Minister Atchannaidu: తోతాపురి రైతులను ఆదుకున్నది మేమే
ABN , Publish Date - Jul 05 , 2025 | 05:06 AM
చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడి రైతులను ఆదుకున్నది రాష్ట్ర ప్రభుత్వమే. దీనిపై వైసీపీ ప్రబుద్ధులు కొందరు కనీస అవగాహన లేకుండా విష ప్రచారం చేస్తున్నారు అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

అవగాహన లేమితో వైసీపీ విష ప్రచారం
మిర్చి, కోకో, బర్లీ పొగాకు రైతులను సైతం ఆదుకున్నాం: మంత్రి అచ్చెన్న
టెక్కలి, జూలై 4(ఆంధ్రజ్యోతి): ‘చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడి రైతులను ఆదుకున్నది రాష్ట్ర ప్రభుత్వమే. దీనిపై వైసీపీ ప్రబుద్ధులు కొందరు కనీస అవగాహన లేకుండా విష ప్రచారం చేస్తున్నారు’ అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలి పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఏటా చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడి 2.5 లక్షల టన్నులు పండేది. ఈ ఏడాది 6.5 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తూరు ప్రాంతంలో ఉన్న మామిడి రైతులతో పాటు మామిడి గుజ్జు తయారీ పరిశ్రమ యాజమాన్యాలతోనూ సమావేశమయ్యారు. మామిడి రైతాంగానికి అన్యాయం జరగకుండా చూడాలని, కిలో రూ.12 చొప్పున కొనుగోలు చేయాలని సూచించారు. పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలోనూ మామిడి ధరలు పతనం కావడంతో వాళ్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. స్పందించిన కేంద్రం కిలోకి రూ.2 ఇస్తోంది. మొత్తంగా కిలో రూ.4కు కర్ణాటక ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఆ రాష్ట్ర జీవో పట్టుకుని చిత్తూరు వైసీపీ నాయకులు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. మనం కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాం. కేంద్రం స్పందించక ముందే మన ప్రభుత్వం కిలోకు రూ.4 ఇచ్చింది. వాస్తవాలు తెలుసుకోకుండా కొందరు వైసీపీ నాయకులు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మిర్చి, కోకో, బర్లీ పొగాకు రైతులను సైతం మా ప్రభుత్వం ఆదుకుంది. మొదటిసారిగా మార్క్‌ఫెడ్ ద్వారా బర్లీ పొగాకును కొనుగోలు చేశాం’ అని మంత్రి అచ్చెన్న వివరించారు.