iPhone Assembly In India: ఐఫోన్ అసెంబ్లింగ్ కార్యకలాపాలనంతా భారత్‌కు మళ్లించే యోచనలో యాపిల్
ABN , Publish Date - Apr 25 , 2025 | 01:51 PM
2026 కల్లా ఐఫోన్ అసెంబ్లింగ్ కార్యకలాపాలన్నీ భారత్‌కు మళ్లించాలనే యోచనలో యాపిల్ ఉన్నట్టు తెలుస్తోంది. చైనాపై అమెరికా సుంకాల నేపథ్యంలో సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

ఇంటర్నెట్ డెస్క్: చైనాపై అమెరికా విధిస్తున్న సుంకాలు భారత్‌కు ఆయాచిత వరంగా మారాయి. ఇప్పటివరకూ చైనా కేంద్రంగా తమ తయారీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ బ్రాండ్స్ అన్నీ భారత్‌పై దృష్టి మళ్లిస్తున్నాయి. చైనాపై అమెరికా 145 శాతం సుంకం విధిస్తున్న నేపథ్యంలో ఐఫోన్ల తయారీదారు యాపిల్ ఆలోచనలో పడింది. చైనా నుంచి దిగుమతి చేసుకునే ఐఫోన్ల ఖరీదు అమెరికాలో భారీగా పెరగనుండటంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. భారత్‌పై అమెరికా సుంకం కేవలం 26 శాతంగా ఉండటంతో ఇక్కడ ఐఫోన్ అసెంబ్లింగ్ కార్యకలాపాలను విస్తరించేందుకు రంగంలోకి దిగింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారి సుంకాలు విధించిన వెంటనే యాపిల్ జాగ్రత్త పడింది. హుటాహుటిన భారత్ నుంచి నాలుగు విమానాల్లో భారీగా ఐఫోన్లను అమెరికాకు తెప్పించుకుంది. ఆ తరువాత సుంకాలకు అమెరికా తాత్కాలిక విరామం ప్రకటించినా చైనాపై ట్రంప్ ఆగ్రహం తగ్గలేదు. ఇందుకు ప్రతిగా చైనా కూడా అమెరికా దిగుమతులపై 125 శాతం సుంకం విధించింది. ఇరు దేశాల మధ్య మొదలైన ఈ వాణిజ్య యుద్ధం సుదీర్ఘకాలం పాటు సాగే అవకాశం ఉన్న నేపథ్యంలో అనేక అంతర్జాతీయ బ్రాండ్స్ భారత్ వైపు మళ్లుతున్నాయి.
ఈ నేపథ్యంలో యాపిల్.. భారత్‌లో ఐఫోన్ అసెంబ్లింగ్ కార్యకలాపాలను విస్తరిస్తోంది. భారత్‌లో ఫాక్స్‌కాన్, టాటా ఎలక్ట్రానిక్స్‌తో ఇప్పటికే పలు ఒప్పందాలు కుదుర్చుకుంది. వీటిని మరింత విస్తరించేందుకు నడుం కట్టింది. అమెరికాలో ఏటా విక్రయించే 60 మిలియన్ ఐఫోన్లను భారత్ నుంచే దిగుమతి చేసుకోవాలనే లక్ష్యంతో యాపిల్ ఉన్నట్టు తెలుస్తోంది. 2026 కల్లా పూర్తిస్థాయిలో దిగుమతులు ప్రారంభించేందుకు సంస్థ యోచిస్తున్నట్టు సమాచారం.
ప్రస్తుతం భారత్‌లో ఐఫోన్లకు సంబంధించి యాపిల్‌కు అతిపెద్ద మాన్యుఫాక్చరింగ్ పార్టనర్ ఫాక్స్‌కాన్. మార్చిలో ఫాక్స్‌కాన్ ఏకంగా 1.31 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లను అమెరికాకు ఎగుమతి చేసింది. టాటా ఎలక్ట్రానిక్స్ నుంచి ఐఫోన్ ఎగుమతుల్లో కూడా 63 శాతం మేర వృద్ధి నమోదైంది. ఐఫోన్ తయారీలో అసెంబ్లింగ్ చివరి దశ అన్న విషయం తెలిసిందే. ఈ దశలో ఐఫోన్‌ను సంబంధించిన వివిధ విడి భాగాలను ఓచోట పేర్చి ఐఫోన్ రూపొందిస్తారు. అయితే, ఈ విడిభాగాల తయారీ కోసం యాపిల్ చైనాపై అత్యధికంగా ఆధారపడుతోంది.
ఇవి కూడా చదవండి:
బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధర
ఏడు రోజుల బుల్ ర్యాలీకి బ్రేక్.. నష్టాల్లో ముగిసిన భారత మార్కెట్లు
మరిన్ని వాణిజ్య వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి