Myntra: మింత్రాపై ఫెమా కేసు నమోదు చేసిన ఈడీ
ABN , Publish Date - Jul 24 , 2025 | 04:11 AM
ఫ్లిప్‌కార్ట్ అనుబంధ సంస్థ మింత్రాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది.

న్యూఢిల్లీ: ఫ్లిప్‌కార్ట్ అనుబంధ సంస్థ మింత్రాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది. ఈ సంస్థ విదేశీమారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనలకు విరుద్ధంగా విదేశాల నుంచి రూ.1,654 కోట్లకు పైగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సమీకరించిందని అభియోగం మోపింది. విశ్వసనీయ సమాచారం ఆధారంగా మింత్రాపై ఈ కేసు నమోదు చేసినట్టు ఈడీ తెలిపింది. హోల్‌సేల్ కాష్ అండ్ కారీ’ ముసుగులో మింత్రా, దాని అనుబంధ సంస్థలు మల్టీ బ్రాండ్ రిటైల్ వ్యాపారం చేస్తున్నాయని ఆరోపించింది.
ఇలా చేయడం ఎఫ్‌డీఐ నిబంధనలతో పాటు,ఫెమా నిబంధనలకూ వ్యతిరేకమని తెలిపింది. ఎఫ్‌డీఐ, ఫెమా నిబంధనలను తుంగలో తొక్కేందుకు మింత్రా తన వస్తువుల్లో ఎక్కువ భాగాన్ని, తనకే చెందిన విక్టర్ ఇ-కామర్స్ అనే కంపెనీకి విక్రయించి, దాని ద్వారా రిటై ల్ అమ్మకాలు జరుపుతోందని అభియోగ పత్రంలో ఈడీ పేర్కొంది. ఈ కేసు దర్యాప్తులో ఈడీకి పూర్తిగా సహకరిస్తామని మింత్రా ఒక ప్రకటనలో తెలిపింది.