Share News

UPI Service Update: యూపీఐలో వచ్చిన మార్పులేమిటంటే

ABN , Publish Date - Aug 03 , 2025 | 05:45 AM

మీరు ఫోన్‌పే, గూగుల్‌ పే, పేటీఎం, అమెజాన్‌ పే వంటి డిజిటల్‌ చెల్లింపుల యాప్‌లు వాడుతున్నారా..? ఈ యాప్‌ల ద్వారా యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) సేవలను వినియోగించుకుంటున్నారా....

UPI Service Update: యూపీఐలో వచ్చిన మార్పులేమిటంటే

మీరు ఫోన్‌పే, గూగుల్‌ పే, పేటీఎం, అమెజాన్‌ పే వంటి డిజిటల్‌ చెల్లింపుల యాప్‌లు వాడుతున్నారా..? ఈ యాప్‌ల ద్వారా యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) సేవలను వినియోగించుకుంటున్నారా..? అయితే, ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే ఈ నెల 1 నుంచే యూపీఐ సేవల్లో కొన్ని మార్పులు వచ్చాయి. అయితే, ఈ మార్పులతో రోజువారీ చెల్లింపులపై ఎలాంటి ప్రభావం ఉండనప్పటికీ, యూపీఐ సేవల వినియోగంపైన మాత్రం యూపీఐ అభివృద్ధి, నిర్వహణ సంస్థ నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) కొన్ని పరిమితులను విధించింది. ఆ వివరాలు..

బ్యాంక్‌ బ్యాలెన్స్‌

ఇప్పటివరకు వినియోగదారులకు యూపీఐ ద్వారా అనుసంధానిత బ్యాంకు ఖాతాలో ఎంత నగదు ఉందని ఎన్ని సార్లైనా పరిశీలించే వెసులుబాటు ఉంది. తాజాగా ఈ సేవలపై ఎన్‌పీసీఐ పరిమితి విధించింది. ఈ నెల 1 నుంచి ఒక్కో యూపీఐ యాప్‌ నుంచి రోజులో 50 సార్లు మాత్రమే బ్యాంకు అకౌంట్‌లోని బ్యాలెన్స్‌ను చెక్‌ చేసుకునే వీలుంటుంది. అత్యధిక లావాదేవీలు చోటు చేసుకునే సమయాల్లో వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించేందుకు ఎన్‌పీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, యూపీఐ యాప్‌ నుంచి జరిపే ప్రతి చెల్లింపు పూర్తయ్యాక మీ ఖాతాలో నిల్వ ఎంత మిగిలి ఉందనేది వెంటనే చూడగలుగుతారు.

ఆటో చెల్లింపులు

వర్తకులకు స్వయంచాలక (ఆటోమెటిక్‌) చెల్లింపులు లేదా నెలవారీ ఈఎంఐ, ఓటీటీల సబ్‌స్ర్కిప్షన్‌ పునరుద్ధరణ, మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లో క్రమానుగత పెట్టుబడులు (సిప్‌) వంటి పునరావృత చెల్లింపులను ఇకపై ఉదయం 10 గంటలకు ముందు లేదా రాత్రి 9.30 గంటల తర్వాతే ప్రాసెస్‌ చేయడం జరుగుతుందని ఎన్‌పీసీఐ తెలిపింది. వ్యవస్థపై లావాదేవీల ప్రాసెసింగ్‌ భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.


బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు

యూపీఐ వినియోగదారులు ఇకపై తమ మొబైల్‌ నంబరుతో అనుసంధానితమైన బ్యాంకు ఖాతాల వివరాలను రోజులో గరిష్ఠంగా 25 సార్లు మాత్రమే పొందగలుగుతారు.

పేమెంట్‌ స్టేటస్‌

యూపీఐ వినియోగదారులు పెండింగ్‌లో ఉన్న లావాదేవీ స్టేటస్‌ (స్థితిని) కేవలం మూడు సార్లే చెక్‌ చేసుకునే వీలుంటుంది. అది కూడా, ఒకసారి పరిశీలించాక కనీసం 90 సెకన్ల తర్వాతే మళ్లీ చెక్‌ చేసుకోగలుగుతారు.

ఈ వార్తలు కూడా చదవండి...

అమర్నాథ్ దిగజారి మాట్లాడుతున్నారు.. ఎంపీ శ్రీభరత్ ఫైర్

ఏపీ లిక్కర్ స్కామ్‌ కేసులో బిగ్‌బాస్‌ అరెస్ట్ ఖాయం

Read Latest AP News and National News

Updated Date - Aug 03 , 2025 | 05:45 AM