Share News

Stock Market: 7 రోజుల ర్యాలీకి బ్రేక్‌

ABN , Publish Date - Apr 25 , 2025 | 05:18 AM

ఏడు రోజుల ర్యాలీకి బ్రేక్‌ పడింది. లాభాల స్వీకరణ, నిరాశాజనక త్రైమాసిక ఫలితాలతో సెన్సెక్స్‌ 315 పాయింట్లు పడిపోయింది. బంగారం, వెండి ధరలు పెరిగాయి

Stock Market: 7 రోజుల ర్యాలీకి బ్రేక్‌

సెన్సెక్స్‌ 315 పాయింట్లు డౌన్‌

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లో ఏడు రోజుల ర్యాలీకి తెరపడింది. మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం, నిరాశాజనక త్రైమాసిక ఆర్థిక ఫలితాల కారణంగా ప్రామాణిక సూచీలు గురువారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 315.06 పాయింట్లు కోల్పోయి 79,801.43 వద్దకు.. నిఫ్టీ 82.25 పాయింట్ల నష్టంతో 24,246.70 వద్దకు జారుకున్నాయి. ఆసియా, ఐరోపా మార్కెట్లో స్తబ్ధత కూడా ట్రేడింగ్‌ సెంటిమెంట్‌పై ప్రభావం చూపింది. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 17 నష్టపోయాయి. మార్చి త్రైమాసిక లాభం తగ్గడంతో ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హెచ్‌యూఎల్‌ షేరు 4 శాతం క్షీణించి సెన్సెక్స్‌ టాప్‌ లూజర్‌గా మిగిలింది. బీఎస్‌ఈలోని మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 0.16 శాతం వరకు తగ్గాయి. రంగాల వారీ సూచీల్లో రియల్టీ 1.39 శాతం నష్టపోగా.. ఎఫ్‌ఎంసీజీ, టెక్‌ ఇండెక్స్‌లు అర శాతానికి పైగా తగ్గాయి.

  • ఫారెక్స్‌ ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 12 పైసలు పెరిగి రూ.85.33 వద్ద ముగిసింది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ ముడి చమురు బ్యారల్‌ ధర ఒక దశలో 66.10 డాలర్ల స్థాయిలో ట్రేడైంది.

  • ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (99.9 శాతం స్వచ్ఛత) బంగారం ధర రూ.200 పెరిగి రూ.99,400 స్థాయికి చేరింది. కిలో వెండి రూ.700 పెరుగుదలతో రూ.99,900 ధర పలికింది. అంతర్జాతీయ విపణిలో ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ 1.43 శాతం పెరిగి 3,335 డాలర్లకు చేరగా.. సిల్వర్‌ 33.42 డాలర్ల స్థాయిలో ట్రేడైంది.

Updated Date - Apr 25 , 2025 | 05:20 AM