Share News

‘స్త్రీనిధి’ చేయూత

ABN , Publish Date - Aug 03 , 2025 | 11:54 PM

గ్రామీణ మహిళలు స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తున్నారు. ఆర్థిక క్రమశిక్షణ కారణంగా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకులు భారీగా రుణాలు మంజూరు చేస్తున్నాయి.

   ‘స్త్రీనిధి’ చేయూత
చేనేత మగ్గం ద్వారా ఉపాధి పొందుతున్న సి.లక్ష్మి

గ్రామీణ మహిళల్లో ఆర్థిక వికాసం

19,575 మంది మహిళల స్వయం ఉపాధికి భరోసా

రూ.195.62 కోట్లు రుణాలు మంజూరు లక్ష్యం

ఇప్పటికే రూ.30.01 కోట్లు మంజూరు చేసిన అధికారులు

కర్నూలు, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ మహిళలు స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తున్నారు. ఆర్థిక క్రమశిక్షణ కారణంగా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకులు భారీగా రుణాలు మంజూరు చేస్తున్నాయి. మహిళలను లక్షాధికారులను చేయాలనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుంది. బ్యాంక్‌ లింకేజీ రుణాలు ఇస్తూనే.. మరో వైపు స్త్రీనిధి క్రెడిట్‌ ఫెడరేషన సంస్థ ద్వారా మహిళలకు తక్కువ వడ్డీలకు వివిధ స్వయం ఉపాధుల కోసం రుణాలను అందిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచే మహిళలకు రుణాలు మంజూరు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 19,575 మంది మహిళలకు రూ.195 కోట్లు రుణాలు అందించాలని లక్ష్యం కాగా.. ఇప్పటికే రూ.30.01 కోట్లు అందించారు.

జిల్లాలో కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ, పాణ్యం నియోజకవర్గాల పరిధిలో 32 వేలకు పైగా స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచజీ) ఉన్నాయి. ఒక్కో సంఘంలో పది మంది మహిళలు సభ్యులుగా ఉంటూ నెలకు రూపాయి చొప్పున పొదుపు చేస్తున్నారు. 1994-95 మధ్యలో పొదుపు ఉద్యమానికి బీజం వేసిన సీఎం చంద్రబాబు మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం పలు పథకాలు అమలు చేశారు. జిల్లాలో సుమారుగా 3.25 లక్షల మంది పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. వివిధ స్వయం ఉపాధులకు రుణాలు తీసుకుంటూ క్రమం తప్పక చెల్లిస్తూ ఆర్థిక క్రమ శిక్షణ పాటిస్తున్నారు. కూటమి ప్రభుత్వం మహిళల ఆర్థిక వికాసం కోసం అమలు చేస్తున్న పథకాల్లో ‘స్త్రీనిఽధి’ ఒకటి. ఒక్కో ఎస్‌హెచజీకి రూ.5 లక్షల వరకు స్త్రీనిధి ద్వారా రుణాలు మంజూరు చేస్తారు. స్వయం సహాయక సంఘంలో సభ్యులుగా ఉన్న మహిళలు వ్యవసాయం, పొట్టెళ్లు, గేదెలు, కోళ్ల పెంపకంతో పాటు చిరు వ్యాపారాలు, చేతి వృత్తుల కోసం రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు రుణాలు తీసుకునే అవకాశం కల్పించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 19,575 మంది మహిళలకు రూ.195.62 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఇప్పటికే 1,005 ఎస్‌హెచజీల్లో 4,336 మంది మహిళలకు రూ.30.01 కోట్లు మంజూరు చేశామని స్త్రీనిధి ఏజీఎం తేజేశ్వరరావు తెలిపారు. బీమా సౌకర్యం కూడా ఉంది. రుణం తీసుకున్న మహిళలు ప్రమాదవశాత్తు మరిణిస్తే తీసుకున్న రుణం చెల్లించాల్సిన అవసరం లేదు. స్త్రీనిధి గ్రామీణ మహిళల ఆర్థిక అభివృద్ధికి అండగా ఉందని పలువురు మహిళలు పేర్కొంటున్నారు.

ఫ అవినీతికి ఆస్కారం లేని విధానం

స్త్రీనిధి రుణాలు మంజూరులో గతంలో అవినీతి అక్రమాలు జరిగాయనే ఆరోపణులు వచ్చాయి. వీవోఏలు చెప్పడంతోనే మంజూరు చేయడంతో పలు చోట్ల రుణాలు పక్కదారి పట్టాయనే ఆరోపణలు లేకపోలేదు. అవినీతికి అస్కారం లేకుండా, నిధులు పక్కదారి పట్టకుండా కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్త నిబంధనలు అమలు చేస్తున్నారు. రుణం అవసరమైన స్వయం సహాయక సంఘాల సభ్యులు దరఖాస్తు చేస్తే, వీవోఏలు ఆనలైనలో నమోదు చేస్తారు. బయోమెట్రిక్‌ తీసుకోవడంతో పాటుగా మేనేజరు ఆ సంఘానికి వెళ్లి మహిళలతో ఎందుకోసం రుణం తీసుకుంటారు, ఎటువంటి వ్యాపారం చేస్తున్నారు..? వంటి వివరాలు తెలుసుకున్న తరువాతే ఆనలైనలో రుణాలు మంజూరు చేస్తారు. దీంతో ఎక్కడ కూడా నిధులు పక్కదారి పట్టే అవకాశం లేదని మహిళలు పేర్కొంటున్నారు. 125 రకాల జీవనోపాధులకు ఈ రుణాలు మంజూరు చేస్తారు. అంతేకాదు.. ఎన్టీఆర్‌ విద్య సంకల్పం పథకం ద్వారా స్త్రీనిధిలో భాగంగా డ్వాక్రా మహిళల పిల్లలకు చదువులకు 35 పైసల వడ్డీకి రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు ఇస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులు వినియోగించుకోవడానికి అవకావం ఉంది. విద్య కోసం తీసుకున్న రుణాలను 2-3 ఏళ్ల కాల పరిధిలో చెల్లించాల్సి ఉంటుంది.

ఫ 96.85 శాతానికి పైగా రికవరీ

స్త్రీనిధి రుణాలు మంజూరులోనే కాదు.. రికవరీలోనూ ముందంజలో ఉన్నారు. 2024-25లో 19,501 మంది మహిళలకు రూ.127 కోట్లు స్త్రీనిధి రుణాలు మంజూరు చేశారు. సకాలంలో రూ.123.01 కోట్లు వసుళ్లు చేసి 96.85 శాతం రికవరీ లక్ష్యానికి చేరుకున్నారు. స్త్రీనిధి డబ్బు బ్యాంకులకు చెల్లించే క్రమంలో వీవోఏలు చేతివాటం ప్రదర్శించే అవకాశం లేకుండా ఈ ఏడాది నుంచి పేటీఎం చెల్లింపులు అమలులోకి తీసుకొచ్చారు.

ఫ స్త్రీనిధి డబ్బుతో సొంత మగ్గం

చేనేత మగ్గం పట్టుచీరలు ఉత్పత్తి చేస్తున్న చేనేత కార్మికురాలి పేరు సి.లక్ష్మి. పత్తికొండ స్వగ్రామం. ఆర్థిక స్థోమం లేకపోవడంతో అద్దె మగ్గంపైనే పట్టుచీరలు నేసేది. పొదుపు సంఘంలో సభ్యురాలిగా చేరింది. చౌడేశ్వరి గ్రామాఖ్య సంఘంలోని మేరీ ఎస్‌హెచజీ నుంచి రూ.50 వేలు రుణం తీసుకొని సొంతంగా మగ్గం ఏర్పాటు చేసుకుంది. అద్దె మగ్గం ఉన్నప్పుడు నెలకు రూ.6-8 వేలు సంపాదిస్తే, సొంత మగ్గం ఏర్పాటు చేసుకోవడంతో నెలకు రూ.15-18 వేల వరకు సంపాదిస్తుంది. స్త్రీనిధి మాకు ఆర్థిక భరోసా ఇచ్చిందని ఆమె వివరించారు.

ఫ ఎంబ్రాయిడర్‌ యంత్రం ద్వారా ఉపాధి

ఈమె పేరు దీపిక. ఆస్పరి మండలం చిన్నహోతూరు గ్రామం. చేతి ద్వారా ఎంబ్రాయిడర్‌ వర్క్‌ పని చేసేది. వారంలో నెలలో రెండు మూడు బ్లౌజ్‌లకు మించి ఎంబ్రాయిడర్‌ వర్క్‌ చేసే అవకాశం ఉండేది కాదు. శాంతి స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిగా చేరిన ఆమె స్త్రీనిధి నుంచి రూ.లక్ష రుణం తీసుకున్నారు. అధునాత ఎంబ్రాయిడర్‌ యంత్రం కొనుగోలు చేశారు. ఉన్న ఊళ్లోనే యంత్రం ద్వారా ఎంబ్రాయిడర్‌ వర్క్‌ చేస్తూ నెలకు రూ.15-20 వేలకు పైగా సంపాదిస్తున్నారు.

ఫ విస్తర్ల ద్వారా జీవనోపాధి

విస్తర్ల యంత్రాలను చూపుతున్న ఆమె పేరు విశాలాక్షి. హాలహర్వి మండలం జె.హోసళ్లి స్వగ్రామం. వ్యవసాయమే జీవనాధారం. విస్తర్ల తయారి నైపుణ్యం ఉన్నా ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. వారికి స్త్రీనిధి అండగా నిలిచింది. పారిజాతం స్వయం సహాయక సంఘం ద్వారా స్త్రీనిధి బ్యాంక్‌ నుంచి రూ.లక్ష రుణం తీసుకున్నారు. విస్తర్ల తయారి యంత్రం కొనుగోలు చేసి ఉన్న ఊళ్లో.. సొంత ఇంట్లోనే స్వయం ఉపాధి పొందుతున్నారు.

ఫ మహిళలకు ఆర్థిక భరోసా

- వైపీ రమణారెడ్డి, ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌, డీఆర్‌డీఏ-వెలుగు, కర్నూలు

స్త్రీనిధి గ్రామీణ మహిళలకు ఆర్థిక భరోసా ఇస్తుంది. ఈ ఏడాది 19,575 మందికి రూ.195 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే 4,336 మందికి రూ.30 కోట్లు ఇచ్చాం. ఇంకా రూ.165 కోట్లు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. వివిధ జీవనోపాధులకు రుణాలు తీసుకోవచ్చు. అలాగే ఎస్‌హెచజీ సంఘాల్లో ఉన్న మహిళలు తమ పిల్లల చదువుల కోసం ఎన్టీఆర్‌ విద్య సంకల్పం కింద రుణాలు తీసుకోవచ్చు. బీమా సౌకర్యం ఉండడంతో రుణాలు తీసుకున్న మహిళలు ప్రమాదవశాత్తు మరిణిస్తే ఆ రుణం మాఫీ అవుతుంది. నిధులు పక్కదారి పట్టేందుకు అవకాశం లేకుండా ఆనలైనలో రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది. తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లిస్తే మరింత రుణం తీసుకునే అవకాశంతో పాటు ఇతరులకు అవకాశం లభిస్తుంది. గతేడాది 96.85 శాతం రికవరీ సాధించాం.

Updated Date - Aug 03 , 2025 | 11:54 PM