Nuzvidu Court: వల్లభనేని వంశీకి బెయిల్
ABN , Publish Date - Jul 02 , 2025 | 04:10 AM
వైసీపీ నాయకుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఏలూరు జిల్లాలోని నూజివీడు కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

నకిలీ ఇళ్ల పట్టాల కేసులో మంజూరు.. నేడు జైలు నుంచి విడుదల?
నూజివీడు, జూలై 1(ఆంధ్రజ్యోతి): వైసీపీ నాయకుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఏలూరు జిల్లాలోని నూజివీడు కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అన్ని కేసుల్లో వంశీకి బెయిల్ వచ్చినట్లయ్యింది. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి సహా పలు కేసుల్లో అరెస్టు అయిన వంశీ ప్రస్తుతం కృష్ణా జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న వంశీని ఈ ఏడాది ఫిబ్రవరి 13న హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. 2024 ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ కార్యాలయంపై అప్పటి గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న వంశీ అనుచరులు, వైసీపీ నాయకులు దాడి చేసి నిప్పుపెట్టారు. కార్యాలయ ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి, అక్కడున్న కొందరు టీడీపీ నేతలనూ గాయపరిచారు. వాహనాలనూ తగులబెట్టారు. ఆ కార్యాలయ ఆపరేటర్ ముదునూరి సత్యవర్ధన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వంశీ అనుచరుల, వైసీపీ కార్యకర్తలు మొత్తం మీద 71 మంది ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఆ కేసులో వంశీకి ఇప్పటికే బెయిల్ మంజూరైంది. బుధవారం ఆయన విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.