వడ్డీ వ్యాపారిపై కొరడా
ABN , Publish Date - Aug 01 , 2025 | 11:31 PM
వడ్డీ వ్యాపారిపై పోలీసులు కొరడా ఝళిపించారు. సెర్చ్ వారెంట్‌తో త్రీటౌన్ సీఐ రామలింగమయ్య తన సిబ్బందితో కలిసి అతడి ఇంటిపై దాడు లు నిర్వహించారు.

సెర్చ్ వారెంట్‌తో ఇంటిపై పోలీసుల దాడులు
రికార్డులు స్వాధీనం
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు
ఆదోని, ఆగస్టు1(ఆంధ్రజ్యోతి): వడ్డీ వ్యాపారిపై పోలీసులు కొరడా ఝళిపించారు. సెర్చ్ వారెంట్‌తో త్రీటౌన్ సీఐ రామలింగమయ్య తన సిబ్బందితో కలిసి అతడి ఇంటిపై దాడు లు నిర్వహించారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో వడ్డీ వ్యాపారానికి సంబంధించిన రికార్డులన్నీ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రామలింగయ్య తెలిపారు. వివరాలు.. ఆదోని పట్టణంలోని సాయిబాబానగర్‌కు చెందిన బసవరాజు అనే రైతు అత్యవసర పరిస్థితుల కారణంగా తనకున్న మూడెకరాల పొలాన్ని వైఎంకే నగర్ కాలనీకి చెందిన సురేష్ శివలాల్ దగ్గర మార్ట్‌గేజ్ చేసి 2019లో రూ.1.80 కోట్ల నగదును తీసుకున్నాడు. ఆరు నెలల క్రితం వడ్డీ వ్యాపారి సురేష్ శివలాల్ మృతిచెందారు. పొలం పెట్టి తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు బసవరాజు శివలాల్ కుమారుడు యోగేష్ దగ్గరికి రైతు వెళ్లాడు. తాకట్టు పెట్టలేదని, అంతా రిజిస్ర్టేషన ఉందని యోగేష్ వివరించాడు. తాను తన పొలాన్ని అవసరాల నిమిత్తం తాకట్టు పెట్టానే తప్ప రిజిస్ర్టేషన చేయలేదని బసవరాజు ప్రాధే యపడ్డాడు. బాధితుడు బసవరాజు తమకు ఇవ్వాల్సిన మొత్తాన్ని ఇస్తే తిరిగి రిజిస్ర్టేషన్ చేయించడానికి తాము సిద్ధంగా ఉన్నామని పోలీసుల ఎదుట యోగేష్ ఒప్పుకున్నారు. వడ్డీ వ్యాపారానికి సంబంధించిన రికార్డులను తీసుకుని ఉన్నతాధికారులకు నివేదిస్తామని సీఐ రామలింగమయ్య తెలిపారు.
బసవరాజు ఫిర్యాదుతో...
రైతు బసవరాజు పొలాన్ని సురే్‌షశివలాల్ మార్ట్‌గేజ్ కాకుండా తమ కుటుంబ సభ్యులపై సేల్‌డీడ్ చేయించుకున్నారు. తాకట్టు కింద మార్ట్‌గేజ్ చేశానే తప్ప సేల్‌డీడ్ చేసుకున్నాడని, తనకు ఈ విషయం తెలియదని బసవరాజు 2025 జూన్ 3వ తేదీన త్రీటౌన్ పోలీసులను ఆశ్రయించాడు. బసవరాజు ఫిర్యాదు మేరకు సురేష్ శివలాల్ కుమారుడు యోగేష్‌తో పాటు వారి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సెర్చ్ వారెంట్‌తో శుక్రవారం వైఎంకే నగర్ కాలనీలో నివాసముంటున్న యోగేష్ ఇంటికి వెళ్లి ఎలాంటి అనుమతులు లేకుండా ఫైనాన్స్ ఎలా ఇస్తున్నారంటూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారి దగ్గర ఉన్న వడ్డీ వ్యాపారానికి సంబంధించిన రికార్డులన్నీ స్వాధీనం చేసుకున్నారు. తమకు ఏమీ తెలియదని తన తండ్రి సురేష్ శివలాల్ మాపై రిజిస్ర్టేషన్ చేయించాడని, అంతవరకు తనకు తెలుసు అన్నారు. ఎవరినీ వేధింపులకు గురిచేయలేదని, అలాంటి కుటుంబం కూడా కాదని పోలీసులకు వివరించారు.