Tirumala: శ్రీవారి సన్నిధిలో గడ్కరీ దంపతులు
ABN , Publish Date - Aug 03 , 2025 | 05:28 AM
ప్రపంచమంతా శాంతి నెలకొనాలని శ్రీవారిని కోరుకున్నట్టు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

అనంతరం బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి
ప్రపంచ శాంతి కోసం ప్రార్థించినట్లు వెల్లడి
తిరుమల, విజయవాడ (ఇంద్రకీలాద్రి), ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): ప్రపంచమంతా శాంతి నెలకొనాలని శ్రీవారిని కోరుకున్నట్టు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. శ్రీవారి దర్శనార్థం శుక్రవారం రాత్రి తిరుమలకు చేరుకున్న ఆయన శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో కుటుంబ సమేతంగా ఆలయంలోకి వెళ్లారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలవిరాట్టును దర్శించుకున్నారు. రంగనాయక మండపంలో వేదాశీర్వచనం అందుకున్నారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆయనకు శ్రీవారి తీర్థప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల గడ్కరీ మీడియాతో మాట్లాడుతూ పేదల జీవితాల్లో వెలుగు నిండే రోజు రావాలని స్వామిని మనస్ఫూర్తిగా కోరుకున్నట్టు చెప్పారు. సాయంత్రం విజయవాడ విచ్చేసిన గడ్కరీ.. సతీసమేతంగా ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ ఈవో శీనానాయక్, వేద పండితులు, అర్చకులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం గడ్కరీ దంపతులకు ఈవో, ప్రధాన అర్చకుడు దుర్గాప్రసాద్ అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రం, లడ్డూ ప్రసాదం అందజేశారు. కేంద్రమంత్రి వెంట ఎంపీలు సీఎం రమేశ్, టి.కృష్ణప్రసాద్, రాష్ట్ర మంత్రులు సత్యకుమార్, బీసీ జనార్దన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఎమ్మెల్యే పార్థసారథి, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ ఉన్నారు.