Sundar Pichai: బిలియనీర్‌గా మారిన ఆల్ఫబెట్ సీఈఓ సుందర్ పిచాయ్
ABN , Publish Date - Jul 25 , 2025 | 07:55 AM
ఆల్ఫబెట్ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ మరో అరుదైన ఘనత సాధించారు. ఆయన నికర సంపద విలువ బిలియన్ డాలర్ల మార్కును దాటింది. ఇంతటి సంపదను ఆర్జించిన అతికొద్ది మంది నాన్ ఫౌండర్ సీఈఓల్లో ఒకరిగా సుందర్ పిచాయ్ నిలిచారు.

ఇంటర్నెట్ డెస్క్: గూగుల్ మాతృసంస్థ ఆల్ఫబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ మరో ఘనత సాధించారు. ఇటీవల ఆయన సంపద విలువ 1.1 బిలియన్ల డాలర్లకు చేరుకుంది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఆల్ఫబెట్ సంస్థ షేర్లు దూసుకుపోవడంతో సుందర్ పిచాయ్ సంపద విలువ కూడా అదే స్థాయిలో పెరిగింది.
2023 నుంచి ఆల్ఫబెట్ సంస్థ షేర్లు లాభాల బాటలోనే పయనిస్తున్నాయి. ఫలితంగా కంపెనీ మార్కెట్ విలువ 1 ట్రిలియన్ డాలర్ల మార్కును దాటింది. ఈ వ్యవధిలో ఇన్వెస్టర్లకు 120 శాతం మేర లాభాలు వచ్చాయి. ప్రస్తుతం ఆల్ఫబెట్ షేర్లు జీవితకాల గరిష్ఠం వద్ద ట్రేడవుతున్నాయి. ఫలితంగా సంస్థకు చెందిన ఉన్నతాధికారుల ఆస్తుల విలువ కూడా ఇదే స్థాయిలో పెరిగింది. ఈ క్రమంలో బిలియన్ డాలర్ల పైచిలుకు సంపద కలిగిన అతికొద్ది మంది నాన్ ఫౌండర్ టెక్ సీఈఓల్లో సుందర్ పిచాయ్ కూడా ఒకరిగా నిలిచారు.
గురువారం త్రైమాసిక ఫలితాలు వెలువడిన తరువాత కంపెనీ షేర్లు 4.1 శాతం వరకూ పెరిగాయి. ఎనలిస్టుల అంచనాలకు మించి షేరు ధర దూసుకుపోయింది. ఇక పిచాయ్‌కు ఆల్ఫ్‌బెట్‌లో 0.02 శాతం వాటా ఉంది. ఈ వాటా మార్కెట్ విలువ 440 మిలియన్ డాలర్లు. అంతేకాకుండా, గత పదేళ్లల్లో ఆయన 650 మిలియన్ డాలర్ల విలువైన ఆల్ఫబెట్ షేర్‌లను విక్రయించారు. ఈ షేర్లను కూడా పిచాయ్ తన వద్ద పెట్టుకుని ఉంటే ఆయన సంపద విలువ 2.5 బిలియన్‌లకు చేరుకుని ఉండేదని బ్లూమ్‌బర్గ్ అంచనా వేసింది.
సుందర్ పిచాయ్ తమిళనాడులో జన్మించిన విషయం తెలిసిందే. 1993లో ఆయన స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ స్కాలర్‌షిప్‌తో అమెరికాకు వెళ్లారు. 2004లో గూగుల్‌లో చేరిన ఆయన ఆ తరువాత అంచలంచెలుగా ఎదుగుతూ సీఈఓ స్థాయికి చేరుకున్నారు. ముఖ్యంగా క్రోమ్ బ్రౌజర్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. యాండ్రాయిడ్ విభాగానికి కూడా నేతృత్వం వహించారు. 2015లో గూగుల్ సీఈఓగా ఎంపికయ్యారు. ఆ తరువాత ఆల్ఫబెట్‌కు సీఈఓగా మరో మెట్టు ఎక్కారు. ఇక పిచాయ్ సారథ్యంలో సంస్థ ప్రస్తుతం ఏఐపై దృష్టిసారించింది. గతేడాది ఏఐపై గూగుల్ ఏకంగా 50 బిలియన్ డాలర్లను పెట్టుబడులుగా పెట్టింది.
ఇవీ చదవండి:
సంపన్నులు తమ ఆస్తులను ఎలా పెంచుకుంటారో తెలుసా.. సీఏ చెప్పిన ఈ సూత్రం తెలిస్తే..
వేతన జీవులకు అక్కరకొచ్చే 50-30-20 ఫార్ములా