Sri Sathya Sai Baba: శాంతి, ప్రేమ, స్వచ్ఛమైన సేవలకు బాబా ప్రతిరూపం: ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
ABN , Publish Date - Nov 23 , 2025 | 03:12 PM
భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. బాబా శాంతి, ప్రేమ, స్వచ్ఛమైన సేవలకు ప్రతిరూపమని ప్రశంసించారు. కులం, మతం, ప్రాంతం, దేశాలకు అతీతంగా ఆయన మానవత్వాన్ని చాటిచెప్పారని అన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఈ రోజు(ఆదివారం) శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీ సత్యసాయి బాబా శాంతి, ప్రేమ, స్వచ్ఛమైన సేవలకు ప్రతిరూపమని ప్రశంసించారు. కులం, మతం, ప్రాంతం, దేశాలకు అతీతంగా ఆయన మానవత్వాన్ని చాటిచెప్పారని అన్నారు. బాబా ప్రపంచమంతా ప్రేమను పంచారని, లక్షల మందిని సేవా మార్గంలో నడిపించారని తెలిపారు.
తెలుగు గంగ కెనాల్ ద్వారా తమిళనాడులోని చెన్నై ప్రజలకు తాగు నీటిని అందించారని వెల్లడించారు. విద్య, వైద్యం, సామాజిక సేవల విషయంలో శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ కృషి మరువలేనిదని అన్నారు. దేశ విదేశాల్లో బాబా సిద్ధాంతాలు అమలవుతున్నాయని తెలిపారు. ఇక, ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, త్రిపుర గవర్నర్ ఇంద్ర సేనా రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ..‘ దేవుళ్లు ఎక్కడో ఒకచోట అవతరిస్తారు.
సతస్యాయి ఈ పుణ్యభూమిని ఎంచుకున్నారు. చిత్రావతి నది ఒడ్డున పుట్టపర్తిని ఆధ్యాత్మికతకు, దైవత్వానికి నిలయంగా మార్చారు. మావన రూపంలో మనం చూసిన దైవమే సత్యసాయి. ఆయన శత జయంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకోవడం అందరి అదృష్టం’ అని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ సత్యసాయిబాబా మనుషుల్లో దేవుడిని చూశారు. బాబా స్ఫూర్తి అందరిలో కనిపిస్తోంది. ప్రేమతో ఏదైనా సాధించవచ్చని సత్యసాయి బాబా నిరూపించారు. ప్రభుత్వాలు కూడా చేయలేని పనులు సత్యసాయి ట్రస్టు చేసింది’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
బంగారు చెవి కమ్మలు పెట్టుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలా?
చండీగఢ్ బిల్లుపై తుది నిర్ణయం తీసుకోలేదు.. కేంద్రం వివరణ