Dr Reddys Laboratories: డాక్టర్ రెడ్డీస్ లాభం రూ.1,437 కోట్లు
ABN , Publish Date - Oct 25 , 2025 | 04:45 AM
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్.. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. జూలై-సెప్టెంబరు త్రైమాసికానికి గాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర...
ఆదాయంలో 10 శాతం వృద్ధి
రూ.2,750 కోట్ల మిగులు నిధులు
కొనుగోళ్లు, లైసెన్సింగ్ ఒప్పందాలపై దృష్టి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్.. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. జూలై-సెప్టెంబరు త్రైమాసికానికి గాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 14.5 శాతం వృద్ధి చెంది రూ.1,437 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.1,255 కోట్లుగా ఉంది. సమీక్షా త్రైమాసికంలో మొత్తం రెవెన్యూ కూడా 9.8 శాతం వృద్ధితో రూ.8,016 కోట్ల నుంచి రూ.8,805 కోట్లకు చేరుకుంది. సెప్టెంబరు త్రైమాసికంలో బ్రాండెడ్ మార్కెట్లలో పనితీరు మెరుగ్గా ఉండటంతో పాటు నికోటిన్ రీప్లే్‌సమెంట్ థెరపీ (ఎన్‌ఆర్‌టీ) విభాగం నిలకడగా కొనసాగటం కలిసి వచ్చిందని డాక్టర్ రెడ్డీస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎ్‌ఫఓ) ఎంవీ నరసింహం అన్నారు.
అమెరికా ఆదాయాల్లో 13ు క్షీణత: సెప్టెంబరు త్రైమాసికంలో అమెరికా మార్కెట్ నుంచి ఆదాయాలు 13 శాతం తగ్గినట్లు డాక్టర్ రెడ్డీస్ వెల్లడించింది. ఈ కాలంలో అమెరికా ఆదాయాలు రూ.3,728 కోట్ల నుంచి రూ.3,241 కోట్లకు తగ్గినట్లు పేర్కొంది. లెనాలీడొమైడ్ సహా కొన్ని కీలక ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గటమే ఇందుకు కారణమని తెలిపింది. అయితే కొత్త ఉత్పత్తుల విడుదల పెరగటం, విదేశీ మారక ఆదాయం సానుకూలంగా ఉండటం కొంత కలిసివచ్చిందని పేర్కొంది.
యూరప్, భారత్ ఆదాయాల్లో వృద్ధి: ఎన్‌ఆర్‌టీ పోర్టుఫోలియో కొనుగోలుతో యూరప్ మార్కెట్ల నుంచి ఆదాయాలు ఏకంగా 138 శాతం వృద్ధితో రూ.577 కోట్ల నుంచి రూ.1,376 కోట్లకు చేరుకున్నట్లు సీఎ్‌పఓ నరసింహం తెలిపారు. భారత మార్కెట్ ఆదాయాలు కూడా 13 శాతం వృద్ధితో రూ.1,397 కోట్ల నుంచి రూ.1,578 కోట్లకు పెరిగినట్లు పేర్కొన్నారు. వర్ధమాన మార్కెట్ల ఆదాయాలు కూడా రూ.1,455 కోట్ల నుంచి రూ.1,654 కోట్లకు పెరిగాయి. కాగా కంపెనీ వద్ద రూ.2,750 కోట్ల మిగులు నిధులు ఉన్నాయని పేర్కొంది. అలాగే కొనుగోళ్లు, లైసెన్సింగ్ ఒప్పందాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నట్లు తెలిపింది.
సుంకాల ప్రభావం లేదు
ఫార్మాపై అమెరికా సుంకాల ప్రభావం ప్రస్తుతానికైతే ఏమాత్రం లేదని సీఈఓ ఎరెజ్ ఇజ్రాయెలీ అన్నారు. అంతేకాకుండా సుంకాలకు సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు కూడా అందుకోలేదని ఆయన పేర్కొన్నారు. అయితే బయోలాజిక్స్‌పై ఈ ప్రభా వం ఎంత ఉంటుందనే విషయాన్ని మాత్రం పరిశీలించాల్సి ఉంటుందని ఇజ్రాయెలీ తెలిపారు. కాగా వచ్చే ఏడాది పేటెంట్ గడువు తీరనున్న మధుమేహం, ఊబకాయం చికిత్స లో వినియోగించే సెమాగ్లూటైడ్ ఔషధాన్ని భారత్ సహా పలు మార్కెట్లలోకి విడుదల చేయనున్నట్లు ఆయన చెప్పారు.