Share News

Lankelapalem: లంకెలపాలెంలో లారీ బీభత్సం

ABN , Publish Date - Jun 24 , 2025 | 03:20 AM

అనకాపల్లి నగర పరిధిలోని లంకెలపాలెం కూడలిలో సోమవారం రాత్రి జాతీయ రహదారిపై ఒక లారీ బీభత్సం సృష్టించింది.

Lankelapalem: లంకెలపాలెంలో లారీ బీభత్సం

  • ఆగి ఉన్న కారు పైనుంచి దూసుకువెళ్లి.. మరో లారీని ఢీకొన్న వైనం.. ముగ్గురి మృతి, పదిమందికి గాయాలు

లంకెలపాలెం/అనకాపల్లి రూరల్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి నగర పరిధిలోని లంకెలపాలెం కూడలిలో సోమవారం రాత్రి జాతీయ రహదారిపై ఒక లారీ బీభత్సం సృష్టించింది. ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ఆగి ఉన్న మూడు కార్ల పైనుంచి వేగంగా దూసుకువెళ్లి... పరవాడ నుంచి లంకెలపాలెం కూడలికి వచ్చి ఆగి ఉన్న మరొక కంటైనర్‌ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, దాదాపు పది మంది గాయపడ్డారు. అనకాపల్లి జిల్లా రేబాకకు చెందిన పచ్చికోరు గాంధీతో పాటు మరో ఇద్దరు కారులో కేజీహెచ్‌కు వెళ్లి చికిత్స పొందుతున్న తమ మిత్రుడిని పరామర్శించి వెనుతిరిగారు. రాత్రి సుమారు 10.15 గంటలకు లంకెలపాలెం కూడలికి వచ్చేసరికి సిగ్నల్‌ పడడంతో వాహనాన్ని ఆపారు. అదే మార్గంలో వెనుక నుంచి వచ్చిన లారీ.. గాంధీ కారుతో పాటు మరో రెండు కార్లను బలంగా ఢీకొంది. ఆపై కార్లను ఈడ్చుకుంటూ పరవాడ నుంచి లంకెలపాలెం వైపు వస్తున్న కంటైనర్‌ లారీని ఢీకొంది. కారులో ఉన్న గాంధీతో పాటు మరొకరు చనిపోయారు. అలాగే బైక్‌పై వేచి ఉన్న ఫార్మా ఉద్యోగి వై.ఎర్రప్పడు (30) మృతిచెందారు. మిగిలిన రెండు కార్లలోని వారు గాయపడ్డారు. లారీ బ్రేకులు ఫెయిల్‌ కావడమే ఈ ప్రమాదానికి కారణమని చెబుతున్నారు.

Updated Date - Jun 24 , 2025 | 03:20 AM