Nvidias market capitalization: ఎన్‌విడియా @ 5 లక్షల కోట్ల డాలర్లు
ABN , Publish Date - Oct 30 , 2025 | 03:50 AM
కృత్రిమ మేధ చిప్‌ల తయారీ దిగ్గజం ఎన్‌విడియా సరికొత్త రికార్డు సృష్టించింది. అమెరికా స్టాక్ మార్కెట్లో కంపెనీ షేరు బుధవారం..
ప్రపంచంలో ఈ స్థాయి మార్కెట్ విలువ కలిగిన ఏకైక సంస్థ
భారత్, జపాన్, యూకే జీడీపీ కంటే అధికం
న్యూయార్క్: కృత్రిమ మేధ (ఏఐ) చిప్‌ల తయారీ దిగ్గజం ఎన్‌విడియా సరికొత్త రికార్డు సృష్టించింది. అమెరికా స్టాక్ మార్కెట్లో కంపెనీ షేరు బుధవారం నాడు ఒక దశలో 5.17 శాతం పెరిగి 211.43 డాలర్లకు చేరింది. దాంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 5.13 లక్షల కోట్ల డాలర్లకు ఎగబాకింది. ప్రపంచంలో 5 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువకు చేరుకున్న ఏకైక, తొలి కంపెనీ ఇదే. భారత్, జపాన్, యూకే జీడీపీల కంటే అధికమిది. కంపెనీకి 50,000 కోట్ల డాలర్ల విలువైన ఏఐ చిప్‌ల ఆర్డర్లు లభించాయని, అమెరికా ప్రభుత్వం కోసం 7 కొత్త సూపర్ కంప్యూటర్లను అభివృద్ధి చేయనున్నట్లు ఎన్‌విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ ప్రకటించడం తాజా ర్యాలీకి దోహదపడింది. అలాగే, 6జీ సెల్యులార్ టెక్నాలజీ అభివృద్ధి కోసం నోకియాలో 100 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెడుతున్నట్లు కంపెనీ ప్రకటించడం కూడా ఇందుకు తోడ్పడింది. మంగళవారం ట్రేడింగ్‌లోనూ కంపెనీ షేరు 5ు మేర లాభపడింది. ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీల జాబితాలో ఎన్‌విడియా తర్వాత ఐఫోన్ల తయారీ సంస్థ యాపిల్, మైక్రోసాఫ్ట్ 4 లక్షల కోట్ల డాలర్లకు పైగా మార్కెట్ విలువతో వరుసగా 2,3 స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏఐ సేవలకు, చిప్‌లకు డిమాండ్ శరవేగంగా పెరుగుతుండటంతో ఎన్‌విడియా షేరు కూడా అంతే వేగంగా పెరుగుతూ వచ్చింది. ఈ ఏడాదిలో ఇప్పటికే 50ు పైగా పుంజుకుంది.