Google Search Share: గూగుల్‌కు షాక్.. గత 10 ఏళ్లల్లో తొలిసారిగా 90 శాతం దిగువకు సెర్చ్ మార్కెట్ వాటా
ABN , Publish Date - Jul 24 , 2025 | 07:55 PM
సెర్చ్ ఇంజెన్ మార్కెట్‌లో గూగుల్ వాటా తొలిసారిగా 90 శాతం దిగువకు పడిపోయింది. గత పదేళ్లల్లో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఏఐ సాధనాల హవా పెరుగుతుండటం దీనికి సంకేతమని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: సెర్చ్ మార్కెట్‌పై గట్టి ఆధిపత్యం కలిగిన గూగుల్‌కు ఎదురుగాలులు వీస్తున్నాయి. గత పదేళ్లల్లో తొలిసారిగా సెర్చ్ మార్కెట్‌లో గూగుల్ వాటా 90 శాతం దిగువకు పడిపోయింది. ఈ రంగంలో ఏఐ సాధనాల నుంచి గూగుల్‌కు పోటీ పెరుగుతోందని అనడానికి ఇదో సంకేతమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం సమాచారం కోసం జనాలు ఏఐ సాధనాల వైపు మళ్లుతున్నారని నిపుణులు చెబుతున్నారు. గూగుల్ సెర్చ్ వాటాలో దాదాపు 20 శాతం ప్రస్తుతం ఓపెన్ ఏఐకి చెందిన చాట్‌జీపీటీ చేతిలో ఉందని చెబుతున్నారు. మైక్రోసాఫ్ట్‌కు చెందిన బింగ్ సెర్చ్ ఇంజెన్‌ను కూడా చాట్‌జీపీటీ మించిపోయినట్టు అంతర్జాతీయ మీడియాలో ఇటీవల పలు కథనాలు వెలువడ్డాయి.
చాట్‌జీపీటీపై ఆసక్తి ఇందుకే
గూగుల్ సెర్చ్ ఫలితాలతో పోలిస్తే చాట్‌జీపీటీ ఇచ్చే సమాచారం మరింత సంపూర్ణంగా, సమగ్రమంగా ఉంటోందని కొందరు నిపుణులు చెబుతున్నారు. యాడ్స్ బెడద తక్కువగా ఉండటంతో పాటు పర్యటన వంటివి కూడా షెడ్యూల్ చేసుకునే అవకాశం చాట్‌జీపీటీతో ఉంది. గూగుల్‌లో ప్రశ్నలను అడగడం కంటే చాట్‌జీపీతో మెరుగైన ఫలితాలు ఉంటున్నాయని చెబుతున్నారు.
మరోవైపు, ఇతర సంస్థల ఏఐ సాధనాలకు పోటీగా గూగుల్ తన సెర్చ్ ఇంజెన్‌కు ఇటీవల ఏఐ మోడ్‌ను కూడా జత చేసింది. ఇక రెండో త్రైమాసికంలో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫబెట్ 96.2 బిలియన్ డాలర్ల ఆదాయం సాధించింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 14 శాతం ఎక్కువ. ఇక ఒక్కో షేర్‌పై రాబడి కూడా 22 శాతం పెరిగింది. ఎనలిస్టుల అంచనాలకు మించిన ఫలితాలు సాధించింది. అయితే, పెట్టుబడిదారుల్లో మాత్రం ఆశించిన ఆసక్తి కనిపించలేదు. ఆదాయాల వివరాలు వెల్లడయ్యాక కూడా గూగుల్ షేర్లు 2 శాతానికి మించి లాభపడలేదు. ఈసారి క్యాపిటల్ వ్యయాల కోసం గూగుల్ ముందుగా అనుకున్న దానికంటే 10 బిలియన్ డాలర్లు అదనంగా ఖర్చుచేయడం కారణమని కొందరు మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇవీ చదవండి:
సంపన్నులు తమ ఆస్తులను ఎలా పెంచుకుంటారో తెలుసా.. సీఏ చెప్పిన ఈ సూత్రం తెలిస్తే..
వేతన జీవులకు అక్కరకొచ్చే 50-30-20 ఫార్ములా