Share News

Diamond Buying Guide: వజ్రాలు కొంటున్నారా.. ఈ విషయాల్లో జాగ్రత్త

ABN , Publish Date - Apr 28 , 2025 | 09:41 AM

వజ్రాలను తొలిసారి కొనుగోలు చేసే వారు కొన్ని విషయాలపై అవగాహన పెంచుకున్నాకే రంగంలోకి దిగాలి. మరి ఇవేంటో ఈ కథనంలో కూలంకషంగా తెలుసుకుందాం.

Diamond Buying Guide: వజ్రాలు కొంటున్నారా.. ఈ విషయాల్లో జాగ్రత్త
Diamond Buying Guide

ఇంటర్నెట్ డెస్క్: వజ్రాలు మొదటి సారి కొనే వారికి మనసులో అనేక సందేహాలు ఉంటాయి. వాటి క్వాలిటీ, సర్టిఫికేషన్ వంటి విషయాలపై పలు ప్రశ్నలు వస్తాయి. అయితే, వీటి గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. వెచ్చించిన డబ్బుకు తగిన వజ్రం దక్కుతుందని భరోసా ఇస్తున్నారు.

నిపుణులు చెప్పే దాని ప్రకారం, వజ్రాలు ధర ప్రధానంగా కట్, కలర్ (రంగు), క్లారిటీ, క్యారెట్‌పై ఆధారపడి ఉంటుంది. వజ్రాలు మిలమిలా మెరవాలంటే దాన్ని అత్యంత నైపుణ్యంతో కట్ చేయాల్సి ఉంటుంది. ఈ సానబెట్టడంలో ప్రామాణికత పాటించకపోతే వజ్రం డల్‌గా, మెరుపులు లేకుండా కనిపిస్తుంది. ధర కూడా తక్కువగానే ఉంటుంది. సాధారణంగా వజ్రంలో రంగులు తక్కువగా ఉంటే విలువ పెరుగుతుంది. వినడానికి కాస్త వింతగా ఉన్నా ఇది నిజం. ఇక వజ్రంలోపల ఉండే చిన్న చిన్న మలినాలు, మరకలు వజ్రం విలువను తగ్గిస్తాయి. వీటిని గుర్తించడం కూడా కొంచెం కష్టమే. నిపుణులు ప్రత్యేక పరికరాలతో వజ్రంలోని ఈ లోపాలను గుర్తించగలుగుతారు.


ఇక వజ్రం బరువును క్యారెట్లలో కొలుస్తారు. అయితే, ఒకే క్యారెట్ వెయిట్ ఉన్న రెండు వజ్రాలు వాటిని సాన బెట్టిన తీరునుబట్టి భిన్నమైన సైజుల్లో కనిపిస్తాయి. ఇందులో ఆందోళన చెందాల్సిందేమీ లేదని నిపుణులు భరోసా ఇస్తున్నారు. క్యారెట్‌ అంటే చాలా మంది వజ్రం సైజు మాత్రమే అని అనుకుంటూ ఉంటారని, కాని వజ్రాన్ని ఎలా సానబెట్టారన్న దానిపై కూడా ఇది ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఇక సహజసిద్ధంగా లభించే వజ్రాలకు, ల్యాబ్‌లో తయారు చేసే వజ్రాలకు వేటి ప్రత్యేకత వాటికి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సహజ వజ్రాలు భూగర్భంలో అత్యధిక పీడనం, ఉష్ణోగ్రతల మధ్య ఏర్పడతాయి. ల్యాబ్‌లో సరిగ్గా ఇవే పరిస్థితులను సృష్టించి వజ్రాలను తయారు చేస్తారు. నేరుగా చూస్తే ఈ రెండింటి మధ్య ఎటువంటి తేడా కనిపించదు. సాధారణ వజ్రాలతో పోలిస్తే 60 నుంచి 90 శాతం తక్కువ ధరకే లభిస్తాయి. ప్రజల్లో పర్యావరణంపై పెరుగుతున్న అవగాహన, నైతికత అంశాలు కారణంగా అనేక మంది ప్రస్తుతం ల్యాబ్‌లో తయారు చేసిన వజ్రాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక నాణ్యతాపరంగా ల్యాబ్‌లో తయారు చేసిన వజ్రాల మధ్య తేడాలు దాదాపుగా ఉండవు.


వజ్రాల నాణ్యతను సాధారణ వినియోగదారులు అంత సులువుగా అంచనా వేయలేరు. కాబట్టి పేరుపొందిన, విశ్వసనీయ జువెలర్స్ నుంచే వీటిని కొనుగోలు చేయాలని నిపుణులు చెబుతున్నారు. జెమలాజికల్ ల్యాబ్స్.. వజ్రాల నాణ్యతను ధ్రువీకరించే సర్టిఫికేట్లను జారీ చేస్తాయి. నిపుణులు ప్రత్యేక పరికరాలతో డైమండ్ నాణ్యతను ముదింపు వేసి ఈ ధ్రువపత్రాలను జారీ చేస్తారు. ఇవి ఉన్న వజ్రాలు కొంటే డబ్బు నష్టపోవడం అనేదే ఉండదు.

ఇవి కూడా చదవండి:

గోల్డ్ కాయిన్స్ కొనాలా లేదా బంగారు నగలు కొనాలా అని డౌటా? అయితే..

తక్కువ పెట్టుబడితో భారీ లాభాలిచ్చే బిజినెస్.. ఒక్కసారి ట్రై చేసి చూడండి..

జీవితంలో ఆర్థిక స్వాతంత్ర్యం సాధించేందుకు ఎంత డబ్బు కావాలి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 28 , 2025 | 09:49 AM