Narayanamurthy on AI: భారత్‌లో ఏఐ హైప్‌పై ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Mar 16 , 2025 | 07:39 PM
భారత్‌లో ఏఐకి వస్తున్న ప్రచారంపై ఇన్ఫోసిస్ నారాయణమూర్తి తాజాగా స్పందించారు. సాధారణ ప్రోగ్రామ్స్‌కు ఏఐగా ప్రచారం చేసుకోవడం ఫ్యాషన్‌గా మారిపోయిందని అన్నారు.

ఇంటర్నెట్ డెస్క్: భారతీయ ఏఐ రంగంపై ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకులు నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో సాధారణ ప్రోగ్రామింగ్‌ను ఏఐ అని పేరుపెట్టడం ఫ్యాషన్‌గా మారిందని అన్నారు. ‘‘నేను అనుకోవడం ఏంటంటే.. భారత్‌లో ఏ విషయంలోనైనా ఏఐ ప్రస్తావన తేవడం ఫ్యాషన్‌గా మారిపోయింది. సాధారణ ప్రోగ్రామ్స్‌కు కూడా ఏఐ అని పేరు పెడుతున్నారు’’ అని ఆయన కామెంట్ చేశారు. ఇటీవల ఓ చర్చాకార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు కామెంట్ చేశారు. ఏఐకి సంబంధించినంత వరకూ మెషీన్ లర్నింగ్, డీప్ లర్నింగ్ అనే రెండు అంశాలు అత్యంత ముఖ్యమని అన్నారు.
Read More: తగ్గిన గోల్డ్, భారీగా పెరిగిన వెండి.. ఎంతకు చేరుకున్నాయంటే..
‘‘డీప్ లర్నింగ్, న్యూరల్ నెట్వర్క్స్ సాయంతో నడిచే అన్‌సూపర్‌వైజ్డ్ ఆల్గోరిథమ్స్‌కు మనుషులతో సమానమైన నైపుణ్యాలు కనబరిచే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం సాధారణ ప్రోగ్రామింగ్‌ను ఏఐ పేరిట ప్రచారం కల్పిస్తున్నారు’’ అని నారాయణ మూర్తి కామెంట్ చేశారు. మెషీన్ లర్నింగ్ ట్రెయినింగ్ మనుషుల అవసరం ఉంటుందని, డీప్ లర్నింగ్ తనంతట తానుగా విషయాలను అర్థం చేసుకుుంటుందని ఆయన వివరించారు.
Read More: పన్ను పోటు తగ్గించే ఫిక్స్‌డ్ డిపాజిట్లు
ఏఐతో కొన్ని జాబ్స్ పోయే అవకాశం ఉన్నప్పటికీ ఆర్థికాభివృద్ధికి ఊతమిస్తుందని అన్నారు. ‘‘ఏ టెక్నాలజీతో అయినా కొన్ని ఉద్యోగాలు పోతాయి. కానీ వీటిని సరిగ్గా అమలు పరిస్తే ఆర్థికాభివృద్ధి జరుగుతుంది’’ అని అన్నారు. వ్యాపారస్తులు మరిన్ని ఉద్యోగావకాశాలను కూడా కల్పించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘మీరందరూ వెల కొద్దీ ఉద్యోగాలను సృష్టిస్తారన్న నమ్మకం నాకుంది. పేదరికానికి ఇదే పరిష్కారం. ఉచితాలతో ఏ దేశంలోనూ పేదరిక నిర్మూలన జరగలేదు’’ అని వ్యాఖ్యానించారు. దీంతో, ఏఐపై ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
మరోవైపు, ఏఐ సాంకేతికతలో వేగంగా మార్పులు జరుగుతున్నాయి. కేవలం బొమ్మలు, కామెంట్స్‌కు పరిమితమయ్యే బదులు సంగీతం వంటి సృజనాత్మక సామర్థ్యులన్న ఏఐ అభివృద్ధికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏఐ ఆధారిత సెల్ఫ డ్రైవింగ్ కార్లు, డార్క్ ఫ్యాక్టరీలపై కూడా అప్పుడే చర్చ మొదలైంది. అనేక రంగాల్లో ఏఐ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Read More Business News and Latest Telugu News