఎక్కువగా నియమించుకునేందుకు నిర్ణయించినట్టు తెలిపింది.

Tata Tech: అమెరికాలో స్థానికులకు ఉద్యోగాలు.. టాటా టెక్ కీలక నిర్ణయం
TATA Tech US Hiring

ఇంటర్నెట్ డెస్క్: హెచ్-1బీ వీసా విధానంపై ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో పారిశ్రామిక దిగ్గజం టాటా టెక్నాలజీస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అమెరికాలో స్థానిక ఉద్యోగులను నియమించుకోవడంపై దృష్టి పెడతామని తాజాగా పేర్కొంది. విదేశీ నిపుణులపై ఆధారపడటాన్ని తగ్గిస్తామని తెలిపింది. ఈ విషయాన్ని సంస్థ సీఈఓ వారెన్ హారిస్ అంతర్జాతీయ మీడియాకు తెలిపారు (TATA Tech US Local Hiring).

అమెరికాలో ఉపాధి కల్పించే అతిపెద్ద ప్రైవేటు సంస్థ వాల్‌మార్ట్ ఇప్పటికే హెచ్-1బీ వీసాదారులను నియమించుకోవడాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ట్రంప్ ప్రభుత్వం విధించిన లక్ష డాలర్ల ఫీజు ఈ నిర్ణయానికి కారణమని తెలిపింది. ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో అమెరికన్లకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ట్రంప్ ప్రభుత్వం పేర్కొంటోంది. అమెరికన్లను విదేశీ ఉద్యోగులతో భర్తీ చేయరాదని అమెరికా అధికారులు పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాటా టెక్ నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది.


ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ప్రస్తుతం హెచ్-1బీ వీసాదారుల్లో భారతీయుల వాటా ఏకంగా 75 శాతం. అయితే, అధికారులు నిబంధనలను కఠినతరం చేయడం, వీసా ఖర్చులు పెరగడంతో అనేక సంస్థలు హెచ్-1బీ వీసాస్పాన్సర్‌షిప్‌ను తాత్కాలికంగా విరమించుకున్నాయి. ఈ నేపథ్యంలో తదుపరి నియామకాలకు అనుగుణంగా టాటా టెక్ కూడా విధానపరమైన మార్పులకు సిద్ధమవుతోంది.

టాటా టెక్‌లో ప్రపంచవ్యాప్తంగా 12 వేల మంది ఉద్యోగులు న్నారు. ఇక సంస్థ ఆదాయంలో దాదాపు 20 శాతం ఉత్తరఅమెరికా నుంచి వస్తోంది. ఇప్పటికే చైనా, స్వీడెన్, యూకే వంటి దేశాల్లో టాటా టెక్ స్థానికులనే నియమించుకుంటోంది. అక్కడి ఉద్యోగుల్లో దాదాపు 70 శాతం మంది స్థానికులే. ట్రంప్ సర్కారు కఠిన నిబంధనలు అమలు చేస్తున్న నేపథ్యంలో అనేక అంతర్జాతీయ సంస్థలు ఇదే తరహా విధానాలవైపు మళ్లుతున్నాయి. భారతీయ ఐటీ, ఇంజినీరింగ్ సంస్థలు కూడా ఇదే మార్గంలో మార్పులకు సిద్ధమవుతున్నాయి.


ఇవీ చదవండి:

బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్

రూపాయి విలువ స్థిరీకరణకు ఆర్‌బీఐ ప్రయత్నాలు.. 7.7 బిలియన్ డాలర్ల విక్రయం

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 24 , 2025 | 11:57 PM