Share News

Digital Payments India: రూ 12000 లక్షల కోట్ల చెల్లింపులు

ABN , Publish Date - Jul 29 , 2025 | 06:22 AM

డిజిటల్‌ చెల్లింపుల్లో భారత్‌ దూసుకెళ్తోంది. గత ఆరేళ్లలో (2019-20 నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు) రూ.12,000 లక్షల కోట్లకు పైగా విలువైన 65,000 కోట్లకు పైగా డిజిటల్‌ చెల్లింపుల...

Digital Payments India: రూ 12000 లక్షల కోట్ల చెల్లింపులు
UPI Payments

65,000 కోట్ల లావాదేవీలు

గత 6 ఏళ్లలో జరిగిన డిజిటల్‌ పేమెంట్స్‌ ఇవి..

న్యూఢిల్లీ: డిజిటల్‌ చెల్లింపుల్లో భారత్‌ దూసుకెళ్తోంది. గత ఆరేళ్లలో (2019-20 నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు) రూ.12,000 లక్షల కోట్లకు పైగా విలువైన 65,000 కోట్లకు పైగా డిజిటల్‌ చెల్లింపుల లావాదేవీలు జరిగాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి లోక్‌సభకు వెల్లడించారు. దేశంలో డిజిటల్‌ చెల్లింపుల వినియోగాన్ని మరింత పెంచేందుకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ), నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ), ఫిన్‌టెక్‌లు, బ్యాంక్‌లు, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సంబంధిత వర్గాలందరితో కలిసి పనిచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. చిన్న నగరాలు, ఈశాన్య రాష్ట్రాలు, జమ్ము కశ్మీర్‌లో డిజిటల్‌ చెల్లింపుల స్వీకరణకు అవసరమైన మౌలిక వసతులను ప్రోత్సహించేందుకు ఆర్‌బీఐ 2021లో పేమెంట్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవల్‌పమెంట్‌ ఫండ్‌ (పీఐడీఎఫ్‌) ను ఏర్పాటు చేసిందని మంత్రి తెలిపారు. 2025 మే 31 నాటికి పీఐడీఎఫ్‌ ద్వారా 4.77 కోట్ల డిజిటల్‌ టచ్‌ పాయింట్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.


ప్రపంచంలో అతిపెద్ద చెల్లింపుల వ్యవస్థగా యూపీఐ కొవిడ్‌ సంక్షోభ సమయం నుంచి దేశంలో డిజిటల్‌ చెల్లింపులు ఊపందుకున్నాయి. పెద్ద నగరాల నుంచి పల్లెల వరకు అన్ని ప్రాంతాల్లోనూ డిజిటల్‌ చెల్లింపుల సాంకేతికత, మౌలిక వసతులు వేగంగా విస్తరించింది. దేశంలో చౌక డేటా సేవలతో స్మార్ట్‌ఫోన్ల వినియోగం అనూహ్యంగా పెరగడం ఈ విప్లవాత్మక మార్పునకు ప్రధాన చోదకంగా పనిచేసింది. ఎన్‌పీసీఐ అభివృద్ధి చేసిన యూనిఫైడ్‌ పేమెంట్‌ సిస్టమ్‌ (యూపీఐ) ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్‌ రియల్‌ టైమ్‌ చెల్లింపుల వ్యవస్థగా ఎదిగింది. ప్రపంచంలో అతిపెద్ద ఇంటర్‌ బ్యాంక్‌ పేమెంట్‌ సెటిల్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్‌ వీసా రోజువారీ లావాదేవీల సంఖ్యకు చేరువలో ఉంది. గత నెల 2న యూపీఐ ద్వారా రికార్డు స్థాయిలో 65 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఎన్‌పీసీఐ డేటా ప్రకారం.. ఈ ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో మహారాష్ట్రలో అత్యధిక యూపీఐ లావాదేవీలు జరగగా.. కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

కస్టమర్ల ఖాతాల నుంచి కోట్ల రూపాయల దోపిడీ.. పరారీలో ఎస్‌బీఐ క్లర్క్

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 29 , 2025 | 06:55 AM