TTD Strict Warning: రీల్స్ చేసే వారికి టీటీడీ హెచ్చరిక.. అలా చేస్తే కఠిన చర్యలు..
ABN , Publish Date - Jul 31 , 2025 | 08:39 PM
TTD Strict Warning: తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. రీల్స్ చేసే వారికి హెచ్చరికలు జారీ చేసింది. తిరుమల శ్రీవారి ఆలయం ముందు, మాడ వీధుల్లో రీల్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

తిరుమల: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలన్న పిచ్చి జనాల్లో బాగా పెరిగిపోయింది. కొంతమంది ఎక్కడ పడితే అక్కడ డ్యాన్సులు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తున్నారు. మరికొంత మంది పుణ్య క్షేత్రాలను కూడా వదలటం లేదు. దేవుడి ప్రాంగణాల్లో పిచ్చిపిచ్చి డ్యాన్సులు చేస్తున్నారు. భక్తులను ఇబ్బందులకు గురిచేయటమే కాకుండా.. వారి మనోభావాలను సైతం దెబ్బ తీస్తున్నారు. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం దగ్గర కూడా సోషల్ మీడియా ఇన్‌ప్లుయెన్సర్లు రెచ్చిపోతున్నారు.
ఈ నేపథ్యంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. రీల్స్ చేసే వారికి హెచ్చరికలు జారీ చేసింది. తిరుమల శ్రీవారి ఆలయం ముందు, మాడ వీధుల్లో రీల్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఈ పనులు ఆధ్యాత్మిక వాతావరణానికి విఘాతం కలిగిస్తున్నాయని టీటీడీ పేర్కొంది. గుడి దగ్గర కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కావాలని సూచించింది.
పవిత్ర తిరుమల క్షేత్రం కేవలం భక్తి, ఆరాధనలకు మాత్రమే నిలయం కావాలన్న విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలని తెలిపింది. వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే లక్షలాది మంది మనోభావాల పట్ల గౌరవం చూపటం ప్రతీ ఒక్కరి బాధ్యతని అంది. గుడి పవిత్రకు భంగం కలిగించేలా వ్యవహరించే వ్యక్తులపై కేసులు నమోదు చేసి.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి
కొత్త రూల్.. ఇకపై హెల్మెట్ లేకపోతే పెట్రోల్ కొట్టరు..
అమానుషం.. చిన్న పిల్లల్ని తగలబెట్టిన దుండగులు..