AI Bubble: పర్‌ప్లెక్సిటీ ఏఐ సంస్థ విఫలమయ్యే ఛాన్స్ అత్యధికం.. లైవ్ పోల్‌లో జనాభిప్రాయం
ABN , Publish Date - Nov 17 , 2025 | 11:10 PM
ఏఐ రంగంలోకి వచ్చిపడుతున్న పెట్టుబడులపై ఇప్పటికే అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆశించిన మేర రాబడులు లేక ఈ ఆశల బుడగ బద్దలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే జరిగితే మొదటగా పర్‌ప్లెక్సిటీ సంస్థ విఫలమయ్యే అవకాశం ఉందని ఇటీవల జరిగిన ఓ పోల్‌లో ఇన్వెస్టర్లు అభిప్రాయపడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం టెక్ రంగంలో ఏఐ సంస్థల పేర్లు మారుమోగిపోతున్నాయి. ఓపెన్ ఏఐ, పర్‌ప్లేక్సిటీ ఏఐ సంస్థలు దూకుడుగా ముందుకెళుతున్నాయి. మరోవైపు, ఏఐతో ఆశించిన లాభాలు రాక చివరకు ఇన్వెస్టర్ల కలలు కల్లలయ్యే అవకాశం ఉందన్న భయాలు కూడా ఉన్నాయి. ఏఐ బుడగ బద్దలయ్యే రోజు దగ్గర్లోనే ఉందని కొందరు విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. డాట్ కామ్ సంక్షోభం నాటి రోజులు మళ్లీ వస్తాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో సెరిబ్రల్ వ్యాలీ ఏఐ కాన్ఫరెన్స్‌లో నిర్వహించిన ఓ లైవ్ పోల్‌లో ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి (AI Bubble - Perplexity AI).
ఈ పోలింగ్‌లో సుమారు 300 మంది స్టార్టప్ సంస్థల వ్యవస్థాపకులు, పరిశోధకులు, ఇన్వెస్టర్లు పాల్గొన్నారు. ఏఐ బుడగ బద్దలైన పక్షంలో మొదటగా పర్‌ప్లెక్సిటీ సంస్థే విఫలమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని పోల్‌లో పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు. ఆ తరువాతి స్థానంలో చాట్‌జీపీటీ రూపకర్త ఓపెన్ ఏఐ ఉందని తేల్చారు. కంపెనీ మార్కెట్ విలువ అంచనాలు అసాధారణంగా పెరగడం, మౌలిక బలాల కంటే మితిమీరిన ఆశల నేపథ్యంలో నిధుల సేకరణ జరగడం వంటివి ప్రధాన కారణాలని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఏఐ రంగంలో భారీగా పెట్టుబడులు వచ్చి పడుతున్నా ఇది ఎంతో కాలం సాగదని కూడా కాన్ఫరెన్స్‌లోని కొందరు ఇన్వెస్టర్లు అభిప్రాయపడ్డారు. ఈ కామెంట్స్‌పై పర్‌ప్లెక్సిటీ ప్రతినిధి ఒకరు సెటైర్ పేల్చారు. ఆ కాన్ఫరెన్స్‌కు వచ్చిన వారు తొందరపాటుతో అభిప్రాయాలు ఏర్పాటు చేసుకుంటారని కామెంట్ చేశారు. ఏఐ బుడగ బద్దలవ్వొచ్చని కొందరు అంటుంటే ఈ రంగం అభివృద్ధిలో ఇదో అనివార్య దశ అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. సెర్చ్ రంగంలో గూగుల్‌కు గట్టిపోటీని ఇస్తామని పర్‌ప్లెక్సిటీ చెబుతున్న విషయం తెలిసిందే. ఈ దిశగా ఏఐ ఆధారిత కామెట్ బ్రౌజర్‌ను కూడా సంస్థ ఇటీవల లాంఛ్ చేసింది.
ఇవి కూడా చదవండి:
అమెరికాలో నిపుణులైన వర్కర్ల కొరత ఉంది.. ఫోర్డ్ సీఈఓ ఆందోళన
అమెరికాలో భారీ స్థాయిలో ఉద్యోగాల్లో కోతలు.. సంచలన నివేదికలో వెల్లడి
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి