Microsoft: మరోసారి మైక్రోసాఫ్ట్‌లో లేఆఫ్స్.. వేలల్లో తొలగింపులు ఉంటాయంటూ కథనాలు వైరల్
ABN , Publish Date - Jun 19 , 2025 | 11:04 AM
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి భారీగా ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమవుతోందన్న వార్త కలకలం రేపుతోంది. సేల్స్ విభాగంలో ఈ తొలగింపులు అధికంగా ఉండే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

ఇంటర్నెట్ డెస్క్: భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించేందుకు ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ (Microsoft Layoffs) సిద్ధమవుతోంది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు కలకలం రేపుతున్నాయి. వేలల్లో ఉద్యోగులను తొలగిస్తారని సమాచారం. మే నెలలో లేఆఫ్స్‌లో ఏకంగా 6 వేల మందిని జాబ్స్ నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో మరోసారి మైక్రోసాఫ్ట్ లే ఆఫ్స్‌కు రెడీ అయ్యిందన్న వార్త సంచలనంగా మారింది. వచ్చే నెలలో ఈ లేఆఫ్స్ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే, ఈ వార్తలపై సంస్థ ఇంకా స్పందించాల్సి ఉంది.
ఈసారి లేఆఫ్స్ ప్రభావం కస్టమర్ ఫేసింగ్ రోల్స్‌లోని ఉద్యోగులపై ఎక్కువగా ఉండొచ్చని సమాచారం. మునుపటి లేఆఫ్స్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, ప్రాడక్ట్ డెవలపర్లు ఎక్కువగా జాబ్స్ పోగొట్టుకున్నారు. మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగుల సంఖ్య సుమారు 2.28 లక్షలు. సేల్స్, మార్కెటింగ్ విభాగంలో 45 వేల మంది పని చేస్తున్నారు.
స్వల్ప శ్రేణి, మధ్య శ్రేణి సంస్థలకు మైక్రోసాఫ్ట్ ఉత్పత్తుల మార్కెటింగ్, సేల్స్ బాధ్యతలను థర్డ్ పార్టీ ఫర్మ్స్‌కు బదిలీ చేసేందుకు సిద్ధమైనట్టే ఏప్రిల్‌లోనే మైక్రోసాప్ట్ సంకేతాలిచ్చింది. ఇక ఏఐపై కూడా దృష్టి పెట్టిన సంస్థ ఈ ఏడాది సుమారు 80 బిలియన్ డాలర్ల పెట్టుబడులను డాటా సెంటర్ల ఏర్పాటు, అభివృద్ధికి కేటాయించింది. అదే సమయంలో ఖర్చులు తగ్గించుకునేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుంటోంది. అయితే గతంలో చేపట్టిన తొలగింపులు సంస్థ పునర్వ్యవస్థీకరణలో భాగమని ఇటీవల సీఈఓ సత్య నాదెళ్ల పేర్కొన్నారు. పనితీరు ఆధారిత తొలగింపులు కావని స్పష్టం చేశారు. కరోనా సమయంలో భారీగా నియామకాలు చేపట్టిన సంస్థ 2023 జనవరిలో సుమారు 10 వేల మందిని తొలగించింది. ఆక్టీవిజన్ బ్లిజర్డ్‌ను చేజిక్కించుకున్నాక వీడియోగేమ్ విభాగంలోనూ లేఆఫ్స్ చేపట్టింది.
అన్ని రంగాల్లో ఏఐ విస్తరిస్తున్న నేపథ్యంలో లేఆఫ్స్ భయాలు పెరుగుతున్నాయి. క్రియేటివ్, క్లరికల్, కస్టమర్ సర్వీస్ ఉద్యోగులకు ఆటోమేషన్ రిస్క్ ఎక్కువగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. భారత్‌లో 66 శాతం మంది ఏఐ ప్రభావం తమ జాబ్‌పై ఉండొచ్చని ఆందోళనతో ఉన్నట్టు ఇటీవల జరిగిన ఓ సర్వేలో తేలింది. అయితే, ఏఐ సామర్థ్యంతో ప్రయోజనాలపై 65 శాతం మంది ఆసక్తి ప్రదర్శించారు. ఏఐతో కొత్త జాబ్స్ అందుబాటులోకి వస్తాయని ఎన్‌విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ ఇటీవల పేర్కొన్నారు. ఏఐతో ఉత్పాదకత పెరుగుతుందని, మానవవనరులను ఇతర సృజనాత్మకమైన పనుల వైపు మళ్లించే అవకాశం ఉంటుందని ఆల్ఫ్‌బెట్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా అన్నారు.
ఇవీ చదవండి:
సేవింగ్స్ అకౌంట్‌లో మీ డబ్బు ఉందా.. అయితే మీరీ విషయాలు తప్పక తెలుసుకోవాలి
సెకెండ్ హ్యాండ్ కారు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి