Nandan Nilekani On AI: భారత్‌కు భారీ ఏఐ మోడల్స్ లేవన్న బాధొద్దు.. ఆధార్ రూపకర్త నందన్ నీలేకని వ్యాఖ్య
ABN , Publish Date - Apr 11 , 2025 | 10:42 PM
భారత్‌కు భారీ ఏఐ మోడల్స్ లేవన్న బాధొద్దని ఆధార్ రూపకర్త నందన్ నీలేకని వ్యాఖ్యానించారు. భారత్‌కు ఇప్పటికే చిన్న తరహా ఏఐ మోడల్స్ ఉన్నాయని, వాటిని విస్తరించడంపై దృష్టిపెట్టాలని అన్నారు.

ఇంటర్నెట్ డెస్క్: భారత దేశానికి తనకంటూ ‘డీప్ సీక్’, ‘చాట్‌జీపీటీ’ లాంటి భారీ ఏఐ మోడల్స్ లేకపోవడంపై చింతించాల్సిన అవసరం లేదని ఆధార్ రూపకర్త, ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నందన్ నీలేకని అన్నారు. భారత్ ఇప్పటికే తనకంటూ ఓ ఏఐ మిషన్‌ను ఏర్పాటు చేసుకుందని, ఎన్నో చిన్న తరహా మోడల్స్ ఉన్నాయని అన్నారు. వీటిని మరింతగా విస్తరించడంపై దృష్టి పెట్టాలని అన్నారు. గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న ఏఐ విప్లవంపై కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశారు (Nandan Nilekani On AI).
‘‘మునుపటి సాంకేతిక విప్లవాలకు, నేటి ఏఐ విప్లవానికి మధ్య తేడా ఏంటంటే నేడు మనం కంప్యూటర్ ఆధారిత మేథోశక్తిపై ఎక్కువ నమ్మకం ఉంచాల్సిన పరిస్థితి ఉంది. మునుపటి టెక్నాలజీల్లో కచ్చితత్వంతో మనుషుల అంచాలకు తగినట్టుగా ఉండేవి. ఇప్పుడు మనం యంత్రాలు ఈ నిర్ణయాలు తీసుకోవాలని ఆశిస్తున్నాము. యంత్రాలపై నమ్మకంతో ముందుకెళుతున్నాము’’ అని నీలేకని అన్నారు. ఏఐ రంగంలో పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ ఇండియాకు ఉన్న బలమైన డిజిటల్ మౌలిక వసతులు (యూపీఐ, ఆధార్) అక్కరకు వస్తాయని అన్నారు. వీటి సాయంతో ఏఐ సాంకేతికతను విస్తరించొచ్చని అభిప్రాయపడ్డారు. భారీ ఏఐ మోడల్స్ రూపకల్పనలో పోటీ పడే బదులు భారత్ అవసరాలకు అందుబాటులో ఉండే బాధ్యతాయుతమైన, సమ్మిళిత ఏఐ పరిష్కారాలను కనుగొనాలని అన్నారు.
ఓపెన్ ఏఐ, గూగుల్, మైక్రోసాఫ్ట్ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఏఐ రంగంలో చైనాకు చెందిన డీప్ సీక్ ఏఐ రాక పోటీని ఒక్కసారిగా పెంచేసిన విషయం తెలిసిందే. చాట్‌జీపీటీ కోసం ఓపెన్ ఏఐ 540 మిలియన్ డాలర్లు ఖర్చు చేయగా ఓపెన్ సోర్సో మోడల్ ఆధారిత డీప్ సీక్‌కు మాత్రం కేవలం 6 మిలియన్ డాలర్లే ఖర్చయ్యాయి. దీంతో, టెక్ కంపెనీలు వేగం పెంచాయి. తక్కువ ఖర్చుతో ఓపెన్ ఆధారిత ఏఐ ఉత్పత్తులను పలు కంపెనీలు మార్కెట్‌లోకి వడివడిగా విడుదల చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
ట్రంప్ ప్రభుత్వంలో చేరిన ఫలితం..మస్క్ ఎంత నష్టం వచ్చిందో చూస్తే
పీఎఫ్ ఉద్యోగులకు అలర్ట్..మరింత ఈజీగా UAN నంబర్ పొందే ఛాన్స్..
తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నప్పటికీ..తండ్రి కలను నిజం చేసిన కుమార్తె,