Share News

Oil Price Surge: ఇరాన్‌లో ఉద్రిక్తతలు.. ముడి చమురు ధరలకు రెక్కలు

ABN , Publish Date - Jun 23 , 2025 | 09:35 AM

హార్ముజ్ జలసంధిని మూసేస్తామన్న ఇరాన్ హెచ్చరికలతో ఇంధన ధరలకు రెక్కలొచ్చాయి. ఆసియా దేశాల్లో మార్కెట్ సూచీలు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి.

Oil Price Surge: ఇరాన్‌లో ఉద్రిక్తతలు.. ముడి చమురు ధరలకు రెక్కలు
oil prices 5 month high

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌పై అమెరికా దాడులు, హార్ముజ్ జలసంధి మూసివేత హెచ్చరికలు ఆసియా మార్కెట్‌లపై త్రీవ ప్రభావం చూపిస్తున్నాయి. సోమవారం ముడి చమురు ధరలు 2 శాతానికి పైగా పెరిగి ఐదు నెలల గరిష్ఠాన్ని తాకాయి. ఇరాన్ ప్రతీకార చర్యలపై ఆందోళనలు పతాకస్థాయికి చేరడంతో మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి.

హార్ముజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించడంతో ముడి ఇంధన ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. సోమవారం ధరల్లో ఏకంగా 2.8 శాతం పెరుగుదల కనిపించింది. తాజా ట్రేడింగ్‌లో యూఎస్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ (ముడి చమురు) ధర 2.8 శాతం మేర పెరిగి 75.98 డాలర్లు చేరుకుంది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 79.12 డాలర్లు చేరింది. యుద్ధ భయాలు కరెన్సీ మార్కెట్‌లనూ తీవ్ర ఒడిదుడుకులకు లోను చేశాయి. జపాన్ యెన్‌తో పోలిస్తే అమెరికా డాలర్ మారకం విలువ 0.25 శాతం పెరిగింది. ఇక యూరో మారకం విలువ డాలర్‌తో పోలిస్తే 0.33 శాతం మేర తగ్గింది.


కమోడిటీ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 0.1 శాతం తగ్గి 3363 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఈ అనిశ్చితిని అమెరికా మార్కెట్లు కొంత తట్టుకున్నట్టే కనిపించాయి. ఎస్ అండ్ పీ ఫ్యుచర్స్‌ 0.5 శాతం మేర తగ్గగా నాస్‌డాక్ 0.6 మేర నష్టాల్లో ఉంది. ఇక టోక్యో నిక్కీ ఇండెక్స్ 0.6 శాతం మేర, సియోల్ 1.4 శాతం మేర నష్టాల్లో ఉన్నాయి. సిడ్నీ సూచీ కూడా 0.7 నష్టాల్లో పడిపోయింది. ఐరోపాలో యూరోస్టాక్స్ 50 ఫ్యూచర్స్ కూడా 0.7 శాతం నష్టాల్లో ఉన్నాయి. ఎఫ్‌టీఎస్‌ఈ 0.5 శాతం మేర, డాక్స్ ఫ్యూచర్స్ 0.7 శాతం మేర నష్టాన్ని చవి చూస్తున్నాయి.

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో ముడి చమురు ధరలు ఇప్పటివరకూ 76 శాతం మేర పెరిగాయని జేపీ మోర్గన్ ఎనలిస్టులు చెబుతున్నారు. అయితే, హార్ముజ్ జలసంధి మూసివేత జరిగితే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 100 డాలర్లకు ఎగబాకినా ఆశ్చర్యపోనక్కర్లేదని కొందరు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.


హార్ముజ్ జలసంధి మూసివేతకు ఇరాన్ పార్లమెంట్ అంగీకరించిందన్న వార్తలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. అయితే, ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చాలంటే ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అనుమతి తప్పనిసరి. ఇరాన్ ప్రస్తుతం రోజుకు 3.3 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురును ఉత్పత్తి చేస్తోంది. చమురు కేంద్రాలపై ఇటీవల ఇజ్రాయెల్ దాడులు చేసినా నష్టం ఎంత జరిగిందనే దానిపై మాత్రం స్పష్టత లేదు. ఇక ప్రస్తుత పరిణామాలను భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది.

ఇవీ చదవండి:

సేవింగ్స్ అకౌంట్‌లో మీ డబ్బు ఉందా.. అయితే మీరీ విషయాలు తప్పక తెలుసుకోవాలి

సెకెండ్ హ్యాండ్ కారు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 23 , 2025 | 10:55 AM