RBI Gold Loan Policy: గోల్డ్ లోన్స్ సంస్థలపై ఆర్బీఐ ప్రకటన ఇంపాక్ట్
ABN , Publish Date - Apr 09 , 2025 | 09:51 PM
ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం చేసిన ఒక ప్రకటన గోల్డ్ లోన్ కంపెనీల షేర్లపై ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో మదుపర్లు అమ్మకాలవైపు మొగ్గుచూపారు.

RBI Gold Loan Policy: గోల్డ్ లోన్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ త్వరలో సమగ్ర మార్గదర్శకాలు జారీ చేయబోతోంది. దీనికి సంబంధించి బుధవారం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఒక ప్రకటన చేశారు. బంగారు ఆభరణాలపై బ్యాంకులు, ఎన్బీఎఫ్‌సీ వంటి నియంత్రిత సంస్థలు బంగారు రుణాలు ఇస్తున్నాయని, అయితే, ఆయా సంస్థల రిస్క్ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గోల్డ్ లోన్ నిబంధనలు, ప్రవర్తనా నియమావళిపై సమగ్ర మార్గదర్శకాలు జారీ చేస్తామని ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు. కాగా, ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు గోల్డ్ లోన్ కంపెనీల రుణ ప్రక్రియను ఇంకాస్త కఠినతరం చేసే అవకాశం ఉందని అంచనా.
అయితే, ఆర్బీఐ గవర్నర్ ప్రకటన వెలువడిన వెంటనే ఇవాళ గోల్డ్ లోన్స్ ఇచ్చే పలు కంపెనీల షేర్లు కొంతమేర పడ్డాయి. ముత్తూట్ ఫైనాన్స్ షేరు ధర 6.78 శాతం క్షీణించి రూ.2,137.20 వద్ద ముగిసింది. అదే సమయంలో ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ షేరు ధర 2.50 శాతం క్షీణించి రూ.325.20 వద్ద ముగిసింది. మణప్పురం ఫైనాన్స్ షేరు 1.86 శాతం క్షీణించి రూ.224.81 వద్ద ముగిసింది. మరికొన్ని ఇదే తరహా వ్యాపారం చేసే సంస్థల షేర్లు కూడా ప్రభావితమయ్యాయి.