UPI New Rules: ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త యూపీఐ రూల్స్ గురించి తెలుసా
ABN , Publish Date - Jul 26 , 2025 | 09:57 AM
ఆగస్టు 1 నుంచి యూపీఐ చెల్లింపులకు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. యూజర్లు అందరికీ వర్తించే ఈ రూల్స్ ఏంటో వివరంగా తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: యూపీఐ చెల్లింపులకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) కొత్తగా ప్రకటించిన రూల్స్ ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆటో-పే, బ్యాంక్ బ్యాలెన్స్ చెకింగ్ వంటి అనేక సేవలకు వర్తించే ఈ రూల్స్ ఏంటో వివరంగా తెలుసుకుందాం.
యూపీఐ సేవలను మరింత విశ్వసనీయంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా తీర్చి దిద్దేందుకు ఎన్‌పీసీఐ ఈ కొత్త రూల్స్‌ను ప్రకటించింది. చెల్లింపులు అధికంగా జరిగే వేళల్లో ఆటంకాలు కలగొద్దనేది ఈ రూల్స్ వెనకున్న ప్రధాన ఉద్దేశం.
కొత్త రూల్స్ ప్రకారం, ఇకపై ఆటోపే చెల్లింపులు నిర్దిష్ట సమయాల్లోనే జరుగుతాయి. మునుపటిలా రోజంతా ఈ చెల్లింపులకు ఆస్కారం ఉండదు. ఆటో పేమెంట్స్, సబ్‌స్క్రిప్షన్స్, యూటిలిటీ బిల్స్, ఈఎమ్‌ఐ వంటి వాటన్నిటికీ ఈ కొత్త రూల్ వర్తిస్తుంది. ఇవన్నీ తెరవెనుక జరిగే కార్యకలాపాలే. అయితే, ఆటోపేమెంట్స్‌కు ప్రత్యేక సమయాలు కేటాయించడం ద్వారా యూపీఐ వేదికపై ఒత్తిడి తగ్గుతుంది. ఈ నేపథ్యంలో ఆటోపే సేవను వినియోగించే వ్యాపారాలు తమ షెడ్యూల్‌లో మార్పులు చేయాల్సి ఉంటుంది.
ఆగస్టు 1 నుంచి వినియోగదారులు యూపీఐ ద్వారా తమ అకౌంట్ బ్యాలెన్స్‌ను రోజుకు 50 సార్లు మాత్రమే చెక్ చేసుకునే అవకాశం ఉంది. ఈ నిబంధనలు యూపీఐ సర్వీసును వినియోగించే వారందరికీ వర్తిస్తాయి.
ఇక డిజిటల్ చెల్లింపులపై చార్జీల విధింపు గురించి ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీఐ చెల్లింపుల వ్యవస్థకు ఆర్థిక సుస్థిరత చేకూర్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం చెల్లింపులకు అయ్యే ఖర్చును సబ్సిడీ రూపంలో ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. ఈ విధానం ఎక్కువ కాలం మనలేదని స్పష్టం చేశారు. ఏ సేవ అయినా సుస్థిరంగా కొనసాగాలంటే కొంత డబ్బు చెల్లించక తప్పదని చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో యూపీఐ ఆధారిత చెల్లింపుల సంఖ్య మునుపెన్నడూ చూడని స్థాయికి చేరుకుంది. ఇందుకు కావాల్సిన మౌలిక వసతుల నిర్వహణను బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, ఎన్‌పీసీఐ భరిస్తున్నాయి. ఫలితంగా వినియోగదారులు ఉచితంగానే ఈ సేవలను పొందగలుగుతున్నారు.
ఇవీ చదవండి:
బిలియనీర్‌గా మారిన ఆల్ఫబెట్ సీఈఓ సుందర్ పిచాయ్
క్రెడిట్ కార్డు క్లోజ్ చేస్తే క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుందా..