Share News

Loan Moratorium: రుణ చెల్లింపులకు విరామం ప్రకటిస్తున్నారా

ABN , Publish Date - Aug 03 , 2025 | 05:51 AM

ఆర్థిక పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు. ఉద్యోగం పోవడం, మెడికల్‌ ఎమర్జెన్సీ లేదా ఆకస్మికంగా ఆదాయం పడిపోవడం వంటి ఈతి బాధలు ఇప్పుడు సాధారణమై పోయాయి. అందరి విషయంలో కాకపోయినా కొందరి విషయంలో ఇవి...

Loan Moratorium: రుణ చెల్లింపులకు విరామం ప్రకటిస్తున్నారా

ఆర్థిక పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు. ఉద్యోగం పోవడం, మెడికల్‌ ఎమర్జెన్సీ లేదా ఆకస్మికంగా ఆదాయం పడిపోవడం వంటి ఈతి బాధలు ఇప్పుడు సాధారణమై పోయాయి. అందరి విషయంలో కాకపోయినా కొందరి విషయంలో ఇవి జరుగుతుంటాయి. మరి అలాంటి పరిస్థితుల్లో బ్యాంకులు లేదా నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ (ఎన్‌బీఎ్‌ఫసీ)ల నుంచి తీసుకున్న రుణాల నెలవారీ వాయిదా (ఈఎంఐ)లను ఎలా చెల్లించాలి? చెల్లింపుల నుంచి తాత్కాలిక విరామం (మారటోరియం) కోరాలా? లేక రుణ పునర్‌ వ్యవస్థీకరణ కోరాలా? అయితే ఈ స్టోరీ చదవండి.

తాత్కాలిక

ఉపశమనమే

ఈఎంఐల చెల్లింపుల నుంచి వాయిదా తాత్కాలిక ఉపశమనమే తప్ప.. దీర్ఘకాలిక పరిష్కారం కాదు. పైగా ఈ తాత్కాలిక ఉపశమనం వల్ల దీర్ఘకాలంలో రుణాలపై వడ్డీల మీద వడ్డీ పెరిగిపోయి తడిసి మోపెడవుతుంది. పైగా రుణ చెల్లింపుల వాయిదాలపై భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ఇప్పుడు అనేక ఆంక్షలు విధించింది. ఉద్యోగాలు పోవడం, తీవ్ర అనారోగ్యం, ప్రకృతి విపత్తుల వంటి ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఈ వాయిదాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. అయినా ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ వంటి బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీలు ఆయా వ్యక్తుల ఆర్థిక స్థితిగతుల ఆధారంగా ఏదో ఒక పేరుతో రుణ చెల్లింపుల వాయిదాలను అనుమతిస్తున్నాయి లేదా రుణాలను పునర్‌ వ్యవస్థీకరిస్తున్నాయి.


షరతులు

వర్తిస్తాయ్‌

కొన్ని షరతులకు లోబడి మాత్రమే బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీలు రుణ చెల్లింపుల నుంచి తాత్కాలిక ఉపశమనానికి అనుమతిస్తాయి. అప్పటి వరకు చెల్లించాల్సిన ఈఎంఐ క్రమం తప్పకుండా చెల్లించి ఉండాలి. ఒకవేళ బకాయి ఉన్నా 90 రోజులకు మించి ఉండకూడదు. ఉద్యోగం పోతే అప్పటి వరకు పని చేసిన కంపెనీ జారీ చేసిన టెర్మినేషన్‌ లెటర్‌, అనారోగ్య సమస్య అయితే అందుకు సంబంధించిన మెడికల్‌ బిల్స్‌, ప్రకృతి వైపరీత్యాలైతే అందుకు సంబంధించిన ప్రాంతీయ నివేదికలు సమర్పించాలి. ఈ రుజువులన్నీ సమర్పించినా అందరికీ చెల్లింపుల వాయిదా లభిస్తుందని చెప్పలేం. ఆయా వ్యక్తుల ఆర్థిక స్థితిగతులను జాగ్రత్తగా పరిశీలించి మాత్రమే బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీలు అందుకు ఆమోదం తెలుపుతాయి.

ఆర్థికంగా భారమే

ఈ వాయిదా ఊరికే రాదు. ఈఎంఐ చెల్లింపుల నుంచి తాత్కాలిక ఉపశమనం లభించినా, వాయిదా గడువు ముగిసే సరికి చెల్లించాల్సిన వడ్డీ ‘అసలు’కు జమ అవుతుంది. దీంతో ఈఎంఐ లేదా రుణ చెల్లింపు కాల వ్యవధి పెరిగి పోతుంది.

ఉదాహరణ: ఒక వ్యక్తి ఐదేళ్లలో చెల్లించేలా 12 శాతం వడ్డీతో ఒక బ్యాంకు నుంచి రూ.5 లక్షలు రుణంగా తీసుకున్నాడు. ఏదో ఆర్థిక సమస్య వచ్చి ఆ వ్యక్తి ఈఎంఐ చెల్లింపుల నుంచి మూడు నెలలు విరామం పొందాడనుకుందాం. ఈ మూడు నెలలకు అతడు చెల్లించాల్సిన రూ.7,500 వడ్డీ అసలుకు జమ అవుతుంది. పైగా ఇది చక్రవడ్డీల రూపంలో ఉంటుంది. మూడు నెలల తర్వాత మళ్లీ చెల్లింపులు ప్రారంభించినప్పుడు ఈఎంఐల రూపంలో రూ.10,000 వరకు అదనపు భారం పడుతుంది.

క్రెడిట్‌ స్కోరు ఓకే

ఈఎంఐల చెల్లింపుల్లో తీసుకునే ఈ తాత్కాలిక విరామం వల్ల ఆయా వ్యక్తుల క్రెడిట్‌ స్కోరుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. బ్యాంకులు కూడా ఈ విరామాన్ని డిఫర్డ్‌ లేదా అండర్‌ మారటోరియం పద్దు కింద చూపిస్తాయి తప్ప, చెల్లింపులు ఆగిపోయాయని చూపించవు. దీనివల్ల ఆయా వ్యక్తుల పరపతి స్కోరుకు ఎలాంటి ఢోకా ఉండదు. కాకపోతే చెల్లింపుల భారం, ఈఎంఐల గడువు పెరిగిపోతాయి. దీంతో రుణ భారం పెరిగి భవిష్యత్‌లో తీసుకునే రుణాలపైనా ప్రభావంచూపుతుంది.


మార్గాలు ఏమిటి?

బ్యాంకుతో మాట్లాడడంఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు అప్పు ఇచ్చిన బ్యాంకుతో నేరుగా మాట్లాడి రుణ పునర్‌ వ్యవస్థీకరణ, ఈఎంఐ తగ్గింపు లేదా వడ్డీ చెల్లింపుల భారం తగ్గించుకోవడం మంచిది.

ఎమర్జెన్సీ ఫండ్‌

ఆర్థిక కష్టాలు తాత్కాలికమైతే అత్యవసర ఖర్చుల కోసం దాచుకున్న మొత్తం నుంచి ఈఎంఐలు చెల్లించడం మంచిది.

ఖర్చులు తగ్గించుకోవడం

ప్రతి వ్యక్తికి ఎంతో కొంత అనవసర ఖర్చులు ఉంటాయి. ఈ ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా చాలా వరకు వాయిదాల అవసరం లేకుండానే రుణ ఈఎంఐలు చెల్లించవచ్చు.

ఇతర మార్గాలు

టాప్‌ అప్‌ రుణాల ద్వారా కూడా రుణ చెల్లింపుల వాయిదాల నుంచి తప్పించుకోవచ్చు. ఒకవేళ అనేక రుణాలు ఉంటే అన్ని రుణాలను, ఒకే రుణంగా మార్చి తక్కువ వడ్డీ వసూలు చేసి బ్యాంకుకు మార్చి కూడా వాయిదాల భారం నుంచి బయట పడవచ్చు.

పై విషయాలను దృష్టిలో ఉంచుకుని రుణ చెల్లింపుల ‘వాయిదా’ అస్త్రాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. లేకపోతే అదే పెద్ద గుదిబండగా మారి ఆర్థిక స్థితి గతుల్ని తారుమారు చేసే ప్రమాదం ఉంది.

ఈ వార్తలు కూడా చదవండి...

అమర్నాథ్ దిగజారి మాట్లాడుతున్నారు.. ఎంపీ శ్రీభరత్ ఫైర్

ఏపీ లిక్కర్ స్కామ్‌ కేసులో బిగ్‌బాస్‌ అరెస్ట్ ఖాయం

Read Latest AP News and National News

Updated Date - Aug 03 , 2025 | 05:51 AM