NPCI: డిజిటల్ చెల్లింపులు ఇకపై సూపర్‌సేఫ్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టే చిట్కాలు!
ABN , Publish Date - Jul 15 , 2025 | 03:33 AM
డిజిటల్ పేమెంట్లు దేశవ్యాప్తంగా కోట్లాది మందికి లావాదేవీలను వేగంగా, సులభంగా మర్చాయి. ఈ వాడకం పెరుగుతున్నకొద్దీ, డిజిటల్ చెల్లింపుల భద్రతపై వినియోగదారుల్లో అవగాహన పెరగడం చాలా అవసరం.

ముంబై: డిజిటల్ పేమెంట్లు దేశవ్యాప్తంగా కోట్లాది మందికి లావాదేవీలను వేగంగా, సులభంగా మర్చాయి. ఈ వాడకం పెరుగుతున్నకొద్దీ, డిజిటల్ చెల్లింపుల భద్రతపై వినియోగదారుల్లో అవగాహన పెరగడం చాలా అవసరం. భద్రమైన చెల్లింపు విధానాలను పాటించడం సులువే. ఇవి మీకు డిజిటల్ అనుభవాన్ని దీర్ఘకాలంలో సురక్షితంగా ఉంచుతాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) డిజిటల్ పేమెంట్లను సురక్షితంగా జరపడానికి 5 కీలక సలహాలు ఇస్తోంది.
మీ డిజిటల్ లావాదేవీలకు 5 సూత్రాలు...
చెల్లించే ముందు ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయండి:
ఏదైనా పేమెంట్ చేసేటప్పుడు స్క్రీన్‌పై కనిపించే పేరును తప్పకుండా సరిచూడండి. మీరు ఎవరికి డబ్బు పంపిస్తున్నారో, ఆ వ్యక్తే స్క్రీన్‌పై ఉన్నారో లేదో నిర్ధారించుకోండి. చెల్లింపును నిర్ధారించడానికి కొన్ని క్షణాల సమయం తీసుకుంటే పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడవచ్చు.
నమ్మకమైన యాప్‌లు, వెబ్‌సైట్లను మాత్రమే వాడండి:
ఎప్పుడూ అధికారికమైన, పేరున్న యాప్‌లు లేదా వెబ్‌సైట్‌ల ద్వారా మాత్రమే చెల్లింపులు చేయండి. మీకు తెలియని వారు, నమ్మకం లేని వారు పంపే లింక్‌ల ద్వారా యాప్‌లను డౌన్‌లోడ్ చేయకండి. అలాంటి లింక్‌లను అస్సలు నొక్కకండి.
పిన్ లేదా ఓటీపీని ఎవరికీ చెప్పకండి:
మీ యూపీఐ పిన్, ఓటీపీ (వన్ టైమ్ పాస్‌వర్డ్) లేదా బ్యాంక్ వివరాలు అత్యంత వ్యక్తిగతమైనవి, రహస్యమైనవి. మేము బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాం, లేదా పోలీసులం, లేదా ప్రభుత్వ కార్యాలయానికి చెందినవారం అని ఎవరైనా చెప్పినా సరే, ఈ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు.
తొందరపడి పేమెంట్ చేయొద్దు:
వెంటనే పేమెంట్ చేయాలని లేదా మీ వివరాలను అత్యవసరంగా ఇవ్వాలని ఎవరైనా మిమ్మల్ని తొందరపెడితే, కంగారుపడకండి. కాస్త సమయం తీసుకోండి. ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండి. అవసరమైతే, వారికి తిరిగి కాల్ చేస్తానని చెప్పండి. మీకు కావాల్సినంత సమయం తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు.
పేమెంట్ అలర్ట్‌లను ఆన్ చేసుకోండి, తరచుగా పరిశీలించండి:
మీరు చేసే చెల్లింపులకు సంబంధించిన ఎస్ఎంఎస్, యాప్ నోటిఫికేషన్‌లను ఎప్పుడూ ఆన్ చేసి ఉంచండి. ప్రతి అలర్ట్‌ను జాగ్రత్తగా చదవండి. ఏదైనా తేడాగా అనిపిస్తే, వెంటనే మీ బ్యాంక్ లేదా పేమెంట్ యాప్‌ను సంప్రదించండి. ఈ అలవాట్లను పెంపొందించుకోవడం ద్వారా మీరు మీ డిజిటల్ భద్రతను మీరే చూసుకోగలరు. అవగాహన, బాధ్యతాయుతమైన వినియోగం పెరిగే కొద్దీ రోజువారీ డిజిటల్ చెల్లింపులు సురక్షితంగా మారుతాయి. మీకు అనుమానాస్పద నంబర్లు కనిపిస్తే వెంటనే నేషనల్ సైబర్‌క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు డయల్ చేయండి లేదా టెలికమ్యూనికేషన్స్ విభాగానికి (https://sancharsaathi.gov.in/sfc/) ఫిర్యాదు చేయవచ్చు. మీరు ఫిర్యాదు చేయాల్సి వస్తే, దర్యాప్తుకు సహాయపడటానికి మెసేజ్‌లను, స్క్రీన్‌షాట్‌లను, సంభాషణలను నమోదు చేసి పెట్టుకోండి.
ఎన్‌ఎస్‌ఈలో విద్యుత్ ఫ్యూచర్స్ ప్రారంభం: దేశ ఇంధన మార్కెట్లో కొత్త శకం!
ముంబై: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌ఈ) భారత విద్యుత్ డెరివేటివ్స్ మార్కెట్‌ను పెంపొందించడంలో కీలక అడుగు వేసింది. సోమవారం విజయవంతంగా నెలవారీ విద్యుత్ ఫ్యూచర్స్ (ELECMBL) కాంట్రాక్టులను ప్రారంభించినట్లు ఎన్‌ఎస్‌ఈ ప్రకటించింది. ఇది దేశ ఇంధన మార్కెట్‌లో ఒక సరికొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది.