Gensol: జెన్సోల్ కంపెనీ వ్యవహారాలపై ప్రభుత్వ దర్యాప్తు..
ABN , Publish Date - Apr 20 , 2025 | 03:32 PM
క్రికెటర్ ధోని, హీరోయిన్ దీపికా పదుకొనె పెట్టుబడులు పెట్టిన జెన్సోల్ (బ్లూస్మార్ట్) అనే సంస్థపై తాజాగా భారత సర్కారు ఎంక్వైరీ ప్రారంభించింది. సెబీ ఇచ్చిన రిపోర్టులను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.

Gensol: భారత స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనెతోపాటు మరికొందరు వ్యాపార ప్రముఖులు పెట్టుబడులు పెట్టిన జెన్సోల్ (బ్లూస్మార్ట్) అనే సంస్థపై తాజాగా భారత సర్కారు ఎంక్వైరీ ప్రారంభించింది. తీవ్రమైన ఆర్థిక దుష్ప్రవర్తన, నియంత్రణ ఉల్లంఘనల ఆరోపణల నేపథ్యంలో కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MCA) జెన్సోల్ ఎలక్ట్రిక్‌పై సుమోటోగా విచారణను ప్రారంభించింది. వీటిలో రూ.975 కోట్ల రుణాల దుర్వినియోగం కూడా ఉంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) జెన్సోల్ ప్రమోటర్లపై మధ్యంతర ఉత్తర్వు జారీ చేసిన తర్వాత కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. సెబీ దాఖలు చేసిన ఆర్థిక రికార్డులను పరిశీలించడం ప్రారంభించిందని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. అయితే, స్వతంత్రంగా చేపట్టిన ఈ విచారణకు ఎలాంటి కాల పరిమితి లేదు. దర్యాప్తులో బయటకొచ్చే లోపాల ప్రాతిపదికగా చర్యలు ఉండే అవకాశం ఉంది.
కాగా, క్రికెట్ స్టార్ ధోని ఈ కంపెనీలో దాదాపు 4 వందల కోట్లు అదీ ఈ ఏడాది మొదట్లోనే కంపెనీ (లోపాలు బయటపడకుండా ఉన్నప్పుడు) ఉచ్చదశలో ఉన్న తరుణంలో పెట్టుబడులు పెట్టగా, దీపికా పదుకునే కంపెనీ ప్రారంభించిన (2017) తర్వాత ఏడాదిలోనే కంపెనీ షేర్లు కొన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ కంపెనీ పుట్టుక విషయానికొస్తే, దేశంలో లీడింగ్ క్యాబ్ సర్వీస్ ప్రొవైడర్స్ అయిన ఉబర్, ఓలా సంస్థలకు సవాలుగా 2018 లో బెంగళూరు కేంద్రంగా ఏర్పాటైంది బ్లూస్మార్ట్ అనే కంపెనీ. ఈవీ(ఎలక్ట్రిక్ వెహికల్స్) కార్లను ఈ సంస్థ క్యాబ్ సర్వీసులకు వాడుతుంది. ఈ సంస్థ కో ఫౌండర్ ఎవరంటే జెన్సోల్ ఇంజనీరింగ్ వ్యవస్థాపకుడు అన్మోల్ జగ్గీ. ఈ సంస్థ బ్లూస్మార్ట్ వెహికల్స్ కొనుగోలు కోసం పెట్టుబడిదారుల నుండి రూ.4,100 కోట్లకు పైగా సేకరించింది. ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టిన ప్రముఖ పెట్టుబడిదారుల జాబితాలో మహేంద్ర సింగ్ ధోని, దీపికా పదుకొనే, సంజీవ్ బజాజ్ ఇంకా అష్నీర్ గ్రోవర్ తదితరులున్నారు.
బాలీవుడ్ నటి దీపికా పదుకొనే ఈ సంస్థ తొలి పెట్టుబడిదారులలో ఒకరు. 2019లో $3 మిలియన్లు పెట్టుబడి పెట్టడానికి ఏంజెల్ ఫండింగ్ రౌండ్‌లో దీపిక కుటుంబ కార్యాలయం పాల్గొంది. 2019లో అదే రౌండ్‌లో, బజాజ్ క్యాపిటల్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ బజాజ్, JITO ఏంజెల్ నెట్‌వాక్, రజత్ గుప్తాతో కలిసి $3 మిలియన్ల పెట్టుబడితో స్టార్టప్‌కు మద్దతు ఇచ్చారు. ఇక, గతేడాది కంపెనీ ప్రీ-సిరీస్ B ఫండింగ్‌లో $24 మిలియన్లను సేకరించింది. ఇందులో క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని కుటుంబ కార్యాలయం పెట్టుబడులు పెట్టింది. అటు, భారత్‌పే సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ కూడా పెట్టుబడులు పెట్టిన వారిలో ఉన్నారు.
ఇలా ఉంటే, తాజాగా ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. "బ్లూస్మార్ట్ యాప్‌లో బుకింగ్‌లను తాత్కాలికంగా మూసివేయాలని మేము నిర్ణయించుకున్నాము" అని బ్లూస్మార్ట్ కంపెనీ ఏప్రిల్ 17న కస్టమర్లకు పంపిన ఇమెయిల్‌లో తెలిపింది. అయితే, ఈ మెయిల్.. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) రెండు రోజుల ముందు చేసిన ఒక కీలక ప్రకటన తర్వాత వచ్చింది. ఇంతకీ సెబీ చేసిన ఆ కీలక ప్రకటన ఏంటంటే.. బ్లూస్మార్ట్ స్టార్టప్ ప్రమోటర్లైన జెన్సోల్ ఇంజనీరింగ్ అధిపతులు అన్మోల్, పునీత్ సింగ్ జగ్గీ బ్లూస్మార్ట్ కోసం కార్లు కొనడానికి ఉద్దేశించిన రుణాలను గురుగ్రామ్‌లోని DLF యొక్క ది కామెలియాస్‌లోని లగ్జరీ అపార్ట్‌మెంట్ కోసం, ఇంకా రూ. 26 లక్షల విలువైన హై-ఎండ్ గోల్ఫ్ పరికరాలు కొనుక్కొనేందకు మళ్లించారని కనుగొన్నట్లు చెప్పింది. అంతేకాదు, మధ్యంతర ఉత్తర్వులో, జగ్గీ సోదరులు సంస్థలో డైరెక్టర్ పదవులను నిర్వహించకుండా ఇంకా మార్కెట్‌లోకి ప్రవేశించకుండా సెబీ నిషేధించింది. అంతే.. ఒక్కసారిగా జెన్సోల్ కథ అడ్డం తిరిగింది. ఇప్పుడు కార్పొరేట్ అఫైర్స్ కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది.
కాగా జెన్సోల్ ఇంజనీరింగ్ సంస్థ ఐఆర్‌ఈడీఏ(IREDA), పీఎఫ్‌సీ(PFC) నుంచి మొత్తంగా రూ.977.75 కోట్ల మేర రుణం తీసుకుంది. ఇందులో రూ.663.89 కోట్లను ప్రత్యేకంగా 6,400 విద్యుత్తు వాహనాల కొనుగోలుకు కంపెనీ వెచ్చించాలి. కొన్నవాటిని బ్లూస్మార్ట్‌కు లీజ్‌కు ఇవ్వాలి. అయితే, ఇప్పటివరకు 4,704 ఈవీలను రూ.567.74 కోట్లతో కొనుగోలు చేశామని ఫిబ్రవరిలో సెబీకి జెన్సోల్ చెప్పింది. జెన్సోల్‌కు ఆ వాహనాలు సరఫరా చేసినట్లు కూడా గో-ఆటో ప్రైవేట్ లిమిటెడ్ ధ్రువీకరించింది. ఇందులో జెన్సోల్ కంపెనీ తన వాటా కింద మరో 20% చెల్లించాలి కనుక, రుణాలతో కలిపి ఈవీల కొనుగోలుకు కేటాయించాల్సిన మొత్తం రూ.829.86 కోట్లు అయింది. ఇందులో 4,704 ఈవీ వాహనాలకు వెచ్చించిన రూ.567.74 కోట్లు తీసివేస్తే, మిగిలిన రూ.262.13 కోట్లకు లెక్క తేలలేదు.
దీంతో రూ.262.13 కోట్ల రూపాయల నిధులు ఏమయ్యాయో తెలుసుకునేందుకు జెన్సోల్, గో-ఆటోల బ్యాంకు స్టేట్‌మెంట్‌లను సెబీ విశ్లేషించింది. పలు సందర్భాల్లో ఈవీ కొనుగోళ్ల కోసం గో-ఆటోకు బదిలీ చేసిన నిధులు తిరిగి ప్రత్యక్షంగా, పరోక్షంగా జెన్సోల్, అన్‌మోల్,పునీత్ ఖాతాల్లోకి వచ్చినట్లు సెబీ గుర్తించింది. ఇందులో కొంత మొత్తాన్ని ఇతర అవసరాల కోసం వినియోగించారు. కొంతమొత్తం తమ విలాసవంత అపార్ట్‌మెంట్ల కొనుగోలుకు, బంధువులకు డబ్బుల బదిలీ, తమ సొంత సంస్థల్లో పెట్టుబడులు, చివరికి క్రెడిట్ కార్డుల చెల్లింపుల కోసమూ కంపెనీ నిధులు వాడుకున్నారని సెబీ నిర్ధారించింది.
అంతే, మార్కెట్ ఓపెన్ కాగానే కేవలం రెండు రోజుల్లో ఆ సంస్థ షేర్లు ఫ్రీ ఫాల్ అయిపోయాయి. లోయర్ సర్యూట్స్ తాకుతూ నేలను చూస్తున్నాయి. నిధుల మళ్లింపు కేసులో కంపెనీ, ప్రమోటర్లు అన్మోల్, పునీత్ సింగ్ జగ్గీలపై సెబీ నిషేధం విధించడంతో జెన్సోల్ ఇంజినీరింగ్ షేర్లలో పతనం ఇంకా కొనసాగుతోంది. వరుసగా రెండోరోజూ ఆ కంపెనీ షేర్లు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. గురువారం కంపెనీ షేర్లు 5 శాతం క్షీణించి 116.54 వద్ద కనిష్ఠాన్ని తాకాయి. ఆల్‌టైమ్ గరిష్ఠాల నుంచి కంపెనీ షేర్లు దాదాపు 90 శాతం మేర పతనమయ్యాయి. గతంలో ఈ కంపెనీ షేర్లు గరిష్ఠంగా రూ.1,124.90 వద్ద ట్రేడయ్యాయి. సంస్థపై గత కొన్ని రోజులుగా వస్తున్న అభియోగాల నేపథ్యంలో ఈ ఒక్క క్యాలెండర్ ఇయర్ లోనే 84 శాతం మేర పతనమైంది.
ఇవి కూడా చదవండి:
UPSC Recruitment: రూ.25తో ప్రభుత్వ ఉద్యోగానికి గ్రీన్‌సిగ్నల్.. 45 ఏళ్ల వారికీ కూడా ఛాన్స్
Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..
Bill Gates: వారానికి మూడు రోజేలే పని..బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
iPhone like Design: రూ.6 వేలకే ఐఫోన్ లాంటి స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు తెలిస్తే షాక్ అవుతారు..
Read More Business News and Latest Telugu News