Intel: ఏఐ హార్డ్‌వేర్ రేసులో బాగా వెనకబడ్డాం.. ఇంటెల్ సీఈఓ ఆందోళన
ABN , Publish Date - Jul 12 , 2025 | 02:18 PM
ఏఐ హార్డ్‌వేర్ రేసులో బాగా వెనకబడ్డామని, పురోగతి సాధించేందుకు సమయం కూడా మించిపోయిందని ఇంటెల్ సంస్థ సీఈఓ ఉద్యోగులతో అన్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సంస్థ ఎడ్జ్ ఏఐ వైపు మళ్లినట్టు తెలుస్తోంది

ఇంటర్నెట్ డెస్క్: సెమీకండక్టర్ చిప్స్ తయారీ సంస్థ ఇంటెల్ సీఈఓ లిప్ బు టాన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ హార్డ్‌వేర్ రేసులో తాము చాలా వెనకబడ్డామని ఉద్యోగులతో అంతర్గత చర్చ సందర్భంగా అంగీకరించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. రేసులో ముందడుగు వేసేందుకు సమయం మించిపోయిందని ఆయన అన్నట్టు సమాచారం. సెమీకండక్టర్ చిప్స్ రంగంలో ఒకప్పుడు అగ్రగామిగా ఉన్న ఇంటెల్.. కొంతకాలంగా ఎన్‌విడియా, ఏఎమ్‌డీ, యాపిల్, టీఎస్ఎమ్‌సీ, శామ్‌సంగ్ వంటి సంస్థల నుంచి గట్టి పోటీ ఎదుర్కుంటోంది. ముఖ్యంగా ఏఐ హార్డ్‌వేర్ రంగంలో ఎన్‌విడియా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో గత వైభవం తిరిగి పొందాలన్న ఒత్తిడి సంస్థ నాయకత్వంపై విపరీతంగా పెరిగింది.
ఏఐ చిప్ రేసులో వెనుకబాటు
సెమీకండక్టర్ ప్రపంచంలో ఇంటెల్‌ది ఒకప్పుడు నెం.1 స్థానం. అయితే, ఏఐ హార్డ్‌వేర్ రంగంలో ఎన్‌విడియా ఎంట్రీ ఇచ్చి ఇంటెల్‌కు ప్రధాన పోటీదారుగా మారింది. ఎల్ఎల్ఎమ్ లాంటి ఏఐ సాంకేతికతల అభివృద్ధికి అత్యంత శక్తిమంతమైన సెమీకండక్టర్ చిప్స్ అవసరం. ఇప్పుడు అధిక శాతం ఏఐ సాంకేతికతలు ఎన్‌విడియాకు చెందిన సీయూడీఏ బేస్డ్ కంప్యూటర్ చిప్స్‌పైనే ఆధారపడి ఉన్నాయి.
ఈ రంగంలో ఆధిపత్యం కోసం ఇంటెల్ కొంత ప్రయత్నించింది. హబానా లాబ్స్, గౌడీ ఏఐ సంస్థలను టేకోవర్ చేసింది. అయితే, ఆశించిన స్థాయిలో మాత్రం రాణించలేకపోయింది. ఎన్‌విడియాకు చెందిన హెచ్100, ఏఎమ్‌డీకి చెందిన ఎమ్ఐ300ఎక్స్ చిప్స్ మార్కెట్‌లో పాతుకుపోయాయి. చాట్‌జీపీటీ లాంటి సంస్థల రాకతో వీటికి మరింత డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో టాప్ టెన్ ఏఐ హార్డర్‌వేర్ సంస్థల జాబితాలో ఇంటెల్ స్థానం కోల్పోయింది.
ఇంటెల్ సంస్థ సీఈఓ వ్యాఖ్యలు ఈ భావననే ప్రతిఫలిస్తున్నాయని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే, ఏఐ రంగంలో తన మార్కును కొనసాగించేందుకు ఎడ్జ్ ఏఐ వైపు మళ్లేందుకు ఇంటెల్ ప్రయత్నిస్తోంది. లాప్‌టాప్, డెస్క్‌టాప్, ఎంబెడెడ్ సిస్టమ్స్ ద్వారా ఏఐని వినియోగదారులకు మరింత చేరువ చేసే విభాగంలో అభివృద్ధికి అవకాశాలు మెండుగా ఉన్నాయని సంస్థ భావిస్తోంది.
ఇవీ చదవండి:
చైనా నిపుణులు భారత్‌ను వీడుతున్న వైనంపై కేంద్రం నజర్
బ్యాంక్ లాకర్‌లో బంగారం దాస్తున్నారా.. ఈ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఏం చెబుతున్నారో తెలిస్తే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి