Vijayasai Reddy: వివేకానందరెడ్డికి గుండెపోటని ఎందుకు చెప్పానంటే.. విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 25 , 2025 | 12:39 PM
వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయినట్లు మీడియాతో తాను ఎందుకు చెప్పాల్సివచ్చిందో విజయసాయిరెడ్డి ఇవాళ మీడియాకు చెప్పారు. అవినాష్‌రెడ్డికి ఫోన్ చేశానని, ఆ సమయంలో పక్కనే ఉన్న ఓ వ్యక్తి చెప్పిన సమాచారాన్ని తాను మీడియాకు చెప్పానన్నారు.

రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు అబద్ధాలు చెప్పలేదన్న విజయసాయిరెడ్డి వివేకానందరెడ్డికి గుండెపోటని ఎందుకు అబద్ధం చెప్పారని మీడియా ప్రశ్నించింది. దీనిపై మొదటిసారి విజయసాయి స్పందిస్తూ.. వివేకానందరెడ్డి చనిపోయిన తర్వాత తనకు ఓ వ్యక్తి ఫోన్ చేసి విషయం చెప్పారని, వెంటనే తాను ఆశ్చర్యపోయానన్నారు. వెంటనే పులివెందులలో ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ఫోన్ చేశానన్నారు. అవినాష్ రెడ్డి పక్కన ఉండే ఓ వ్యక్తి గుండెపోటుతో వివేకానందరెడ్డి చనిపోయారనే విషయాన్ని తనకు చెప్పారని, అదే సమాచారాన్ని మీడియాకు తెలియజేశానన్నారు. గుండెపోటుతో చనిపోయారని అవినాష్ రెడ్డి చెప్పారా అని పాత్రికేయులు అడగ్గా.. దీనిపై గుచ్చిగుచ్చి అడగవద్దన్నారు. తాను అవినాష్ రెడ్డికి ఫోన్ చేసిన మాట వాస్తవమేనని, ఆయన పక్కనే ఉన్న మరో వ్యక్తికి ఫోన్ ఇచ్చిన మాట వాస్తవమన్నారు. అవినాష్ రెడ్డి పక్కన ఉన్న వ్యక్తి చెప్పిన విషయం తాను మీడియాలో చెప్పానన్నారు.
కత్తిపోటును.. గుండెపోటుగా..
వివేకానందరెడ్డి చనిపోయిన తర్వాత విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ గుండెపోటుతో వివేకానందరెడ్డి చనిపోయారని చెప్పారు. ఆ తర్వాత రక్తపు మరకలు ఉండటంతో వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోలేదని, హత్య చేశారనే అనుమానంతో వివేకానందరెడ్డి కుమార్తె సునీత సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం సీబీఐ విచారణకు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో సునీత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. చివరకు కోర్టు ఆదేశాలతో వివేకానందరెడ్డిని హత్య చేశారని ప్రాథమిక విచారణలో తేల్చారు. ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. దాదాపు ఆరేళ్ల తరువాత విజయసాయిరెడ్డి గుండెపోటుతో వివేకానందరెడ్డి చనిపోయారని ఎందుకు చెప్పాల్సి వచ్చిందో చెప్పారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here