RBI: రూపాయి విలువ స్థిరీకరణకు ఆర్‌బీఐ ప్రయత్నాలు.. 7.7 బిలియన్ డాలర్ల విక్రయం
ABN , Publish Date - Oct 21 , 2025 | 08:28 PM
పడిపోతున్న రూపాయి విలువను స్థిరీకరించేందుకు ఆర్బీఐ ఆగస్టు నెలలో 7.7 బిలియన్ డాలర్లను విక్రయించింది. రూపాయి విలువలో తీవ్ర హెచ్చుతగ్గులను అడ్డుకునేందుకు రంగంలోకి దిగుతామని ఆర్బీఐ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాతో వాణిజ్య ప్రతిష్టంభన నేపథ్యంలో రూపాయి మారకం విలువ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రూపాయి విలువను స్థిరీకరించేందుకు భారత రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) రంగంలోకి దిగింది. రూపాయికి మద్దతుగా ఆగస్టు నెలలో 7.69 బిలియన్ డాలర్ల మేర విక్రయించింది. అంతకుముందు నెలతో పోలిస్తే ఇది ఏకంగా మూడు రెట్లు ఎక్కువ. జులై, ఆగస్టు నెలల్లో ఆర్బీఐ ఎలాంటి డాలర్ కరెన్సీ కొనుగోళ్లను నిర్వహించలేదు. రూపాయి విలువలో హెచ్చుతగ్గులు అతిగా ఉంటేనే తాము జోక్యం చేసుకుంటామని ఆర్బీఐ గతంలో ప్రకటించింది (RBI intervention).
ఆగస్టు నెలలో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ భారీగా పతనమైన విషయం తెలిసిందే. సెప్టెంబర్ నెలలో కూడా ఈ పతనం కొంత మేర కొనసాగింది. అంతర్జాతీయంగా నెలకున్న అనిశ్చితిలు, భారత మార్కెట్‌ల నుంచి తరలిపోతున్న విదేశీ పోర్టు ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్‌లు రూపాయి విలువ తగ్గేందుకు కారణమయ్యాయి (Indian rupee fall).
అక్టోబర్ 20న డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 87.92 వద్ద ముగిసింది. అయితే, ఇది మరింత దిగువకు జారకుండా ఆర్బీఐ జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉన్నట్టు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటీవల కాలంలో ఎక్కువగా పతనమైన ఆసియా కరెన్సీల్లో రూపాయి ఒకటి. ఈ ఏడాది ఇప్పటివరకూ 4.61 శాతం మేర విలువ కోల్పోయింది. అయితే, సోమ, మంగళవారాల్లో మాత్రం కొద్దిగా కోలుకుని 10 పైసల మేర పెరిగింది. సెప్టెంబర్ 23న రూపాయి విలువ 88.39 కనిష్ఠ స్థాయిని తాకింది. స్పాట్, ఫార్వర్డ్ కరెన్సీ మార్కెట్ లావాదేవీలతో రూపాయి విలువను స్థిరీకరించేందుకు ఆర్‌బీఐ ప్రయత్నిస్తుంటుంది.
ఇవీ చదవండి:
ఈ పండుగ సీజన్‌లో పతాకస్థాయికి వాణిజ్యం.. చరిత్రలో మొదటిసారి..
సూచీలకు దివాళీ జోష్.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి