Guntur Collector: యశ్వంత్ కుటుంబానికి ఆసరా
ABN , Publish Date - Jul 02 , 2025 | 06:59 AM
గుంటూరు నగరంలోని వెంకట్రావుపేటకు చెందిన అలవాల యశ్వంత్ అనే బాలుడి కుటుంబానికి మంగళగిరికి చెందిన గివింగ్ బ్యాక్ టూ సొసైటీ ఆసరాగా నిలిచింది.

స్పందించిన గివింగ్ బ్యాక్ టూ సొసైటీ
కలెక్టర్ చేతుల మీదుగా టిఫిన్ బండి అందజేత
గుంటూరు(తూర్పు), జూలై 1 (ఆంధ్రజ్యోతి): గుంటూరు నగరంలోని వెంకట్రావుపేటకు చెందిన అలవాల యశ్వంత్ అనే బాలుడి కుటుంబానికి మంగళగిరికి చెందిన గివింగ్ బ్యాక్ టూ సొసైటీ ఆసరాగా నిలిచింది. జీజీహెచ్ వద్ద రైల్వే ేస్టషన్ వైపు ఉన్న తమ టిఫిన్ బండిని తొలగించారని, ఆస్పత్రి బయట ఎక్కడైనా కుటుంబానికి జీవనాధారమైన టిఫిన్ బండి పెట్టుకునేందుకు అవకాశం కల్పించాలని కలెక్టర్ నాగలక్ష్మికి యశ్వంత్ అనే పదేళ్ల బాలుడు సోమవారం విజ్ఞప్తి చేశాడు. ఈ ఉదంతంపై మీడియాలో విస్తృత ప్రచారం కావడంతో గివింగ్ బ్యాక్ టూ సొసైటీ స్పందించింది. టిఫిన్ బండి అందజేయాలని నిర్ణయం తీసుకుంది. కలెక్టర్ నాగలక్ష్మి చేతుల మీదుగా బాలుడి తల్లి అలవాల రాధికకు మంగళవారం టిఫిన్ బండి అందజేశారు. తమ కుటుంబానికి జీవనోపాధి కల్పించే విధంగా కొత్త టిఫిన్ బండి అందజేసిన గివింగ్ బ్యాక్ టూ సొసైటీ ప్రతినిధులకు బాలుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ గివింగ్ బ్యాక్ టూ సొసైటీ ప్రతినిధుల సేవా కార్యక్రమాలను అభినందించారు. సేవా భావంతో చేసే కార్యక్రమాలు ఎంతో సంతృప్తినిస్తాయన్నారు. జీవితంలో ఉన్నతస్థాయికి ఎదిగిన వారు సమాజం కోసం తమ సంపాదనలో కొంత భాగాన్ని కేటాయించాలన్నారు. ముఖ్యంగా ఉన్నత కుటుంబాలకు చెందిన వారు దీనిని బాధ్యతగా భావించాలని సూచించారు.