Apple India Investment: ఐఫోన్‌ల తయారీ.. భారత్‌లో తైవాన్ సంస్థ 1.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
ABN , Publish Date - May 20 , 2025 | 08:50 AM
భారత్‌లో ఐఫోన్ తయారీని విస్తరించేందుకు తైవాన్‌కు చెందిన హాన్ హోయ్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో 1.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించింది.

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో ఐఫోన్ తయారీ కార్యకలాపాలను విస్తరించేందుకు తైవాన్‌కు చెందిన హాన్ హోయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీ సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు భారత్‌లోని యూనిట్‌ను విస్తరించేందుకు 1.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించింది. ఎక్సేంజ్‌కు సమర్పించిన సమాచారంలో కంపెనీ ఈ విషయాలను వెల్లడించింది. సింగపూర్‌లోని తన అనుబంధ సంస్థ ద్వారా హాన్ హోయ్ భారత్‌లో ఈ పెట్టుబుడులు పెట్టినట్టు తెలుస్తోంది.
ఐఫోన్ తయారీ కార్యక్రమాలను చైనా నుంచి ఇతర దేశాలకు మళ్లించాలని యాపిల్ సంస్థ నిర్ణయించిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఈ వార్తలపై సంస్థ ఇంకా స్పందించాల్సి ఉంది. హాన్ హోయ్ సంస్థకు దక్షిణాదిలో ఓ ఐఫోన్ తయారీ యూనిట్ ఉంది. ప్రస్తుతం యాపిల్‌కు హాన్ హోయ్ సంస్థ ప్రధాన ఐఫోన్ తయారీదారుగా ఉన్న విషయం తెలిసిందే.
అమెరికాలో విక్రయించే ఐఫోన్‌లను భారత్‌లో తయారు చేయాలని యాపిల్ సంస్థ ఇటీవల నిర్ణయించింది. ఈ నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని తాను యాపిల్ సంస్థ సీఈఓ టిమ్ కుక్‌ను కోరినట్టు కూడా తెలిపారు.
ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో సుంకాల బెడద, భౌగోళిక రాజకీయ ప్రభావం నుంచి తప్పించుకునేందుకు అనేక సంస్థలు త్వరగా భారత్‌లో కార్యకలాపాలు విస్తరించే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యాపిల్ తన ఐఫోన్‌లను చైనాలో ఉత్పత్తి చేస్తుంటుంది. అమెరికాలో యాపిల్‌కు ఐఫోన్ తయారీ యూనిట్స్ లేవు. అయితే, అమెరికాలో మరిన్ని నియామకాలు చేపడతామని, రాబోయే 4 ఏళ్లల్లో స్థానికంగా 500 బిలియన్ డాలర్లు వెచ్చిస్తామని సంస్థ ప్రకటించింది. ఇక సుంకాల వడ్డన నుంచి తప్పించుకునేందుకు తైవాన్ సంస్థ హాన్ హోయ్ కూడా అమెరికాలో పెట్టుబడులను పెంచనుంది.
మార్చితో ముగిసిన ఏడాదిలో యాపిల్ భారత్‌లో 22 బిలియన్ డాలర్ల ఐఫోన్‌లను తయారు చేసింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 60 శాతం ఎక్కువ.
ఇవి కూడా చదవండి:
ట్రంప్ ఎఫెక్ట్.. పాత ఐఫోన్‌లను రిపేర్ చేసుకుంటున్న అమెరికన్లు
ఆ పొరపాట్లే కారణం.. బైజూస్ పతనంపై సంస్థ సీఈఓ కీలక వ్యాఖ్యలు
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి