India Cement Industry: సిమెంట్ రంగంలో రూ 1.2 లక్షల కోట్ల పెట్టుబడులు
ABN , Publish Date - Nov 13 , 2025 | 06:39 AM
Indias Cement Industry to Invest rupees1.2 Lakh Crore, Add 16 to17 Million Tonnes Capacity by 2028
సిమెంట్ రంగంలో రూ. 1.2 లక్షల కోట్ల పెట్టుబడులు
2028 నాటికి మరో 16-17 కోట్ల టన్నుల సామర్ధ్యం జోడింపు
న్యూఢిల్లీ: దేశీయ సిమెంట్ పరిశ్రమ మంచి జోరు మీదుంది. గత మూడేళ్లుగా గిరాకీ ఏటా సగటున 9.5ు చొప్పున పెరుగుతోంది. పెరుగుతున్న గిరాకీని తట్టుకునేందుకు కంపెనీలు ఉత్పత్తి సామర్ధ్య విస్తరణ, కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు సిద్ధమయ్యాయి. వచ్చే మూడేళ్లలో కంపెనీలు ఇందుకోసం ఎంతలేదన్నా రూ.1.2 లక్షల కోట్ల వరకు ఖర్చు చేస్తాయని రేటింగ్ సంస్థ క్రిసిల్ అంచనా. గత మూడేళ్లతో పోలిస్తే ఇది 50ు ఎక్కువ. ఈ విస్తరణ, నూతన ప్రాజెక్టులతో వచ్చే మూడేళ్లలో (2026-28) అదనంగా మరో 16 నుంచి 17 కోట్ల టన్నుల గ్రైండింగ్ సామర్ధ్యం అందుబాటులోకి వస్తుందని కూడా అంచనా వేసింది. గత మూడేళ్లలో నమోదైన 9.5 కోట్ల అదనపు ఉత్పత్తి సామర్ధ్యంతో పోలిస్తే ఇది 75ు ఎక్కువ. దీంతో ప్రస్తుతం 66.8 కోట్ల టన్నులుగా ఉన్న కంపెనీల వార్షిక ఉత్పత్తి సామర్ధ్యం 2028 మార్చి నాటికి 82.8 లేదా 83.8 కోట్ల టన్నులకు పెరుగుతుందని పేర్కొంది. అయితే కొత్తగా అందుబాటులోకి వచ్చే ఉత్పత్తి సామర్ధ్యంలో 65ు ఇప్పటికే ఉత్పత్తిలో ఉన్న ప్లాంట్ల సామర్ధ్య విస్తరణ ద్వారా వస్తుందని, ఈ కారణంగా పెట్టుబడి వ్యయాలు మరీ అంత భారీగా ఉండకపోవచ్చని క్రిసిల్ పేర్కొంది. ఈ కొత్త పెట్టుబడుల్లో 10 నుంచి 15ు పెట్టుబడులను సిమెంట్ కంపెనీలు సొంత ఇంధన అవసరాల కోసం ఏర్పాటు చేసే హరిత ఇంధన ప్రాజెక్టులు, ఉత్పత్తి ఖర్చులు తగ్గించే ప్రాజెక్టులపై ఖర్చు చేయబోతున్నాయి. దీంతో కంపెనీల అప్పుల భారం సైతం స్థిరంగా ఉండి, వాటి లాభాలకూ పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చని క్రిసిల్ తెలిపింది.
కలిసొచ్చే అంశాలు
వచ్చే మూడేళ్లలో దేశీయ సిమెంట్ పరిశ్రమకు పలు సానుకూల అంశాలు కలిసి రానున్నాయి. మౌలిక సదుపాయాలు, గృహ నిర్మాణ రంగాలపై పెరుగుతున్న పెట్టుబడులు ఇందుకు ప్రధానంగా కలిసి రానున్నాయి. దీంతో అదానీల నిర్వహలోని అంబుజా సిమెంట్, ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన అల్టా్ట్రటెక్ సిమెంట్ కంపెనీలు పెద్ద ఎత్తున విస్తరణ చేపట్టాయి. ఇందుకోసం కొత్త ప్లాంట్ల ఏర్పాటు, సామర్ధ్య విస్తరణతో పాటు ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న చిన్న చిన్న సిమెంట్ కంపెనీలను కొనేస్తున్నాయి. దీంతో ఈ ఏడాది మార్చి నాటికి ఉన్న 66.8 కోట్ల టన్నుల స్థాపిత సిమెంట్ ఉత్పత్తి సామర్ధ్యంలో 85 శాతం 17 కంపెనీల చేతుల్లో కేంద్రీకృతమైంది. గత పదేళ్లుగా సిమెంట్ రంగంలో ఉత్పత్తి సామర్ధ్య వినియోగం సగటున 65ు మాత్రమే. అయితే పెరుగుతున్న డిమాండ్‌తో ఇది గత ఆర్థిక సంవత్సరం 70 శాతానికి చేరిందని క్రిసిల్ తెలిపింది.
ఇవీ చదవండి:
మీ చూపు శక్తివంతమైనదైతే.. ఈ ఫొటోలో తోడేలును 9 సెకెన్లలో కనిపెట్టండి..
మీ మిక్సీ జార్ తిరగడం లేదా.. ఈ సూపర్ ట్రిక్ ఉపయోగించి చూడండి..