Banking Reforms: యూనియన్ బ్యాంక్‌తో బీఓఐ విలీనం!
ABN , Publish Date - Oct 30 , 2025 | 03:53 AM
ప్రభుత్వ బ్యాంకింగ్ రంగంలో మరో విడత విలీనాలకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. యూనియన్ బ్యాంక్...
ఇండియన్ బ్యాంక్‌తో ఐఓబీ మెర్జర్
బీఓఎం, పీ అండ్ ఎస్‌బీ ప్రైవేటీకరణ
ప్రభుత్వ బ్యాంకింగ్ రంగంలో మరో విడత సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు
న్యూఢిల్లీ: ప్రభుత్వ బ్యాంకింగ్ రంగంలో మరో విడత విలీనాలకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ)తో బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ)ను విలీనం చేసే ఆలోచనలో ఉన్నట్లు ఈ విషయంతో సంబంధం ఉన్న అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ విలీనం జరిగితే, భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) తర్వాత దేశంలో రెండో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ (పీఎ్‌సబీ)గా అవతరించనుంది. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంక్‌లన్నింటిలో నాలుగో అతిపెద్ద బ్యాంక్‌గా మారనుంది. ప్రస్తుతం పీఎ్‌సబీల్లో రెండో స్థానంలో ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) మొత్తం ఆస్తుల విలువ ఈ జూన్ 30నాటికి రూ.18.62 లక్షల కోట్లుగా ఉంది. యూబీఐ-బీఓఐ విలీనం ద్వారా ఏర్పడే బ్యాంక్ మొత్తం ఆస్తుల విలువ రూ.25.67 లక్షల కోట్లకు చేరనుంది.
దేశీయ బ్యాంకింగ్ రంగంలో ఎస్‌బీఐ, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్ తర్వాత మూడో స్థానం లో ఉన్న ఐసీఐసీఐ బ్యాంక్ ప్రస్తుత ఆస్తులు రూ.26.42 లక్షల కోట్లకు విలీన బ్యాంక్ ఆస్తుల విలువ చేరువ కానుంది.
చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ), ఇండియన్ బ్యాంక్‌లను సైతం ఒక్కటి చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు, మిగతా పీఎ్‌సబీలతో పోలిస్తే తక్కువ ఆస్తులు కలిగిన పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ (పీ అండ్ ఎస్‌బీ), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం)ను భవిష్యత్‌లో ప్రైవేటీకరించే ఆలోచన కూడా ఉన్నట్లు తెలిసింది.
డజను పీఎ్‌సబీలు
చివరిసారి 2020లో మోదీ ప్రభుత్వం పీఎస్‌బీల విలీనాలను చేపట్టింది. దీంతో పీఎస్‌బీల సంఖ్య 27 నుంచి 12కు తగ్గింది. ఈ మార్చి నాటికి ఈ డజను పీఎ్‌సబీల ఆస్తుల మొత్తం విలువ దాదాపు 1.95 లక్షల కోట్ల డాలర్లు. అంటే, మన కరెన్సీలో సుమారు రూ.171 లక్షల కోట్లు. దేశీయ బ్యాంకింగ్ రంగ మొత్తం ఆస్తుల్లో 55 శాతానికి సమానమిది.
వికసిత్ భారత్ లక్ష్యాల్లో భాగంగానే..
ఆస్తుల విలువపరంగా ప్రస్తుతం ఎస్‌బీఐ, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్ మాత్రమే ప్రపంచంలోని 100 అతిపెద్ద బ్యాంకుల జాబితాలో ఉన్నాయి. వీటి తరహాలో మరో 3-4 మెగా పీఎ్‌సబీలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఈసారి విలీనాలను చేపట్టనున్నట్లు సమాచారం. వికసిత్ భారత్ లక్ష్యాల సాధనకు దేశంలో మరిన్ని ప్రపంచ స్థాయి బ్యాంక్‌ల ఏర్పాటు అవసరమని మోదీ సర్కారు భావిస్తోంది. అంతేకాదు, మలి విడత సంస్కరణల్లో భాగంగా పీఎ్‌సబీల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని 49 శాతానికి పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. పీఎ్‌సబీల్లో విదేశీ పెట్టుబడుల ప్రస్తుత పరిమితి 20 శాతంగా ఉంది. ప్రైవేట్ రంగ బ్యాంక్‌ల్లో 74 శాతం వరకు విదేశీ పెట్టుబడులకు అనుమతి ఉంది.